ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎసఆర్టీసీ) తన ప్రస్థానంలో ఒక అద్భుతమైన ఘనతను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి వస్తున్న ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడటంతో సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ నెల 19 న రికార్డు స్థాయి ఆదాయం నమోదయింది. కేవలం 24 గంటల వ్యవధిలో రూ.27.68 కోట్ల గ్రాస్ ఆదాయాన్ని గడించింది. పండుగ సెలవుల అనంతరం 19 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆర్టీసీ గణాంకాల ప్రకారం, ఆ ఒక్క రోజే దాదాపు 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రైవేట్ వాహనాలు, సొంత కార్ల కంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవడమే ఈ భారీ ఆదాయానికి ప్రధాన కారణంగా నిలిచింది. సాధారణంగా పండుగ సీజన్లలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ తారాస్థాయిలో ఉంటుంది. దీనికి భిన్నంగా, ఏపీఎస్ ఆర్టీసీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రద్దీని తట్టుకోవడానికి నడిపిన వేల సంఖ్యలోని ప్రత్యేక బస్సుల్లోనూ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా, సాధారణ ధరలకే సేవలు అందించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఆర్థికంగా భారీ ఊరటనివ్వడమే కాకుండా సంస్థకు అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) సాధించిపెట్టింది. ఈ విజయం వెనుక ఆర్టీసీ యాజమాన్యం నెల రోజుల ముందే చేసిన ముందస్తు వ్యూహం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లను గుర్తించి, డిమాండుకు అనుగుణంగా బస్సులను ఆర్టీసీ యాజమాన్యం మళ్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్టాండులు, ప్రధాన కూడళ్ల వద్ద డిపో అధికారులు, సూపర్వైజర్లు రాత్రింబవళ్లు పర్యవేక్షణ కొనసాగించారు. పండుగ పూట కూడా విశ్రమించకుండా విధులు నిర్వహించిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఐటీ విభాగం సమన్వయంతోనే ఈ ఘనత సాధ్యమైంది.
ఇది ఆర్టీసీ ఉద్యోగులందరి సమష్టి కషి : ఎండీ ద్వారకా తిరుమలరావు
ఈ అద్భుత విజయం ఆర్టీసీ ఉద్యోగులందరి సమష్టి కృషికి నిదర్శనమని ఏపీఎసఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీపై అపారమైన నమ్మకం ఉంచిన ప్రయాణికులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ ఇదే నాణ్యమైన, సురక్షితమైన ప్రయాణాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.


