. మా రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చలేరు
. గల్ఫ్ చమురు క్షేత్రాలపై గురి పెడతాం
. లారిజానీ, సులేమానీ హత్యకు తీవ్రస్థాయిలో ప్రతీకారం
. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక
. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయిల్
. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా దాడులు
తెహ్రాన్: అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినాగానీ అత్యాధునిక యుద్ధ తంత్రంతో శత్రువులను సమర్థంగా ఎదుర్కోగలమని, వ్యక్తులను కాదు పటిష్ట వ్యవస్థలను నమ్ముకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చడం అంత సులువు కాదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అణ్వస్త్రాల తయారీ విషయంలో తమ వైఖరి మారబోదని తెలిపారు. గల్ఫ్ చమురు క్షేత్రాలు లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. సైన్యాధిపతి అలీ లారిజానీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనుబంధ బసీత్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సులేమానీ హత్యలకు తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ గార్డ్స్ సంకల్పించారు. ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు ఐరిస్ దీనాపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన నావికుల అంతిమ సంస్కారాలను రాజధాని తెహ్రాన్‌లో నిర్వహించారు.
ఉధృతంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు
అమెరికాతో కలిసి ఇజ్రాయిల్ తమ వైమానిక దాడులను తీవ్రతరం చేస్తూ ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చింది. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ ఒక ప్రకటన చేశారు. గత నెల 28న అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీని చంపేసింది. ఆయనకు కుడిభజం, సైన్యాధిపతి అలీ లారిజానీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనుబంధ బసీత్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సులేమానీ మంగళవారం హత్య చేసింది. తాజాగా ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు తీసింది. ఇలా వరుస పెట్టి కీలక నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. నూతన అధినేత ముజ్తబా ఖామేనీ వేటాడి చంపుతామని ఇజ్రాయిల్ హెచ్చరిస్తోంది. అయితే ఆయన ఎక్కడున్నారనే సమాచారం ప్రస్తుతం తమ వద్ద లేదని, తమ దేశానికి ముప్ప్పుగా భావించే అందరినీ హతమారుస్తామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ వెల్లడించారు. ముజ్తబా ఖామేనీని చంపడం ఖాయమని, అది ఎప్ప్పుడు ఎలా జరుగుతుందో ప్రస్తుతానికి చెప్పలేమని అన్నారు.
అదనపు అనుమతుల అవసరం లేకుండానే ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారులను, నాయకులను చంపేందుకు తమ సైన్యానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కట్జ్ వెల్లడించారు.
అటు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది. సెంట్రల్ బీరుట్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 10 మంది చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 27 మంది గాయపడినట్లు తెలిపింది. ఈనెల 2 నుంచి 912 మంది చనిపోగా, 2,221 మంది గాయపడ్డారని గణాంకాలు పేర్కొన్నాయి.
ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు
హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా విరుచుకుపడింది. ఏకంగా 5,000 పౌండ్ల బరువున్న బంకర్-బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఆధునిక ‘డీప్ పెనెట్రేటర’ని వాడినట్లు వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను నాశనం చేసినట్లు ప్రకటించింది.
అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణుల వర్షం
ఇరాన్ తమ ప్రతికార దాడులను బుధవారం ముమ్మరంగా సాగిస్తూ అమెరికా స్థావరాలను కలిగివున్న గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపించింది. అటు క్షిపణులు, డ్రోన్లకు తోడు వార్‌హెడ్స్‌ను ప్రయోగిస్తూ ఇజ్రాయిల్‌కు ముచ్చెమటలు పట్టించింది. యూఏఈ, ఖతార్, బెహ్రెయిన్, సౌదీలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. తమ కీలక నేత లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ రాజధాని తెల్ అవీవ్‌పైకి కస్టర్ వార్‌హెడ్స్‌తో ఇరాన్ దాడి చేసింది. బాలిస్టిక్ క్షిపణులు, క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దీంతో సెంట్రల్ ఇజ్రాయిలో నష్టం జరిగింది. సబ్‌మ్యునిషన్ రోడ్డు దెబ్బతిన్నది. బాలిస్టిక్ క్షిపణుల దాడి సమాచారం రాగానే, ఇజ్రాయిల్‌లో సైరన్లు మోగాయి. ఇదిలావుంటే, ముజ్తబా ఖామేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. ‘ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధం. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు’ అని తేల్చిచెప్పింది.
