బి.రామారావు
గిరిజన సమాజాల్లో మహిళల వారసత్వ హక్కుల అంశం ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారానికి నోచుకోలేదు. ఎక్కువ గిరిజన సమాజాల్లో అమలులో ఉన్న సంప్రదాయ చట్టాలు మహిళలకు సంపూర్ణ ఆస్తి హక్కులు కల్పించడం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఇస్తున్నప్పటికీ, గిరిజన మహిళలను ఆ చట్ట పరిధి నుంచి మినహాయిస్తోంది. ఇటీవలి కాలంలో హిందూ సంప్రదాయాలను స్వీకరించిన గిరిజన మహిళలకు మాత్రమే కొన్నిసార్లు వారసత్వ హక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ అస్థిర విధానం గిరిజన మహిళల్లో అయోమయం, అసమానతలకు దారితీసింది. ‘హిందూకరణ’ ఆధారంగా హక్కులు ఇవ్వడం, మరికొన్ని సందర్భాల్లో మినహాయింపులు వర్తింపజేయడం వల్ల గిరిజన మహిళలు నిరంతర న్యాయ అనిశ్చితిని ఎదుర్కొన్నారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
2025 అక్టోబర్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో హిందూ వారసత్వ చట్టం గిరిజనులకు వర్తించదని స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్కు ఈ చట్టాన్ని వర్తింపజేయలేమని, గిరిజనులకు ప్రత్యేక రక్షణ కల్పించాలనే చట్టసూత్రాన్ని న్యాయస్థానం మరోసారి ధృవీకరించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్లో ఈ తీర్పు వెలువడింది. ‘హిందూకరణ’ పొందిన గిరిజన మహిళలు హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పొందవచ్చన్న హైకోర్టు వ్యాఖ్యానాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గిరిజనులకు చట్టాన్ని విస్తరించే అధికారం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తన పరిధిని మించి శాసన మార్పులకు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గిరిజనుల వారసత్వ వ్యవహారం వారి సంప్రదాయ చట్టాల పరిధిలోనే ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకున్నప్పుడే మార్పులు సాధ్యమని పేర్కొంది.
లేవనెత్తిన ప్రశ్నలు
ఈ తీర్పుతో కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గిరిజన మహిళలకు సమాన వారసత్వ హక్కులు పొందాలంటే తప్పనిసరిగా ‘హిందూకరణ’ మార్గమేనా? మత ఆధారంగానే హక్కులు కల్పించాలా? గిరిజనుల ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక స్వరూపాన్ని విస్మరించవచ్చా? చట్టపరమైన స్పష్టత లేకపోతే సంప్రదాయాల పేరిట గిరిజన మహిళలు వివక్షను ఎదుర్కోవాల్సిందేనా? అన్న చర్చ ఉధృతమైంది.
గిరిజన గుర్తింపు – చట్టపరమైన స్పష్టం
‘హిందూ’ అనే పదానికి సంబంధించి గత తీర్పులను ప్రస్తావించిన సుప్రీంకోర్టు, హిందూమతం ఒక జీవన విధానంగా విస్తృతంగా అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. వ్యక్తి హిందువుగా పుట్టవచ్చు లేదా మారవచ్చు, కానీ మార్పు నిజమైన విశ్వాసంతో స్పష్టంగా ఉండాలనేది కోర్టు అభిప్రాయం.
అయితే, గిరిజనులు తమ సంప్రదాయాలు, వారసత్వ ఆచారాలు, వివాహ విధానాలను అనుసరిస్తే, వారు మత మార్పు జరిగినా గిరిజనులుగానే కొనసాగుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది గిరిజనుల ప్రత్యేక గుర్తింపును కాపాడే రాజ్యాంగ హామీకి అనుగుణమని తెలిపింది.హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 2(2) చెల్లుబాటును ఈ తీర్పు మరోసారి ధృవీకరించింది. ఈ నిబంధన షెడ్యూల్డ్ ట్రైబ్స్ను చట్ట పరిధి నుంచి మినహాయిస్తుంది. గతంలో ఈ సెక్షన్ను విస్తరించి గిరిజనులను హిందువులుగా పరిగణించాలన్న ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. అలా చేస్తే గిరిజన మహిళలు తమ గుర్తింపును వదిలే పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేసింది.
ముందున్న అవకాశం
ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో, గిరిజనుల వారసత్వ హక్కుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో గిరిజన సంప్రదాయ వారసత్వ చట్టాలను సంక్రమబద్ధీకరిస్తే, గిరిజన గుర్తింపును కాపాడుతూ మహిళలకు సమాన హక్కులు కల్పించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
సీనియర్ జర్నలిస్టు
సెల్ : 9030715343


