Friday, February 21, 2025
Homeవిశ్లేషణవిస్తరిస్తున్న మత మౌఢ్యం

విస్తరిస్తున్న మత మౌఢ్యం

వి. శంకరయ్య

మున్ముందు మైనార్టీ మతానికి చెందిన సంస్థల్లో హిందువులు వుండకూడదనే వాదన బలపడితే ఈ మత మౌఢ్యం ఎక్కడికి దారి తీస్తుంది? తిరుపతిలో ఎన్నో దశాబ్దాలుగా వుంటున్న ఈ సామరస్య విధానం ఇప్పుడే ఎందుకు అంటరానిదైంది?

తొలి ప్రపంచ యుద్ధం తరువాత నాజీ జర్మనీలో నెలకొన్న సామాజిక మత మౌఢ్యం యూదులపై దమనకాండ లాంటిది. 2014 తర్వాత భారత దేశంలో చోటుచేసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు మాజీ జడ్జీ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ ఏ ఉద్దేశంతో వ్యాఖ్యానించారో ఏమో గాని తదుపరి సంఘటనలు అక్షరాల రుజువు చేస్తున్నాయి.
2014 లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి తర్వాత భారత దేశంలో మైనార్టీలను టార్గెట్‌ చేశారు. ఆవును పూజించడం పేరుతో పైశాచిక కాండకు శ్రీ కారం చుట్టారు. ఈ వెర్రి ఎంత వరకు వెళ్లిందంటే ఆవును పూజించడంతో మొదలై విజ్ఞాన శాస్త్రాన్ని తుంగలో తొక్కి దాని మూత్రం సర్వరోగ నివారిణిగా అధికారిక బాధ్యతయుత స్థానాల్లో వున్నవారు ప్రచారం ప్రారంభించారు. లౌకికవాదం గురించి మాట్లాడే వారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా కొందరిని హత్య చేశారు. లౌకిక వాదం అంటరానితన మైంది. ఇందుకు చాల సంఘటనలున్నాయి. కర్నాటకలో గౌరి లంకేశ్‌ను తన ఇంటి వద్దనే కాల్చి చంపారు. ఈ జాబితాలో కల్‌ బుర్గీ(కర్నాటక), గోవింద పన్సారే (మహారాష్ట్ర) ఇంకా చాల మంది వున్నారు. ఇక అర్బన్‌ నక్సలైట్లంటూ కొందరిని వేధిస్తున్నారు. తుదకు రాహుల్‌ గాంధీని కూడా అర్బన్‌ నక్సలైట్‌ అనడమే కాకుండా బ్రాహ్మణుడేనా అనే దుర్మార్గానికి బీజేపీి నేత కేంద్ర మంత్రి ఒకరు తెగ బడ్డారు. రాహుల్‌ గాంధీ వంశ వృక్షం కథ తెలిసి వుంటే గాంధీ పేరు చివర ఎందుకు వచ్చిందో తెలుసుకొనివుంటే ఇలాంటి ప్రేలాపనలు వుండేవి కావు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ కాకుళం జిల్లాకు చెందినా ఎక్కువకాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వుండి పోయిన స్వామి అగ్నివేశ్‌ బట్టలను నడి రోడ్డుపై చించి వేసిన సందర్భముంది. పైగా స్వామి అగ్నివేశ్‌ ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఆయన చేసినదల్లా లౌకికవాదంతో, ఆర్య సమాజ భావజాలంతో వుండటమే. సంఫ్‌ు పరివార్‌ మూకల దౌష్ట్యాలు పెద్ద ఉద్గ్రంధమే అవుతుంది. లౌకికవాదంపై జరుగుతున్న దాడి వాస్తవంలో దేశ రాజ్యాంగానికే ప్రమాదం తెస్తోంది. మనువాదం మాటున ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు. లౌకికవాదులే కాకుండా సార్వజ నీనంగా ప్రజాస్వామ్య భావజాలంగల అందరూ జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు లౌకికవాద భావజాలంపై జరిగే దాడి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ప్రజాస్వామ్య పదం ఉచ్చరించే వారిపై దాడులు జరగవనే గ్యారంటీ ఏమిటి? నాజీ జర్మనీలో కూడా తొలుత యూదులపై జరిగిన దాడులు చివరకు కమ్యూనిస్టులపై మొదలై చివరకు ఎక్కడికి దారి తీసింది చరిత్రపుటలు తిరగేస్తే కఠోర వాస్తవాలు కళ్లకు కడుతాయి. ఈ కోవకు చెందినదే జమిలి ఎన్నికలు. 2029 వరకు జమిలి ఎన్నికలు వుండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి పడవచ్చు. తాజాగా సంభవించిన ఈ సంఘటన దేనికి సంకేతం? ఇప్పటి వరకు చీఫ్‌ ఎన్నికల కమీషనర్‌ను ఎంపికచేసే కమిటీలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా వుండేవారు. ఇప్పుడు హోం మంత్రి కూర్చున్నారు. పైగా ఈ అంశం న్యాయ స్థానంలో వున్నా బలాదూర్‌ అయింది. ఇటీవల వరకు మనువాద మౌఢ్యం ఉత్తరాది రాష్ట్రాల్లోనే విశృంఖల విహారం చేస్తున్నా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌లో అరుదుగా వుండేది. అయితే ఇటీవల కొద్ది నెలల్లోనే మన కళ్ల ముందే చకచకా ప్రమాదకరమైన సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మత మౌఢ్య సంఘటనలు రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తు న్నాయి. ఈలాంటి మత మౌఢ్య పోకడలు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలతో పాటు తిరుపతి పట్టణప్రజలూ ఇది వరలో ఎరుగరు. రాయలసీమ జిల్లాల్లో మైనార్టీలు ఎక్కువగా వుంటారు. వారి పండుగల్లో హిందువులు – హిందువుల పండుగల్లో మైనార్టీలు ఎంతో సామరస్యంగా సహృదయంతో పాల్గొంటారు. కడపలో దర్గా నెల్లూరులో రొట్టెల పండుగ విజయవాడలో మేరీ మాత ఉత్సవాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే తిరుమల పుణ్య క్షేత్రంతో సహా రాష్ట్రంలోని దేవాలయాలన్నింటినీ థార్మిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వ జోక్యం వుండ కూడదనే వైపరీత్య ఆందోళన ఇటీవల జీవం పోసుకొంది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం పంచుకొన్న తర్వాత ఈ జాడ్యం మరీ పెరిగింది. ఆశ్రమాల్లో జపం చేసుకొనే స్వాములు వీధులకెక్కి ధర్నాలు చేస్తున్నారు. తిరుమల గిరులచెంత అన్యమతానికి చెందిన పేరుతో హోటల్‌ నిర్మించ కూడదని ధర్నాకు దిగారు. తిరుమలగిరుల చెంత మసీదు లేక చర్చి నిర్మించితే మత సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించితే ధర్నాకు అర్థం పర్థం వుంటుంది. ఇంతకీ ఆ హోటల్‌ ఏలా వుండ బోతోందో తెలియదు. మరొక మతానికి చెందిన పేరే ధ్వనించ కూడదనే వాదన వీధులకెక్కడానికి పూర్వరంగం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త ట్రస్టు బోర్డు నామినేట్‌ చేయబడగానే టిటిడీలో అన్య మతస్తులు ఉద్యోగులుగా వుండ కూడదని నిర్ణయం తీసుకొన్నారు.
ఆలయంలో అన్య మతస్తులు లేకుండా చేయవచ్చు. టీటీడీ కి చెందిన ఎన్నో సంస్థలు, విభాగాలున్నాయి. వీటిల్లో వుండే అన్య మతస్తులను కూడా ఇళ్లకు పంపివేస్తే మున్ముందు మైనార్టీ మతానికి చెందిన సంస్థల్లో హిందువులు వుండకూడదనే వాదన బలపడితే ఈ మత మౌఢ్యం ఎక్కడికి దారి తీస్తుంది? తిరుపతిలో ఎన్నో దశాబ్దాలుగా వుంటున్న ఈ సామరస్య విధానం ఇప్పుడే ఎందుకు అంటరానిదైంది? మరో దుర్ఘటన. రాష్ట్రం మొత్తం మీద మేధావులను, కవులు, రచయితలను కుదిపేసింది. తిరుపతిలో అలజడికి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు దారి తీసింది. ఇటీవల తిరుపతిలో భారీ ఎత్తున పుస్తక ప్రదర్శన ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర బుక్‌స్టాల్‌తో పాటు మరొక బుక్‌ స్టాల్‌పై మనువాద మత మౌఢ్యకారులు దాడిచేసి కొన్ని పుస్తకాలను స్టాల్స్‌ నుంచి తీసివేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని పుస్తకాలను చించి వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించని ఏ పుస్తకమైనా అమ్మకం సాగించవచ్చు. కనీసం తిరుమలలో ఈలాంటి పుస్తకాల అమ్మకం కూడదనవచ్చు. మరో అంశం. తిరుమల పుణ్య క్షేత్రం దర్శనానికి రోజూ వేలాది మంది వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది తిరుపతి లో ఒకటి రెండు రోజులు వుంటారు. తిరుపతిలో అన్య మతస్తులు హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు నిర్వహిస్తున్నా ఇంత సుదీర్ఘకాలంలో మచ్చుకు మతమౌఢ్యం కలక వేయలేదు. పైగా దర్శనానికి అన్ని మతాల వారే కాకుండా విదేశస్తులు వస్తుంటారు. తిరుపతిలో బుక్‌స్టాల్స్‌ పై దాడులు చట్టాన్ని మత మౌఢ్య కారులు తమ చేతుల్లోనికి తీసుకోవడమే. ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఈ పరిణామమే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు దంచే కూటమి ప్రభుత్వ నేతలు ఈ చర్యపై కనీసం స్పందించక పోవడం పరిశీలించితే మనువాద మతమౌఢ్యకారుల చేతుల్లో ఎంతగా బందీలౌతున్నారో దీని పర్యవసానం ఏ కడకు దారితీస్తుందో ప్రజాస్వామ్య ప్రియులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనలన్నీ దేనికవిగా పరిగణించకూడదు. అన్నీ కూడా పూసల్లో దారంలాగా ఒకదాని కొకటి పటిష్టమైన పునాది కలిగి వున్నాయి. కొసమెరుపు ఏమంటే గతంలో వాజ్‌పేయి హయాంలో గుజరాత్‌లో జరిగిన మారణ హోమం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఒకప్పుడు కోరిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు. చంద్రబాబు నాయుడు స్వతహాగా ఆది నుండి కూడా లౌకికవాది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో హైదరాబాద్‌కు జాతీయ వామపక్ష నేతలు వస్తే చంద్రబాబు నాయుడు ఇంట ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లితే వెలితిగా భావించేవారు. హైదరాబాద్‌ నగరంలో మత సామరస్యం కాపాడిన పేరువుంది.
తిరుపతిలోనే ఐటిసిఎక్స్‌ పేరుతో అంతర్జాతీయ ఆలయాల సభ జరిగింది. ఈ సభలో బీజేపీికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గతంలో అయితే భిన్నంగా వుండేది. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని తనదైనశైలిలో ప్రసంగించారు. అంతవరకు సరే. కాని ఈ సభలో మరు రోజునే విహెచ్‌పి నేత మిలంద్‌ పరాండే ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఆలయాలకు రాలేదని ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం విముక్తి పోరాటం సాగించనున్నట్లు ప్రకటించారు. ఈ ధోరణి ఆంధ్ర ప్రదేశ్‌ను ఎక్కడికి తీసుకెళుతుందో ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో అనూహ్యమే. ఎన్టీఆర్‌ కూడా ఒక దశలో కాషాయ వస్త్రాలు ధరించారు. కాని మత మౌఢ్యాన్ని దరికిరానీయ లేదు. ఆ మహనీయుని వారసత్వం కాపాడవలసిఉంది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎన్టీఆర్‌ లాగా పూర్తిగా కాషాయ వస్త్రాలు ధరించడం లేదు. గాని సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రశ్నించడానికే తాను కారణ జన్ముడైనట్లు చెప్పుకొంటూ మత మౌఢ్య సంఘటనలపై స్పందించక పోవడం ఒకింత ఆశ్చర్యమే.
విశ్రాంత పాత్రికేయులు,
సెల్‌: 9848394013

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు