Friday, February 21, 2025
Homeవిశ్లేషణపేదల సొంతింటి కల ఫలించేనా…!

పేదల సొంతింటి కల ఫలించేనా…!

డాక్టర్‌ సి.ఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి
పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆశల్లో సొంత ఇల్లు ప్రధానమైంది. సాకారం అవ్వాలని కోరుకునే కల కూడా ఇదే. జీవితంలో తాము స్థిరపడ్డామనే భావన సొంత ఇంటితోనే కలుగుతుంది. జీవితంలో ఆర్థిక భద్రత, సామాజిక స్థాయి పెరుగుదలకు సొంత ఇల్లు ముఖ్యమనే భావనే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇళ్ల ధరలు, భూమి ధరలు చుక్కలనంటుతున్నాయి. మరోవైపు నిర్మాణ వ్యయం రోజు రోజుకీ పెరుగుతున్నది. ఒక పక్క స్థిరాస్తుల మార్కెట్‌ విలువను ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతుండగా, మరో పక్క రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగి భారమవుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా మృగ్యమవుతున్న నేటి పరిస్థితుల్లో చమటోడ్చి సంపాదించే దానిలో 50 శాతం వరకూ అద్దె ఇళ్లకు కేటాయించాల్సి వస్తున్నదని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే శ్రమజీవులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పూట గడుపుకోవడం కోసమే ఆహోరాత్రులు పనిచేయక తప్పని పేదలు, అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు సొంత ఇల్లును కనీసం ఊహించుకునే పరిస్థితి ఉండడంలేదు. అందుకే ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం గుప్పిస్తున్న అనేక హామీల్లో పేదలందరికీ సొంత ఇల్లు నిర్మాణం ప్రాధాన్యతను పొందుతూ ఉంటున్నది. వారి ఎన్నికల మేనిఫేస్టోల్లోనూ ఇళ్ల హామీ కచ్చితంగా ఉంటోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదంటూ తీవ్రమైన ఆవేదనతో, నిర్వేద పూరితమైన మాటలు మాట్లాడారు. ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లనే నిర్మిస్తామని అత్యంత అట్టహాసంగా, ఆడంబరంగా నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు వారి పేర్లతో ఇళ్ల పట్టాలు ఇచ్చినా వారు ఓట్లు ఏమయ్యాయో అనేది ఆయన ప్రశ్న. సాంతంగా ఆలోచిస్తే సొంత ఇల్లు కలను సాకారం చేయడం కోసం ఆ పని చేసి ఉంటే ఓట్లు పడే ఉండేవేమో. కానీ వారి మాటల్లో కనిపించిన నిజాయితీ చేతల్లో కనిపించలేదు. జగనన్న గృహ నిర్మాణ పథకం కింద 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో 17 వేల జగనన్న కాలనీల కోసం 55 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నా జరిగింది వేరు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలోనే అధికార పార్టీ పెద్దలు సుమారు రూ. 6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే అరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూములు ఎక్కువ శాతం నివాసయోగ్యం కావనీ తేలిపోయింది. తీవ్రమైన ముంపు ప్రాంతాలతో పాటు అటవీ భూములు, కొండలు, గుట్టలు, చిన్న వర్షాలకే నీటి మునిగే భూములనే లేఅవుట్లుగా మార్చిన జగన్‌ ప్రభుత్వం తమను ఏమార్చిందనే భావన అప్పట్లోనే ఓటర్లలో వ్యక్తమైంది. పైగా పట్టణ ప్రాంతంలో సెంటు, పల్లెలో సెంటున్నర స్థలం అనే ప్రకటన లబ్ధిదారుల్లో ఏర్పడిన అసహనానికి ఒక కారణం. పట్టణాల్లో ఇప్పటికే ఉన్న మురికివాడలకుతోడు సెంటు స్థలంలో నిర్మించే ఇళ్లతో మరిన్ని మురికి వాడలు రూపొందుతాయనే వాదన చర్చల్లోకి వచ్చింది. జగనన్న కాలనీల పథకం ప్రారంభంలో ప్రభుత్వమే ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తుందని చెప్పిన మాటను క్రమంగా అటకెక్కించారు. ఇంటి స్థలం, అందులోనే పక్కాగృహ నిర్మాణం అంటూ ఆర్భాటం చేసి అమలు విషయంలో చేతులెత్తేశారు. నిర్మాణం కోసం ముందుగా మూడు రకాల ఆఫ్షన్లు ఇచ్చి చివరికి లబ్ధిదారులే నిర్మాణాలు చేపట్టాలంటూ తొండి చేశారు. లక్షా 80 వేలు ఇస్తాము…మీ తిప్పలేవో మీరే పడండని చేతులు దుపులుపుకోవడానికి ప్రయత్నించడంతో మొత్తం ఆ ప్రక్రియే అస్తవ్యస్థంగా మారింది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టీపట్టనట్టు వ్యవహరించిన జగన్‌ ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని 18 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్టు హడావిడి చేసినా ఇప్పటికీ అందులో 75 శాతం వరకూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ఎన్నికల తరుణంలో జగన్‌ ప్రభుత్వంలా కాకుండా పల్లె ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇళ్లు నిర్మాణాలను చేపట్టి పేదల కలలసౌధాన్ని పూర్తి చేస్తామని చెప్పిన మాటలు ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపింది. ఎన్నికల నాటి హామీ హామీగానే మిగలకుండా కార్యరూపంలోకి తెస్తున్నామనే సారాంశంతో ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం సంతోషించదగ్గ పరిణామమే. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని అనడంలో సందేహంలేదు. పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లలో ఇంటి నిర్మాణం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రారంభం అవుతుందని అధికార పార్టీ నేతలు అనధికారికంగా అంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చే రూ.2.50 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు కలిపి మొత్తంగా రూ. 4 లక్షలతో ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడవచ్చనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తున్నది.
గత ప్రభుత్వం లెక్కలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలు 32 లక్షల మంది వరకే ఉంటారని అనుకుంటే పొరపాటే అవుతుంది. దానికి రెట్టింపు మంది పేద ప్రజలు సొంత గూడు కోసం ప్రభుత్వ కార్యాలయాల చూట్టూ తిరిగి అలసిపోయి ఉన్నారు. వారంతా ఈ ప్రభుత్వంలోనైనా సొంతింటి కల సాకారం అవుతుందని ఆశగా చూస్తున్నారు. వీటన్నిటికి మించి జగన్‌ ఆరాÊబటంగా చేపట్టిన హౌసింగ్‌ స్కీములోని లోపాలను సరిదిద్దడం, జనం నివసించడానికి ఇప్టడని లే అవుట్లను మార్చడం, సెంటు స్థానంలో రెండు సెంట్ల కేటాయింపు ఇవన్నీ జీవోలు విడుదల చేసినంత సులభం కాకపోవచ్చు. సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధితో కూడిన సంక్షేమం తమ విధానమంటున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటినీ నిలుపుకోవడం నల్లేరు మీద నడక కాదు. అయితే జనం పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లకుండా ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.
సెల్‌: 9059837847

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు