గ్రీస్‌లో కార్మికుల సమ్మె నిలిచిన నౌకలు, విమానాలు, రైళ్లు
ఏథెన్స్: అధిక ధరలతో కుటుంబ పోషణ భారంగా మారిందని, గౌరవప్రదంగా జీవించేందుకు సముచితంగా వేతనాలను పెంచాలని గ్రీస్ కార్మికులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలంటూ బుధవారం 24 గంటల దేశవ్యాప్త సమ్మె చేశారు. ఇదే క్రమంలో రోడ్డు, వాయు, జల రవాణాను స్తంభింపజేశారు. రైళ్లు, ట్రామ్‌ల సేవలను నిలిపివేశారు. గ్రీస్‌లోని అతిపెద్ద కార్మిక సంఘాల అధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు.
బ్యానర్లు ప్రదర్శించారు. కార్మికుల సమ్మెతో నౌకలు, ఫెర్రీలు పోర్టులకు పరిమితం కాగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 2009`2018లో గ్రీస్ రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో వేతనాల్లో, పింఛన్లలో భారీగా కోతలు పడ్డాయి. బెయిలవుట్‌ల విలువ 290 బిలియన్ యూరోలుగా ఉంది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 2.3శాతంగా ఉంది. 2019 నుంచి కనీస వేతనాన్ని 880 యూరోలకు కన్జర్వేటివ్ ప్రభుత్వం పెంచింది కానీ పెరిగిన ధరల దృష్ట్యా ఇది చాలదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగ కార్మికుల జీతాలను పెంచాలని డిమాండ్ చేశాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఇళ్లు ఖరీదుగా మారాయి. విద్యుత్ చార్జీలు పెరిగాయి. ఏమి కొనలేని ఏమి తినలేని పరిస్థితి నెలకొంది. 2019తో పోల్చుకుంటే 10 శాతం తక్కువ సరుకులను కొనగలుగుతున్నాం’ అని రెండు మిలియన్ల మంది ప్రైవేటు రంగ కార్మికులకు ప్రాతినిథ్యం వహించే జీఎస్‌ఈఈ ప్రతినిధి చెప్పారు. చాలీచాలని జీతాలతో కార్మికులు ఇల్లు గడవక కష్టాలు పడుతున్నారన్నారు. వేతనాల్లో పెంపుదల కోసం డిమాండ్‌తో సమ్మె చేపట్టామని అన్నారు.
తక్షణమే జీతాలు పెంచండి… లేబర్ కాంట్రాక్టులు పెంచండి అని డిమాండ్ చేశారు. కాగా, కార్మికుల సమ్మెతో సెంట్రల్ ఏథెన్స్ స్తంభించింది. బస్సులు, ట్రాలీలు, రైళ్లు, ట్రామ్‌లు నిలిచిపోయాయి. కమర్షియల్ ఫ్లైట్‌లు గురువారం అర్థరాత్రి వరకు రద్దు అయ్యాయి.