సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ రోజు సీఎం చంద్రబాబు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పర్యటించేందుకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. దీంతో సీఎం తన ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.
అనంతరం అధికారులు సీఎం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు సమీపంలోని మలకపల్లి గ్రామానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఃప్రజావేదికః కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం రాక కోసం అధికారులు ఇప్పటికే మలకపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.