అణ్వస్త్రాలపై వైఖరి మారదు: అరాగ్చీ
అణ్వస్త్రాల తయారీకి సంబంధించి ఇరాన్ వైఖరిలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. నూతన అధినేత ముజ్తబా ఖామేనీ ఇప్పటివరకు ఈ వ్యవహారంలో తన ఆలోచనలను బయట పెట్టలేదని చెప్పారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత గల్ఫ్‌తో సరిహద్దు పంచుకునే దేశాలు హోర్ముజ్ జల సంధికి సంబంధించి నూతన ప్రోటోకాల్‌ను రూపొందించుకోవడం అవసరమని అరాగ్చీ సూచించారు. పశ్చిమాసియా అంతటా శాంతి నెలకొన్నప్ప్పుడు… తమకు నష్ట పరిహారం లభించినప్ప్పుడు మాత్రమే ఈ యుద్ధానికి తెరపడినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టంచేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాలు కాకుండా నిర్వాసిత`వ్యాపార కేంద్రాలు ప్రభావితం అవుతుండటంపై స్పందిస్తూ ‘పట్టణ ప్రాంతాలకు తమ దళాలను అమెరికా తరలించడమే ఇందుకు కారణం’ అని అరాగ్చీ అన్నారు. అమెరికా సైన్యం ఎక్కడ ఉంటే ఆ ప్రాంతాన్ని తాము లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఇరాన్ దాడులపై ఇరుగు పొరుగు దేశాలు కోపంగా ఉండటం, ఆయా దేశాý ప్రజల్లో కొందరికి హాని జరగడం నిజమేనని అరాగ్చీ ఒప్ప్పుకున్నారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలు పెట్టిన అమెరికానే ఈ నష్టానికి బాధ్యత వహించాలన్నారు.
చైనా వెళ్తున్న రష్యా ట్యాంకర్ భారత్‌కు…
చైనాకు చమురు రవాణా చేసేందుకు రష్యా పంపిన ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లించుకొని భారత్ వైపునకు ప్రయాణం మొదలుపెట్టింది. ఇరన్ యుద్ధం వేళ రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచడంతో ఈ పరిణామం జరిగింది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ‘ఆక్వా టైటాన’ అనే రష్యా నౌక జనవరి చివరలో బాల్టిక్ పోర్ట్‌లో చమురు నింపుకొని చైనాలోని రిజావో పోర్టుకు బయలుదేరింది. అయితే దక్షిణ చైనా సముద్రంలో యూ టర్న్ తీసుకొని భారత్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నది. ఈనెల 21వ తేదీ నాటికి న్యూ మంగళూరుకు అది చేరుకోనున్నది. రష్యాకు చెందిన మరొక ట్యాంకర్ కూడా భారత్ వైపు దారి మార్చుకున్నది. కజఖ్ సీపీసీ బ్లెండ్ ముడి చమురును రవాణా చేస్తున్న సూయజ్ మాక్స్ నౌక ‘జౌజౌ ఎన’ భారత పశ్చిమ తీరంలోని సిక్కాను తన గమ్యస్థానంగా సూచిస్తున్నది. 25వ తేదీకి అక్కడకు చేరుతుంది.
చైనాకు చమురు రవాణా చేస్తున్న ఏడు ట్యాంకర్లు మార్గంమధ్యలో ఇలా దారి మళ్లాయని ఇంధన నిఘా సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ పేర్కొంది. భారత్‌లోని ప్రధాన రిఫైనరీలు రష్యా చమురు కోనుగోలుకు యత్నిస్తున్నాయని వెల్లడించింది.


