275 మండలాల్లో వడగాడ్పులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా సంజామలలో 44 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 44.5, కడపలో 44.1, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.9, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.5, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 43, శ్రీసత్యసాయిజిల్లా కొత్తచెరువులో 42.7, ప్రకాశం జిల్లా దొనకొండలో 42.1, చిత్తూరు జిల్లాలోని గంగవరంలో 41.9, అన్నమయ్య జిల్లా గాలివీడులో 41.8, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
గురువారం అదే రీతిలో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయన్నారు. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠంగా 43-44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశముంది. వడగాడ్పులు, ఎండ తీవ్రత, ఉక్కపోతపై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాలు, విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గుర్ల, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లోని వివిధ మండలాల్లో వడగాడ్పుల ప్రభావం చూపనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.


