సంగిరెడ్డి హనుమంతరెడ్డి
మన దేశంలో వైదికవాద మూర్తి పూజ విగ్రహ నిర్మాణాలకు మూలం. విగ్రహారాధన మౌర్య శకం అనగా ప్రస్తుత శకం 300లలో జైన, బౌద్ధ మతాల ప్రభావంతో మొదలయ్యింది. రాజుల విజయ చిహ్నాల స్థాపనగా మారింది. విగ్రహ స్థాపన ఆచారం వలస పాలనలో ఎక్కువయింది. ఐరోపా రాచరిక ఆరాధనకు సంకేతమయింది. అంబేద్కర్ భారత విగ్రహ భూమిని విమర్శించారు. అయితే ఓట్ల కోసం, దళితులను దువ్వడం కోసం ఆయన విగ్రహ స్థాపన విస్తృతంగా జరుగుతోంది. విప్లవాలకు నాయకత్వం వహించి విప్లవాలను విజయవంతం చేసినవారి, సంఘ సంస్కర్తల, జాతీయ ఉద్యమ, చరిత్ర, సంస్కృతి నిర్మాతల విగ్రహాలను, స్మారక చిహ్నాలను నిర్మిస్తారు.
విగ్రహ నిర్మాణానికి నియమాలు లేవు : విగ్రహ నిర్మాణానికి జాతీయ, అంతర్జాతీయ నియమాలు లేవు. మనకు సుప్రీం కోర్టు సూచనలు ఉన్నాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అనుమతులు అవసరం. చట్టబద్దత, క్రమబద్దీకరణ, కళాత్మక, సాంకేతిక, సాంస్కృతిక, ఆచరాణాత్మక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.కీర్తిశేషులైన వారి విగ్రహాలే ఏర్పాటుచేయాలి. చారిత్రక ప్రసిద్ధి గాంచిన పౌర, సైనిక, శాస్త్రవిజ్ఞాన, సాంస్కృతిక, సేవా రంగాలలో విశిష్ట కృషిచేసి పేరుమోసిన వ్యక్తుల విగ్రహాలనే స్థాపించాలి. వాతావరణానికి, పర్యావరణానికి హాని చేయని, శీతోష్ణ పరిస్థితులకు, వర్షాలకు తట్టుకునేలా విగ్రహ నిర్మాణాలు జరగాలి. మహారాష్ట్ర సింధు దుర్గ్ జిల్లా మాల్వాన్ రాజకోటలో ప్రధాని ప్రారంభించిన శివాజి విగ్రహం 2024 ఆగస్టు 26న కుప్పకూలిన విషయం తెలిసిందే. భావితరాలకు ఆ విగ్రహాలు, వ్యక్తుల చరిత్ర వారిలో స్ఫూర్తిని నింపుతాయి. ఈ విలువల పెంపుదల ప్రజల అవగాహనపై, అభిప్రాయాలపై, సామాజిక విలువలపై ఆధారపడి ఉంటుంది.
విగ్రహాల వలన ఎవరికి మేలు : విగ్రహాలు పెట్టే వ్యక్తుల విజయాలు ఎవరికి మేలు చేశాయి. వాటి ప్రచార ఫలితాలు ఎవరికి అందుతాయి అన్నదే ఇక్కడ ప్రధానం. విగ్రహాలు కొందరిని ఎన్నికల్లో గెలిపిస్తాయి. కొన్ని కులాలకు, ఒక వర్గానికి మాత్రమే మేలు చేస్తాయి. వెనుక్కు నెట్టబడిన వారికి కీడు కలిగిస్తాయి. పాలకవర్గ జవాబుదారీతనాన్ని తగ్గిస్తాయి. నిరంకుశత్వాన్ని పెంచుతాయి. పాలక, ప్రతిపక్ష పార్టీలకు ఇద్దరికీ వేరువేరు అనుకూలతలను కల్పిస్తాయి. విగ్రహాల రూపంలో మతారాధనలు ఫాసిస్టు లక్షణాలు పెరుగుతాయి. నేటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పోకడలు అత్యంత అపాయకరం. ఆధునిక పాత్రికేయత కూడా ఈ ధోరణులకు మద్దతునిస్తోంది.
