మంత్రి నారాయణ
విశాలాంధ్ర – తుళ్లూరు : ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రుణాలు తీసుకున్నామని, భూముల ధరలు పెరిగాక వాటిని విక్రయించి అప్పు తీరుస్తామని చెప్పారు. ప్రజాధనం వృథా చేస్తున్నామని ప్రతిపక్షం చెబుతున్నదాంట్లో వాస్తవం లేదన్నారు. మంగళవారం మంత్రి రాజధాని అమరావతిలో పర్యటించారు. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీఆర్‌డీఏ కార్యాలయ భవనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. రూ.43 వేల కోట్లకు గత 2014-19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని… అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయని, ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో బిల్డింగుల నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామని మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి 90 శాతం పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ముందుగా జంగిల్ క్లియరెన్స్‌తో పనులు మొదలు అయ్యాయన్నారు. మంత్రులు, జడ్జీలు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకు కలిపి 186 భవనాల నిర్మాణం జరుగుతున్నాయని, గెజిటెడ్ అధికారులకు 1,440,ఎన్జీవోలకు 1,995 భవనాలను నిర్మిస్తున్నామన్నారు. హైకోర్టు 16.85 లక్షల చదరవు అడుగులు, అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో నిర్మించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.