విశాలాంధ్ర-గోరంట్ల:శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీ నాయక్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్… రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయనను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరస్పర కాల్పుల్లో ఐదుగురు పాక్ ముష్కరులను చంపి… మురళీ నాయక్ చనిపోయారు. శ్రీనివాస్ నాయక్, జ్యోతిబాయిలకు మురళీ నాయక్ ఏకైక సంతానం. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సోమందే పల్లె మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాడు. 2022 అగ్నివీర్ ద్వారా ఆర్మీకి ఎంపికయ్యాడు. నాసిక్, పంజాబ్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం దిల్లీ చేరుకుంది. శనివారం ఉదయం స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మరోవైపు మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిరచారు.
ఒక్కగానొక్క కుమారుడు పాక్ సైనికుల కాల్పుల్లో మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దేశం కోసం చస్తా… దేశం కోసం ఆర్మీలోనే ఉంటా అనేవాడని కుమారుడి మాటలు గుర్తు చేసుకున్నారు. మురళీ నాయక్ నిన్న ఉదయం తమతో మాట్లాడాడని, అవే చివరి మాటలని రోధించడం కలచివేసింది. తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిన కాల్పుల్లో మృతిచెందినట్లు ఉదయం ఆర్మీ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు.
చంద్రబాబు, పవన్, జగన్ సంతాపం
వీరజవాను మురళీ నాయక్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశం కోసం మురళీ ప్రాణాలు అర్పించారని పవన్ అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ మురళి తల్లిదండ్రులను పరామర్శించారు. జగన్‌మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిరచారు. మీకు వైసీపీ అండగా ఉంటుందని, త్వరలోనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానని జగన్ చెప్పారు. యుద్ధభూమిలో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలు రాష్ట్రప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపిస్తామని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.