విగ్రహాలు ప్రజలను చీలుస్తాయి : నేటి నేతలు మంచి భవిష్యత్తును కోరుకునే రాజనీతిజ్ఞులు కారు. తత్కాలీన స్వార్థ రాజకీయులు. స్వపక్ష పక్షపాతులు. నేటి నేతల విగ్రహాలు విలువలకు, విధానాలకు తిలోదకాలిచ్చాయి. మనుషులకు దివ్యత్వాన్ని ఆపాదించాయి. నాయక వ్యక్తి పూజ, విగ్రహారాధన ఆచారాలకు, దేశభక్తి పేరుతో కులమతాధార ఓట్ల సమీకరణకు, ఆధిపత్య కేంద్రీకరణకు, అధికార లబ్ధికి, కొనసాగింపునకు, సమాజ విభజనకు, సాంస్కృతిక చారిత్రక వక్రీకరణకు, అసమానతలకు దారితీస్తున్నాయి. విగ్రహ ప్రతిష్టాపకుల అభిప్రాయాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. విగ్రహ వ్యక్తులను ఆకాశానికి ఎత్తుతాయి. సామూహిక మనోభావాలను చారిత్రక సత్యాలుగా చిత్రిస్తాయి. గుర్తింపులను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. భావితరాల అభిప్రాయాలను తప్పుదోవ పట్టిస్తాయి. ప్రజల మరుపుతో అసంఖ్యాక శ్రమజీవుల శ్రమను ఒక వ్యక్తికి కట్టబెడతాయి. విగ్రహనాయకుని రాజ్య భాగస్వామిగా, సమాజ భాగంగా చిత్రిస్తాయి. జాతిపిత స్థాయిలో నిలబెడతాయి. వీటికి భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా దిగజార్చుతాయి. పలు పూజా ప్రక్రియలతో విగ్రహాల పట్ల భావోద్వేగాలను పెంచి మతారాధనలను స్థిరపరుస్తాయి. ఉద్యమాలలో కష్టజీవుల పాత్రను పక్కనబెట్టి ప్రత్యామ్నాయ విధానాలకు, ఆలోచనలకు తావు లేకుండా చేస్తాయి. ప్రజలను కలపవు…చీలుస్తాయి. ఇవి సర్వజన ప్రతీకలు, సమాజ సంస్కరణ చిహ్నాలు కావు. కులమత ప్రచారాల సాధనాలు. నేటి నేతల విగ్రహాలు నిరంకుశ రోమన్ చక్రవర్తుల బొమ్మలను గుర్తుచేస్తాయి. ఈ విగ్రహాల నిర్మాణ ఖర్చు చర్చనీయాంశం.
ఏ విగ్రహం దేనికి సంకేతం : విగ్రహాలు స్థాపకుల ఆసక్తులను, అభిరుచులను తెలుపుతాయి. మెక్సికో, క్యూబాలలోని అబ్రహాం లింకన్ విగ్రహాలు ఆయన జాత్యహంకార వ్యతిరేకతకు, బానిసత్వ నిర్మూలనకు సంకేతాలు. హంగేరి, పోలండ్‌లో రొనాల్డ్ రీగన్ విగ్రహాలు ఆ దేశాల కమ్యూనిస్టు వ్యతిరేకతకు చిహ్నాలు. ప్రపంచవ్యాపితంగా నెల్సన్ మండేల విగ్రహాలు ఆయన జాతివ్యతిరేకతకు గుర్తులు. పూర్వ సోవియట్ యూనియన్‌లో జోసెఫ్ స్టాలిన్ విగ్రహాలు ఆయన రాజనీతిజ్ఞతకు, సోషలిస్టు రాజ్య నిర్మాణ కాంక్ష-దక్షతలకు, ప్రజా పక్షపాతానికి సంకేతాలు. పాలక ప్రేరణతో స్పెయిన్‌లో స్థాపించిన ఆ దేశ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో విగ్రహాలను ఇటీవల తొలగించారు. ప్రపంచ వ్యాపితంగా స్థాపించబడిన మన స్వాతంత్య్ర సమరయోధుడు మోహన్‌చంద్ గాంధీ విగ్రహాలు ఆయన అహింసావాదానికి, నిరాడంబరతకు, సత్యాగ్రహ పోరాట పద్దతికి ప్రతీకలు. ఆయన ఎప్పుడూ అడుగుపెట్టని అమెరికాలో గాందీ ó విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. గాంధీయ అనుచర నాయకులు అమెరికాలో ఎక్కువగా ఉండటం అందుకు కారణం కావచ్చు. యుపిలో మాయావతి విగ్రహ స్థాపనపై 2009లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యంపై 2025 జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు యిచ్చింది. రాజకీయ పార్టీల గుర్తుల, నాయకుల విగ్రహాల నిర్మాణంలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని, ఈ విషయంలో ఎన్నికల సంఘం సూచనలను పాటించాలని ఆదేశించింది. దేవుడే పూజారికి లొంగినట్లు ఎన్నికల సంఘం పాలకుల వశమైన వేళ ప్రజలకు దేవుడే (శూన్యమే) దిక్కు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును నాయకుల ప్రచారానికి కాక ప్రజా సంక్షేమానికి వాడాలని సుప్రీంకోర్టుతో సహా అనేక కోర్టులు పలుమార్లు ఆదేశించాయి.
ఏ విగ్రహం ఎంత ఎత్తు : యూకేలో మరణించిన పదేళ్ల తర్వాతే విగ్రహాలను నిర్మించాలి. విగ్రహాల ఎత్తు యూకేలో 8అడుగులు, అమెరికాలో 11 అడుగులు మించరాదు. వ్యక్తుల చందాలు, స్వచ్ఛంద బహూకరణలు, రాజకీయ పక్షాల ధార్మిక సంస్థల నిధులతో విగ్రహాలను నిర్మించాలి. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తుల, సామాజిక సంస్కర్తల విగ్రహాల ఏర్పాటు సమైక్యతకు దారితీస్తాయి. వారి గౌరవ ప్రతిష్ట, వారసత్వ విలువలు , వారి విజయాలు ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం : ఎన్టీఆర్ 116 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 200 ఎకరాల స్మారక పథకంలో భూమి కాకుండానే, రూ.1,750 కోట్ల విగ్రహ ఖర్చుతో నిర్మిస్తారట. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య సౌకర్యాల కల్పన, నిర్వహణలకు కేటాయించిన మొత్తం రూ.1,900ల కోట్లు. రూ.1,750కోట్లతో 9 పెద్ద వైద్యశాలలను ఏటా 1,350 మంది వైద్యులను తయారుచేసే 9 వైద్య కళాశాలలను స్థాపించవచ్చు. గిరిజనులకు వందల పాఠశాలలను, వసతి గృహాలను, వైద్యశాలలను నిర్మించి నిర్వహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రూ.873 కోట్లతో 49 పారిశ్రామికవాడలను ప్రతిపాదించింది. రూ.1,750 కోట్లతో 100 పారిశ్రామికవాడలను స్థాపించవచ్చు. గుంటూరు శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ లాంటి 18 బ్రిడ్జ్‌లను కట్టవచ్చు.శిలాజీకరించిన విగ్రహాలు మాత్రమే విగ్రహ వ్యక్తుల గౌరవ ప్రతిష్టలను పెంచవు. వారి ఆదర్శాల ఆచరణ వారికి నిజమైన నివాళి. విగ్రహ వ్యక్తులు పని చేసిన ప్రజారంగంలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిధిలో విశేషంగా కార్యక్రమాలు జరిపి ప్రజలకు ఉపయోగపడటం శ్రేయస్కరం. ఆ వ్యక్తుల పేరుతో గ్రంథాలయాలను, పాఠశాలలను, ప్రయోగశాలలను, పరిశోధన సంస్థలను, రక్త నిధులను, వైద్యశాలలను, సామూహిక సమావేశ మందిరాలను స్థాపించాలి. విగ్రహ ప్రతిష్టతో సహా ఏ పథకమైనా సామాన్య ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చాలి. పాలకవర్గాల, బహుళజాతి సంస్థల కొమ్ము కాయకూడదు.
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి,
గుంటూరు, సెల్ : 9490204545


