విశాలాంధ్ర – తిరుమల కల్చరల్ : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలను కట్టాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడిరచారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ‘భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలి. ఏడు కొండలు.. వేంకటేశ్వరస్వామి సొంతం. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించా’ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవని… ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ‘నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్ర మాలు ప్రవేశపెట్టాం. మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం’ అన్నారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
3 హోటళ్లకు భూ కేటాయింపుల రద్దు
గత ప్రభుత్వంలో కొండకు ఆనుకుని ఉన్న దేవలోక్, ముంతాజ్, ఎంఆర్కేఆర్ హోట ల్స్‌కు అనుమతులు ఇచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఈ కేటాయింపులను రద్దు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏడు కొండలు ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడం, అపవిత్రం చేయడానికి వీల్లేదన్నారు. ‘టీటీడీలో పని చేసే ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం…వేంకటేశ్వర స్వామి పవిత్రను కాపాడటానికి ఒకడుగు ముందుకేయాలి గానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించ వద్దు. దేశం, ప్రపంచంలో వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నాం. టీటీడీలో పని చేసేవారు హిందువులై ఉండాలి ఇతర మతస్తులకు గౌరవ ప్రదంగా మరోచోట అవకాశం కల్పిస్తాం. క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్తులు ఉండరు. ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం’ చంద్రబాబు అన్నారు మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో జే శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ప్రతి రాష్ట్రంలో వెంకన్న ఆలయం
RELATED ARTICLES