Homeఅంతర్జాతీయంమా రక్షణకు ఢోకా లేదు

మా రక్షణకు ఢోకా లేదు

- Advertisement -

. లారిజానీ, సులేమానీ హత్యల ధ్రువీకరణ
. ఇరాన్ కవచం ‘మొజాయిక్ డిఫెన్స’
. వికేంద్రీకృత యుద్ధతంత్రంతో శత్రువులకు వణుకు

తెహ్రాన్: అమెరికాఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో తమ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ మరణించినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. లారిజానీని హతమార్చినట్లు ప్రకటించిన ఇజ్రాయిల్, నూతన అధినేత ముజ్తబా ఖామేనీని వేటాడి చంపుతామంటూ ప్రతిజ్ఞ చేసింది. మాజీ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీని కోల్పోయిన ఇరాన్‌కు లారిజానీ మరణం తీరని లోటు. అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తమ రక్షణ వ్యవస్థకు ఢోకా లేదని స్పష్టంచేసింది. ఇరాన్ పాలన, సైనిక విభాగాలు వ్యక్తులపై కాకుండా పటిష్టమైన సంస్థాగత నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. మొజాయిక్ డిఫెన్స్ అనే అత్యాధునిక వికేంద్రీకృత యుద్ధతంత్రం వల్ల అగ్ర నాయకత్వం లేకపోయినా క్షేత్రస్థాయిలోని సైనిక విభాగాలు స్వతంత్రంగా పోరాడగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికాఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు తమను కుంగదీయలేవని అరాగ్చీ అన్నారు. లారిజానీ, ఆయన కుమారుడు ముర్తజా, బాసిజ్ ఫోర్స్ అధిపతి గులాంరెజా సులేమానీ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. ఈ హత్యలు తమ ప్రభుత్వానికి లేదా సైనిక వ్యవస్థకు ఆటంకం కలిగించబోవని వెల్లడించింది. తెహ్రాన్ శివార్లలో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు వెళ్లే క్రమంలో అమెరికా`ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 67 ఏళ్ల లారిజానీ మరణించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘ఇరాన్, ఇస్లామిక్ రివల్యూషన్ కోసం తన జీవితాంతం శ్రమించి… తన కలను సాకారం చేసుకునే దశలో అమరత్వం పొందారు’ అంటూ లారిజాని మరణానికి ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి సంతాపం ప్రకటించింది. అరాగ్చీ మాట్లాడుతూ ‘ వ్యక్తులపై కాదు వ్యవస్థలనే నమ్ముకున్నామని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఖామేనీ హత్యకు గురైనప్పటికీ తమ వ్యవస్థ యథావిధిగా పని చేస్తోందని, ఆయా వ్యక్తులు ఉన్నా లేకున్నా తమ అస్థిత్వం చెక్కు చెదరదని అరాగ్చీ స్పష్టంచేశారు. వ్యవస్థ అత్యంత పటిష్టమైనదని ఆయన అన్నారు. కాగా, ఇరాన్ సైన్యం ‘మెజాయిక్ డిఫెన్స’ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏదైనా దేశంపై దాడి జరిగి… నాయకత్వాన్ని దెబ్బతీస్తే సైన్యం చెల్లాచెదురవుతుంది. కానీ మొజాయిక్ డిఫెన్స్‌లో అలా జరగదు. ఇరాన్ తన సైన్యాన్ని 31 ప్రావిన్షియల్ కమాండ్లుగా విభజించింది. ప్రతి విభాగం ఒక స్వతంత్ర సైన్యంలా పని చేస్తుంది. రాజధానితో సంబంధాలు తెగిపోయినా, ఉన్నత స్థాయి నాయకులు మరణించినా, ఆయా ప్రాంతాల్లోని స్థానిక కమాండర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నిఘా వ్యవస్థతో సొంతంగా యుద్ధం చేయగలరు. హెజ్బుల్లా వంటి స్లీపర్ సెల్స్ కూడా ఈ వ్యూహంలో భాగంగానే ఉన్నాయి. ఇదిలావుంటే, గత రెండు దశాబ్దాలుగా తన పొరుగు దేశాలైన ఇరాక్, అఫ్గాన్‌పై అమెరికా యుద్ధాలను ఇరాన్ నిశితంగా అధ్యయనం చేసింది. నాయకత్వాన్ని అంతమైనంత మాత్రాన దేశం ఓడిపోదని గ్రహించింది. ఆ మేరకు తన రక్షణ వ్యవస్థను పటిష్టపర్చుకుంది.రాజధానిపై దాడులు జరిగినా యుద్ధ సామర్థ్యం తగ్గకుండా సైన్యాన్ని బలోపేతం చేసుకుంది. ఇరాన్ ధీమాకు ఇదే కారణం. ఇరాన్ రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం శత్రువులకు కష్టసాధ్యమని, నాయకత్వాన్ని దెబ్బతీసినా ఆ దేశం చిన్నాభిన్నం కాదని సైనిక నిపుణుడు డాక్టర్ మైఖేల్ కానల్ వెల్లడించారు. ఇరాన్ యుద్ధ వ్యూహం సాధారణమైనది కాదని, అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే వేలాది చిన్న శాఖలను అడ్డుకోవడం ఇజ్రాయిల్‌కు పెద్ద సవాల్‌గా మారనుందని ఆయనన్నారు.
రెండు వారాలుగా స్థావరాలు మార్చినా…
అలీ లారిజానీని రెండు వారాలుగా అనేక స్థావరాలు మార్చినప్పటికీ, ఇజ్రాయిల్ నుంచి తప్పించుకోలేకపోయారు. పక్కా నిఘా సమాచారంతో ఐడీఎఫ్ ఆయనను హత్య చేసింది. ఖామేనీ హత్య అనంతరం లారిజానీపై ఇజ్రాయిల్ గురి పెట్టింది. ఆయన కదలికలను నిశితంగా గుర్తించింది. శత్రువులకు చిక్కకుండా దాక్కోవడంలో లారిజానీ సిద్ధహస్తుడు. గత రెండు వారాల నుంచి రహస్య ప్రాంతంలో ఉంటూ ఇరాన్ సైన్యాన్ని నడిపిస్తున్నారు. నిఘా వర్గాలకు దొరక్కుండా స్థావరాలు మారుస్తున్నారు. దీంతో లారిజానీ ఆచూకీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఇజ్రాయిల్ రంగంలోకి దించింది. ఆయన తన కుమార్తె ఇంటికి వెళుతున్నట్లు తెలుసుకొని పధకం ప్రకారం దాడులు చేసి అంతమొందించింది. లారిజారి ఆచూకీ గురించి ఐడీఎఫ్ సమాచారం ఇచ్చిన వెంటనే ఆయనపై ఆపరేషన్‌కు ఇజ్రాయిల్ సైన్యాధికారి జమీర్ అనుమతిచ్చారు. 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఛేదించేందుకు యుద్ధ విమానాలు పంపారు. లారిజానీ ఉన్న ప్రాంతంలో వైమానిక దాడులు జరిపించారు.యి. దీంతో లారిజానీ, ఆయన కుమారుడు మరణించారు. అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సులేమానీ లక్ష్యంగా ఏక కాలంలోనే రెండు ఆపరేషన్లను ఇజ్రాయిల్ ముగించింది.
లారిజానీ 1958లో జన్మించారు. అత్యంత ప్రజాదరణ గల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఖామేనీకి అత్యంత సన్నిహితుడు. ఇరాన్ అణు కార్యక్రమంలో ఆయన పాత్ర కీలకం. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేశారు. 2025లో ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల తర్వాత భద్రతాధికారాన్ని చేపట్టారు. తాజా దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ పోరాటంలో సైన్యాన్ని సమన్వయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు