Homeఅంతర్జాతీయంనెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం

నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం

- Advertisement -

కొత్త పార్టీ ప్రకటించిన
ఇజ్రాయిల్ మాజీ ప్రధానులు

టెలఅవీవ్: ఇజ్రాయిల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించ డమే లక్ష్యంగా ఇద్దరు మాజీ ప్రధానులు ఏకమై కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. నెతన్యాహుకు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్‌లు తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి ‘టుగెదర్, లెడ్ బై బెన్నెట’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల విలీనం ప్రభావం ఉంటుం దని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. ఈ పార్టీల విలీనం ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇజ్రాయిల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నారు. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ మాట్లాడుతూ ఇరు పార్టీల విలీ నాన్ని ఒక చరిత్రాత్మక అడుగుగా పేర్కొ న్నారు. ఇజ్రాయిల్ హితం కోసం లాపిడ్‌తో కలిసి మంచి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఐక్యత విభజన యుగం ముగియడాన్ని సూచిస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి కేవలం జియోనిస్ట్ ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. అరబ్ పార్టీలతో సంకీర్ణం ఏర్పాటు చేయబోదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఇజ్రాయిల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులపై (2023 అక్టోబరు 7న) జాతీయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సార్వత్రిక నిర్బంధ సైనిక సేవను చట్టంగా ప్రవేశపెడతామని వివరించారు. అలాగే ప్రధానమంత్రులకు ఎనిమిదేళ్ల పదవీకాల పరిమితిని విధిస్తామన్నారు. జాతీయ భద్రతా ప్రాధాన్యతలను నొక్కి చెబుతూనే పౌర, స్వలింగ వివాహాలను ప్రోత్సహించే ప్రణాళికలను బెన్నెట్ వివరించారు. దేశ భూములను కాపాడుకుంటామని, శత్రువుకు ఒక్క సెంటీమీటర్ నేలను కూడా అప్పగించమని అన్నారు. యషర్ పార్టీ అధినేత గాడి ఐసెన్‌కోట్‌ను కూడా తమ కూటమిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమతో కలిసి రావాలని కోరారు. మరోవైపు, లాపిడ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తటస్థ ఓటర్లు తమ కొత్త కూటమికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 2019- 2021 మధ్య ఇజ్రాయిల్‌లో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాలేదు. దీంతో బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లిక్‌డ్ పార్టీ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నెతన్యాహుకు సభ్యులు మద్దతు ఉపసంహరణతో బెన్నెట్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని కారణాల వల్ల లాపిడ్ ప్రధాని అయ్యారు. వీరి సంకీర్ణం ప్రభుత్వం ఏడాదిలోపే కుప్పకూలింది. మళ్లీ 2022లో నెతన్యాహు ప్రధాని పదవి దక్కించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు