విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టినట్లయితే మల్లిక ప్రాణాలు కాపాడే అవకాశముండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైంది కాదని విమర్శించారు. మల్లిక మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో హిజ్రాలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


