తమిళనాడు గవర్నరు అసెంబ్లీ నుంచి వాకౌట్
పేరాలు వదిలి చదివిన కేరళ గవర్నరు
తీవ్రంగా స్పందించిన స్టాలిన్, విజయన్
చెన్నై/ తిరువనంతపురం: విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా… న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడుతున్నా గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలపై రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడు, కేరళ గవర్నర్లు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తమిళనాడు, కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయంగా అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ల ప్రసంగం ఉంటుంది. అయితే, తమిళనాడు గవర్నరు ఆరఎన్ రవి ప్రసంగం ప్రారంభించిన ఐదు నిమిషాలకే సభ నుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠం చదవడానికి ఆయనకు మనస్సు రాలేదు. అదే విధంగా కేరళ గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠం పూర్తిగా చదవలేదు. మధ్యలో కొన్ని పేరాలు వదిలేశారు. గవర్నర్ల తీరుపై ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్లు చదవాల్సిందేనని అన్నారు. రాజ్యాంగంలోనూ, చట్టంలోనూ గవర్నర్లకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఏమీ లేవని ముఖ్యమంత్రులు స్పష్టంచేశారు.
ఆరఎన్ రవి అహంకారం
శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే తమిళనాడు గవర్నర్ ఆరఎన్ రవి వాకౌట్ చేశారు. ప్రసంగం మధ్యలోనే ఆయన సభ నుంచి నిష్క్రమించారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరగా… అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్‌భవన్ వెల్లడించింది. ‘తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయగీతం పాడకుండా అవమానించి… ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్‌ను పదేపదే ఆపివేశారు. ఆయనను మాట్లాడడానికి అనుమతించలేదు. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో దానిని చదవడానికి ఆయన నిరాకరించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యలు తీవ్రమవుతుంటే వాటి గురించి ప్రసంగ కాపీలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని లోక్‌భవన్ తన ప్రకటనలో పేర్కొంది. గవర్నర్ చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ… సంప్రదాయం, నైతికతను ఉల్లంఘించి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలు చేర్చాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. ఆరఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ గవర్నర్ ప్రసంగం విషయంలో ఆరఎన్ రవి తీరు వివాదాస్పదమైన విషయం విదితమే.
కొన్ని పేరాలు చదవని కేరళ గవర్నర్
కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని అన్ని అంశాలను చదవకపోవడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగంలోని రెండు భాగాలను ఆయన వదిలేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. అర్లేకర్ సభ నుంచి నిష్క్రమించిన తర్వాత సీఎం మాట్లాడుతూ ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ అంశాలను, 15వ పేరా ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదని స్పీకర్‌కు వెల్లడించారు. అయితే సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని స్పీకర్ ఏఎన్ షంసీర్ పేర్కొన్నారు. కొన్ని అంశాలను వదిలేస్తూ… గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమన్నారు.
తప్ప్పులు సరిచేసిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వ విధాన ప్రసంగంలో 12,15,16 పేరాలకు గవర్నర్ మార్పులు చేశారని ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు. కొన్ని భాగాలను తొలగించినప్పటికీ… గవర్నర్ వాటిని చేర్చారని విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రమంత్రి మండలి ఆమోదించిన ప్రసంగం ప్రకారం.. పేరా 12లో ‘సామాజిక, సంస్థాగత విజయాలు ఉన్నప్పటికీ, ఆర్థిక సమాఖ్యవాద రాజ్యాంగ సూత్రాలను బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ వరుస ప్రతికూల చర్యల కారణంగా కేరళ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది’ అని ఉంది. ‘సామాజిక, సంస్థాగత విజయాలు ఉన్నప్పటికీ… అడ్వాన్సుల కోత కారణంగా తలెత్తే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కేరళ ఎదుర్కొంటోంది’ అని అర్లేకర్ తన ప్రసంగంలో మార్చి చదివారు. పేరా 15లో గవర్నర్ ఈ విభాగాన్ని తొలగించారు. ‘రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం ఈ అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటిని రాజ్యాంగధర్మాసనానికి నివేదించారు’ అని విజయన్ వెల్లడించారు. పేరా 16లో క్యాబినెట్ ఆమోదించిన విభాగం ప్రకారం ‘పన్ను వికేంద్రీకరణ, ఆర్థిక సంఘం గ్రాంట్లు రాష్ట్రాల రాజ్యాంగ హక్కులు. దాతృత్వ చర్యలు కాదు. ఈ విధిని నిర్వహిస్తున్న రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తుంది’. గవర్నర్ ఈ సెక్షన్ ముందుమాటను ‘’నా ప్రభుత్వం భావిస్తుంది’ అని చేర్చారని విజయన్ పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ స్ఫూర్తికి, కేరళ అసెంబ్లీ పూర్వ ప్రమాణాలకు కట్టుబడి, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగమే ప్రమాణమవుతుందని విజయన్ స్పష్టంచేశారు. ఏడాది ప్రారంభంలో మొదటి సమావేశాల్లో గవర్నర్ శాసనసభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విధాన ప్రసంగాన్ని గవర్నర్ సభలో ప్రసంగించాల్సి ఉంటుంది. కావున క్యాబినెట్ ఆమోదించిన 12,15, 16 పేరాలు చెల్లుబాటు అవుతాయి’ అని విజయన్ పునరుద్ఘాటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం… సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో, ప్రతి ఏడాది మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ అసెంబ్లీనుద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయాల్సి ఉంటుంది.


