చింతపట్ల సుదర్శన్
అరుగు అంచున కూచుని ఆకాశంలోకి చూస్తున్నది డాగీ. అప్పటికి మూడు నాలుగు సార్లు డాగీని పిలిచి పలకకపోవడంతో పెద్దగా అరవాల్సి వచ్చింది డాంకీకి. ఏమిటి డాగీ. ఏమైంది నీకు. అరగంట నించి చూస్తున్నాను అసలు అరవడమే లేదు నువ్వు. అధికారంలో ఉన్నవాళ్లూ, లేనివాళ్లూ అయిన పొలిటీషన్స్ గంట గంటకీ అరుచుకున్నట్టు నీలాంటి డాగీలు ప్రతి పదినిమిషాల కొకసారైనా అరవాలి కదా. ఎందుకు అరవడం లేదు. కొంపదీసి అరవడం మరచిపోలేదు కదా అంది డాంకీ. అరవడం మరిచిపోయిన లీడర్లు రిటైరైనట్టే, అరవడం మానేసిన డాగీ రోజులు దగ్గర పడ్డట్టే. నాకూ ఇంకా ఐదారు ఎలెక్షన్ల దాకా బతకాలనే ఉంది కానీ నా అదృష్టం ఎలా ఉందో తెలీక ఏమైనా తెలుస్తుందేమోనని ఆకాశంలోకి చూస్తున్నాను అంతే. ఏమిటేమిటీ నీ అదృష్టం ఎలా ఉందో ఆకాశంలో కనిపిస్తుందా? అని పళ్లికిలించింది డాంకీ. అవును. కాదా మరి. మనుషుల అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్య దౌర్భాగ్య సంఘటనలూ ఆకాశంలో ఉండే గ్రహాలు తేలుస్తయట కదా. నాకూ అదృష్టాన్ని తెచ్చిపెట్టే గ్రహాలు కనపడతాయేమోనని ఆకాశంలో వెదుకుతున్నా అంది డాగీ. ఈసారి డాంకీ చాలాసేపు పళ్లికిలించి, నీ మొహం సూర్యుడూ, చంద్రుడూ తప్ప ఏ గ్రహాలూ మనకు కనిపించవు అంది. మరి నువ్వే అన్నావు కదా మనుషుల్లో కొందరు స్వాములకు, ఆకాశంలో ఏ గ్రహాలు ఎటునుంచి ఎటు తిరుగుతాయో, ఎక్కడ కొన్నాళ్లు సెటిలవుతాయో. వాటి తిరుగుళ్ల వల్ల రాజకీయ నాయకులు తాము ఎలెక్షన్లల్లో గెలిచేది లేనిది, సినిమా వాళ్లయితే జనాన్ని దోపిడీ చేసేది లేనిది, ఆ స్వాముల నడిగి తెలుసుకుంటారని. అవును అన్నాను, ప్రమాణ స్వీకారం చెయ్యాలన్నా, పత్రాల మీద వేలిముద్రలు వేయాలన్నా మనుషులకు చేతిలో గీతలూ, తలరాతలే ఉంటాయన్న నమ్మకం ఉంది. కాని ఈ గ్రహాలూ, తలరాతా, కలిసి వచ్చే కాలమూ, ఇలాంటివి మనుషులకు సంబంధించిన విషయాలు కుక్కలకీ, గాడిదలకీ ఇవేవీ వర్తించవు. మనల్ని గురించి గ్రహాలూ, ఆ పైవాడూ పట్టించుకోడు వదిలెయ్యి అంది డాంకీ.
ఆ పైవాడికి మరీ ఇంత పక్షపాతమా? మనుషులకే కాదు మనకూ ప్రాణాలున్నవి కదా. ఆ మధ్య మనుషులు కుక్కల మీద ఎంత ప్రేమ వలకబోశారు. వసతి గృహాలు కట్టిస్తామన్నారు. వేళకు ఇంత తిండి పెడతామన్నారు. ఇంకా అమలు చేస్తున్నట్టు లేదు. ఎప్పుడు అమలవుతాయో ఎప్పుడు నా కష్టాలు తీరుతాయో, అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందోనని ఆకాశంలోకి చూస్తూ కూచున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తే అర్థమైంది ఇదంతా ‘వేస్టు’ అని, పైవాడికి మనమంటే లెక్కేలేదని, అంటూ డాగీ వెనక్కి వచ్చి గోడ వారన కూచుంది. అప్పుడేదో వీధి కుక్కలు కరిచి చంపుతున్నాయని భయపడి మనుషులు అంటే నాయకులు ఆ కూతలు కూశారు. వారి మాటలు నీటి మూటలు కదా. అవసరానికో అబద్ధం కాదు అనవసరంగా కూడా అబద్ధాలాడటం వారికలవాటు. అయినా వాళ్లనంటే ఏం లాభంలే. పైవాడికే మనమీద మెల్లకంటి చూపో, ఒంటి కంటి చూపో మరి అని డాంకీ అంటుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి.
పైవాడనే మాట వినపడిరది ఏ పైవాడు అన్నాడు అబ్బాయి. ఎంతమంది పైవాళ్లు ఉంటారేమిటి? అండి డాగీ. ఎందుకుండరూ ప్రతి రంగంలోనూ పెత్తనాలు సాగించే పైవాళ్లుంటారు. అవసరం లేకపోయినా రెండు దేశాల మధ్య తలదూర్చి పెత్తనం చేసేవాడూ, ఓ దేశానికి ఆయుధాలు సప్లయి చేస్తూనే ఓ పదో పాతికో శాంతి సూత్రాలు పాటించమని సలహా ఇచ్చే పైవాడూ ఉంటాడు అన్నాడబ్బాయి. ఈ మాట నిన్నామొన్న కూడా విన్నా. అసలు అంతర్జాతీయ ప్రమాణాలంటే ఏమిటి ‘బ్రో’ అనడిగింది డాంకీ. ఏముందిలే ఒక దేశం మీద మరో దేశం దాష్టీకం చేస్తుంటే, హింస రచన చేస్తుంటే మానవతా దృక్పథంతో సాయం చెయ్యడానికి వెళ్లిన వాళ్లను బంధించడం, టాయిలెట్ల నీరు తాగించడం, నల్లులతో కరిపించడం వంటివి అక్షరాలా పాటించడమే అన్నాడు అబ్బాయి.
అదా విషయం! మరి ఇరవై సూత్రాల శాంతి పథకం పని చేస్తుందంటావా. ప్రపంచంలో ఇక యుద్ధమనే మాట వినపడదంటావా అన్నది అమాయకరంగా డాగీ. ఏదో ఒకటి మనసులో పెట్టుకుని పలికే శాంతి ప్రవచనాలు పని చేయవు. ఆ సంగతి ఈ పైవాడికి అర్థం కావడంలేదు మరి అంది డాంకీ. ప్రపంచం మీద పెత్తనం చలాయించాలనుకునే పైవాడికి ఆ పైనున్నవాడు బుద్ధి చెప్తే బాగుండును అన్నది డాగీ ఆకాశంలో కనపడని పైవాడి కోసం చూస్తూ.
పైవాడు
- Advertisement -


