. ట్రంప్ హెచ్చరికలు బేఖాతర్
. భారత్`ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
. చారిత్రక ఒప్పందం: మోదీ
. కొత్త శిఖరాలకు సహకారం: కోస్టా
. ఇటు నైపుణ్యం, అటు టెక్నాలజీతో అద్భుత ఫలితాలు: ఉర్సులా
న్యూదిల్లీ: భారత్-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స’గా చర్చించుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. మంగళవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ మేరకు ప్రకటించారు. భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను తొలిసారి 2007లో ప్రారంభించాయి.18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. మోదీ మాట్లాడుతూ… సోమవారమే దీనిపై ఒప్పందం కుదిరిందన్నారు. భారత్`ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) భారత వాణిజ్య చరిత్రలోనే అతి పెద్దదిగా పేర్కొన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాకుండా, రెండు పక్షాల సంక్షేమానికి బ్లూప్రింట్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు తొలిసారి ఈయూ నేతలు ముఖ్య అతిథులుగా హాజరైన మరుసటి రోజే కీలక ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్- ఈయూ సంబంధాలు వేగంగా బలోపేతమయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక అనుబంధం, ప్రజల మధ్య బంధాలే దీనికి పునాదిగా నిలిచాయని తెలిపారు. ప్రస్తుతం భారత్- ఈయూ మధ్య వాణిజ్యం 180 బిలియన్ యూరోల స్థాయికి చేరిందని వెల్లడించారు. ఎనిమిది లక్షల మందికి పైగా భారతీయులు ఈయూ దేశాల్లో నివసిస్తూ అక్కడి సమాజాలకు సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ పాలన, అభివృద్ధి భాగస్వామ్యం వంటి రంగాల్లో విస్తృత సహకారం కొనసాగుతోందని మోదీ తెలిపారు. ఈ ఒప్పందంతో రైతులు, చిన్న వ్యాపారులు, సేవల రంగానికి చెందినవారికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని స్పష్టం చేశారు. యూరోపియన్ మార్కెట్లకు భారత ఉత్పత్తులకు మరింత విలువ లభిస్తుందని, పెట్టుబడులు పెరుగుతాయని, సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. 16వ భారత్`ఈయూ సదస్సు సందర్భంగా ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం ఖరారైందని… ఇదే సమయంలో భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరింది. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఆతరహా ఒప్పందం చేసుకున్న మూడో ఆసియా దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మోదీ, భారత్-ఈయూ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా అభివర్ణించారు. ప్రపంచ జీడీపీలో నాలుగో వంతు వాటా కలిగిన రెండు ప్రధాన ఆర్థిక శక్తులను కలుపుతున్న కీలక ఒప్పందమిదని అన్నారు.
భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చొరవ చూపారని… ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ ఒప్పందం భారత్- ఐరోపా దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఐరోపా, భారత బంధం ఈనాటిది కాదని, తమ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తన విదేశీ భారతీయ కార్డును చూపించారు.
ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ మాట్లాడుతూ భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంలో ఎంతో కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యంగా ఈయూ వాణిజ్య కమిషనర్ మారోస్ సెఫ్‌కోవిక్, భారత వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నానన్నారు. వీరు లేకుండా ఇలాంటి చారిత్రక ఒప్పందం సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. భారత్- ఈయూ ఒప్పందం వల్ల కేవలం ఆర్థికంగా మాత్రమే బలవంతం కావట్లేదని, ప్రస్తుత అస్థిర ప్రపంచంలో తమ ప్రజలకు భద్రతను అందిస్తున్నాయన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు వారి తొలి భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ నైపుణ్యం, సామర్థ్యానికి యూరోపియన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ తోడై కలిసి పనిచేస్తాయని… ఫలితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటామని తెలిపారు.
రెండు దశాబ్దాల చర్చలు
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ భారీ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. 1962లో ఐరోపా ఆర్థిక సముదాయంతో భారత్ సంబంధాలు ప్రారంభించగా, 2004లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. 2007లో మొదలైన ఎఫ్‌టీఏ చర్చలు అనేక అడ్డంకులను దాటుకుని నేడు ఒక వాస్తవ రూపం దాల్చాయి. ఐరోపా సమాఖ్య ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరుపక్షాల మధ్య సుమారు 13 వేల 600 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ ఒప్పందంతో భారత్‌కు 45 కోట్ల జనాభా ఉన్న ఐరోపా మార్కెట్ అందుబాటులోకి రానుంది. వస్త్రాలు, తోలు వస్తువులు, ఐటీ సర్వీసులు, ఫార్మా రంగానికి ఈ ఒప్పందం ద్వారా భారీ ఊరట కలగనుంది. అటు ఐరోపాకు చెందిన యంత్రాలు, వైన్, ఇతర ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించనుంది. అంతర్జాతీయంగా అమెరికా టారిఫ్ విధానాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అనిశ్చితి నెలకొన్న సమయంలో, ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది.


