Homeరైతుల ఎదురుచూపు

రైతుల ఎదురుచూపు

- Advertisement -

. 2.83 లక్షల ఇ-కేవైసీ పెండిరగ్‌
. 7.94 లక్షల మందిపై వేటు

విశాలాంధ్ర-సచివాలయం : అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. 2.83 లక్షల మందికి ఇ-కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పథకం కోసం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. మొత్తం 45.65 లక్షల మంది అర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు ఇ-కేవైసీ పూర్తి కావాల్సి ఉందనే విషయం రైతుల్లో గందరగోళానికి కారణమైంది. సచివాలయాల్లో హౌస్రోల్డ్‌ మ్యాపింగ్‌ పూర్తికాని లబ్ధిదారులు మాత్రమే ఇ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ విషయంపై వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. పీఏసీఎస్‌ల పరిధిలో ఉన్న 22.32 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందాల్సి ఉండగా… వీరిలో 19.48 లక్షల మందికి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 2.83 లక్షల మందికి పూర్తి కాలేదు. గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మూడో విడతగా రూ.రెండు వేలను చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి కోత పడిరది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండిరగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నుంచి వచ్చిన వెబ్‌ ల్యాండ్‌ డేటా ఆధారంగా అధికారులు రైతులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు, మండల వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి తమ పరిధిలోని అంశాల మేరకు ఆమోదం తెలిపారు. రెవెన్యూశాఖకు సంబంధించిన అంశాలను తహసీల్దార్ల లాగిన్‌కు పంపారు. తహసీల్దార్లకు పంపిన పెండిరగ్‌ రికార్డులు మినహాయించి ప్రభుత్వం ఆమోదించిన మేరకు జాబితాను రూపొందించింది. ఈ నెల 20న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు విడుదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందువల్ల అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులు కూడా కలిపి విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్‌ యోజన ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదు. పీఎం కిసాన్‌ నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అంటే అన్నదాత సుఖీభవ సాయం అందుకోవాలంటే పీఎం కిసాన్‌ యోజన నిధుల విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ నెల చివరికల్లా పీఎం కిసాన్‌ యోజన నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఏపీలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం కింద తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలుగా ఉండనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు