Homeభూ అక్రమాలకు చెక్

భూ అక్రమాలకు చెక్

- Advertisement -

. రీసర్వే 2.0తో సమూల మార్పు
. పక్కాగా వ్యవసాయ భూముల డిజిటలీకరణ
. మూడు దశల్లో 2,097 గ్రామాల్లో పూర్తి
. డైనమిక్ సమాచారంతో క్యూఆర్ కోడ్

విశాలాంధ్ర – సచివాలయం: భవిష్యత్తులో ఎలాంటి భూ అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన టెక్నాలజీతో రాష్ట్రంలోని రైతుల భూమి హక్కులను డిజిటలీకరణ చేస్తూ ప్రభుత్వం రీ సర్వే 2.0ను నిర్వహిస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రికార్డులను ట్యాంపరింగ్ చేయడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా చేస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే 1.0లో జరిగిన తప్పులకు అస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు దశల్లో 2,097 గ్రామాల్లో ఈ రీ సర్వే పూర్తి చేసింది. నాలుగో దశలో మరో 1613 గ్రామాల్లో రీ సర్వే 2.0 నిర్వహిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా రీ సర్వే చేపట్టింది. అయితే సరైన సంఖ్యలో రోవర్లను ఉపయోగించకపోవడంతో చాలా చోట్ల ప్రైవేట్ భూముల విస్తీర్ణంలో తేడాలు వచ్చాయి. దీనికి తోడు రీ సర్వేలో భాగంగా భూమిపై సర్వే నిర్వహించే ముందు, నిర్వహించిన తర్వాత భూ యజమానులకు సరైన సమాచారం ఇవ్వలేదు. రీ సర్వే కాలం మొత్తాన్ని కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశారు. రీ సర్వే చేసే సమయంలో భూ యజమానులు లేకపోవడం, వారి భూమి హద్దులు స్పష్టంగా చెప్పేవారు లేకపోవడంతో అధిక సంఖ్యలో జాయింట్ ఎల్పీ నెంబర్లు, జాయింట్ ఎల్పీఎం(ల్యాండ్ పార్శిల్ మ్యాప్) లు ఏర్పడ్డాయి. దీంతో రీ సర్వే 1.0 పట్ల రైతులు ఆందోళన చెందారు. దీంతో కూటమి ప్రభుత్వానికి రీ సర్వే 1.0పై దాదాపు 7.5 లక్షల కు పైగా ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వం రీ సర్వేను తప్పుల తడకగా నిర్వహించడమే కాక రీ సర్వే అనంతరం రైతులకు పంపిణీ చేయాల్సిన భూమి హక్కు పత్రాలపైన నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ముద్రించింది. ఇది రైతుల్లో మరింత ఆందోళన పెంచింది. దీంతోపాటు భూమి హక్కు ప్రతాల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. అలాగే గత ప్రభుత్వం ప్రచురించిన క్యూఆర్ కోడ్ స్టాటిక్ గా ఉంటుంది. అంటే క్యూఆర్ కోడ్ ముద్రించే నాటికి ఉన్న సమాచారం మాత్రమే ఆ క్యూఆర్ కోడ్ లో ఉంటుంది. ఆ తర్వాత జరిగే మ్యూటేషన్ వివరాలు గానీ, సబ్ డివిజన్ వివరాలు గానీ ఆ క్యూఆర్ కోడ్ లో ఉండవు. అంతే కాక ఆ క్యూఆర్ కోడ్ లో నావిగేషన్ సిస్టమ్ కూడా లేదు. ఈ క్రమంలో రీ సర్వే 1.0 లో గత ప్రభుత్వం చేసిన తప్పులను గమనించిన కూటమి ప్రభుత్వం రీ సర్వే 2.0లో సమూల మార్పులు తీసుకొచ్చింది. డ్రోన్ ల ద్వారా తీసిన చిత్రాలపైనే ఆధారపడకుండా పూర్తిస్థాయిలో రోవర్లను ఉపయోగిస్తున్నారు. అదనపు రోవర్ల కోనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. రోవర్ల ఆధారంగా కచ్చితత్వంతో హద్దులను నిర్ణయి ంచి రీ సర్వే చేస్తున్నారు. రైతులను, భూయజమా నులను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేస్తు న్నారు. రైతులకు నోటీసులిచ్చి, రైతుల సమక్షంలోనే రీ సర్వే చేస్తున్నారు. రీ సర్వే కాల పరిమితిని కూడా 90 రోజుల నుండి 143 రోజులకు పెంచారు. గ్రౌండ్ ట్రూతింగ్ కు గత ప్రభుత్వం 45 రోజుల సమయాన్ని కేటాయించగా, కూటమి ప్రభుత్వం 90 రోజుల సమయాన్ని కేటాయించింది. ఒకవేళ భూ యజమానులు అందుబాటులో లేకుంటే వారు వచ్చే వరకు రీ సర్వేను వాయిదా వేసే అవకాశం కల్పించింది. దీంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మతో ఉన్న భూమి హక్కు పత్రాల స్థానంలో పటిష్టమైన పాస్ పుస్తాన్ని ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ముద్రించిన క్యూఆర్ కోడ్ గత ప్రభుత్వం ప్రచురించిన క్యూ ఆర్ కోడ్ కు భిన్నంగా ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే స్పష్టమైన ఎల్పీఎమ్ ను చూపించడం తోపాటు ఆ ఎల్పీఎమ్ కు దారి చూపించే నావిగేషన్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంది. ఇక క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే ఎప్పటికప్పుడు తాజా సమాచారం డైనమిక్ గా కనిపిస్తుంది. పోస్ట్ మ్యూటేషన్ వివరాలు, సబ్ డివిజన్ వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. రీ సర్వే చేసిన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
వైఎస్ జగన్ గొప్పల తిప్పలు: మంత్రి అనగాని
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన జగన్ రెడ్డికి ప్రస్తుతం పార్టీ ఉనికి సమస్య వెంటాడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని తన గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని… రీ సర్వే విషయంలో మొత్తం ఘనత తనదే నని కలరింగ్ ఇస్తూ అభాసుపాలవుతున్నారని తెలిపారు. వైసీపీ హయంలో జరిగిన రీ సర్వేలో ఎన్ని తప్పులు జరిగాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. గత ప్రభుత్వ విధానానికి, తమ ప్రభుత్వ రీ సర్వేకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల, భూ యజమానుల సంక్షేమం కోరి రీ సర్వే 2.0 నిర్వహిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు