. ‘కాప్ 30’ వేళ ఉద్రిక్తత : స్థానిక తెగల ఆందోళన
. భద్రతా సిబ్బందితో ఘర్షణ: కొందరికి గాయాలు
బెలెం (బ్రెజిల్): కాప్ 30 వాతావరణ సదస్సు వేళ బ్రెజిల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక తెగలు సభాస్థలికి కదం తొక్కారు. వందల సంఖ్యలో వేదిక వద్దకు చేరుకొన్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. తమ భూములు, అడవులు, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. భద్రతా సిబ్బందిని దాటుకొని సభ ప్రాంగణానికి చేరుకునే ప్రయత్నం చేశారు. బ్యానర్లు, ప్లకార్దులతో భూ హక్కుల పరిరక్షణకు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. జెండాలు ప్రదర్శిస్తూ ‘మా భూములు అమ్మనివ్వం’, ‘మేము డబ్బు తినలేం’ వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అగ్రీ బిజినెస్, చమురు అన్వేషణ, అక్రమ మైనింగ్, స్మగ్లింగ్ నుంచి తమ భూములకు విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేశారు. వేదిక వద్ద భద్రతా సిబ్బంది వారిని నిరోధించారు. లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్లు అడ్డుపెట్టారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ నిరసనాకరులను వెనక్కి నెట్టేశారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు వారితో ఘర్షణకు దిగారు. పెద్ద కర్రలతో భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. ఈంతో వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.నిరసనకారులను చెదర గొట్టి… పరిస్థితిని అదుపు చేసిన తర్వాత మాత్రమే విదేశీ ప్రతినిధులను భద్రతా సిబ్బంది బయటకు అనుమతిచ్చారు. కాగా, బ్రెజిల్‌లోని బెలెం నగరం వేదికగా నిర్వహించినపర్యావరణ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు.


