. చైతన్యవంతమైన పార్టీగా సీపీఐ బలపడాలి
. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నల్లూరి అంజయ్య, పూల సుబ్బయ్య సభా ప్రాంగణం నుంచి విశాలాంధ్ర విలేకరుల బృందం:
వందేళ్లు సజీవంగా ఉన్న పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని, ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతంతో ఘోష, గొంతుకతో ఉన్నాం కాబట్టే వందేళ్లుగా సీపీఐ ఎన్నో చారిత్రక పోరాటాలు నిర్వహించిందని, ప్రశ్నించే తత్వం ఉన్నంతకాలం కమ్యూనిజం సజీవంగానే ఉంటుందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు మూడోరోజు సాంబశివరావు సౌహర్ద సందేశం ఇచ్చారు. తాను తెలంగాణలో స్థిరపడినప్పటికీ పుట్టి పెరిగింది గుంటూరు, తిరుపతిలోనేనని కూనంనేని గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కమ్యూనిజం కాలం చెల్లిన సిద్ధాంతమని ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పికొట్టే బాధ్యత ప్రతి కమ్యూనిస్టుపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధాంతంపై అవగాహన, మన పట్ల మనకు విశ్వాసం, నమ్మకం పెంచుకోవాలని హితవు పలికారు.
నిత్య అధ్యయనం ద్వారా అలుపెరగని పోరాటం చేస్తేనే ప్రజలలో కమ్యూనిస్టు పార్టీకి స్థిరమైన బలం పెరుగుతుందన్నారు. పేదలకు అన్నం ప్రసాదించే కమ్యూనిస్టు పార్టీగా ఉండాలన్నారు. సూర్యకిరణాలే ఎర్రజెండాలుగా… ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జెండా ఎత్తి పోరాటం చేయాలన్నారు. పోరాటపంథా అలవర్చుకోవాలని, ప్రశ్నించే గుణం ఈ సిద్ధాంతంలో ఉందని, ప్రశ్నించేతత్వం ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ సజీవంగా ఉంటుందని కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. చలనంతో ఉన్న సిద్ధాంతం మార్క్సిజమని చెప్పారు. సమస్యలపై కమ్యూనిస్టు నేతలకు అవగాహన ఉండాలని, పార్టీ పట్ల, నిర్మాణం పట్ల, ప్రజల పట్ల అపారవిశ్వాసం కలిగి ఉండాలని కమ్యూనిస్టు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శాస్త్రీయ సోషలిజమే కమ్యూనిజమన్నారు. కమ్యూనిస్టుగా మారాలంటే ప్రజా సమస్యలపై అనునిత్యం గొంతుక విప్పాలని పార్టీ కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. మరణం తర్వాత కమ్యూనిస్టు పార్టీ నేతలకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ఇటీవల సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి అంతిమయాత్రలకు ప్రజాదరణ దీనికి అద్దం పడుతుందన్నారు. మహాసభ సందర్భంగా ప్రారంభ ర్యాలీలో పార్టీ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డికి వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నేతలు ఘన నివాళులు అర్పించారని కొనియాడారు. ఒక్కస్థానం కోసం పార్టీని తాకట్టుపెట్టే నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోకుండా ప్రతి ఎన్నికల్లో ఎర్రజెండా పోటీ చేయాలని సాంబశివరావు ఆకాంక్షించారు. అనంతరం కూనంనేని సాంబశివరావును సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నాయకులు సత్కరించారు.


