డా.ముచ్చుకోట సురేష్‌బాబు
మనుషులు జీవిస్తున్న ఈ భూగ్రహం విపరీతంగా వేడెక్కకుండా ఉండాలన్నా, వాతావరణ మార్పుల వలన కలిగే ప్రభావాలను నివారించాలన్నా గ్లోబల్ వార్మింగ్‌ను వీలైనంత వరకు తగ్గించుకునే దిశగా మార్పులు చేసుకోవాలి. ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 1.5 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోవడంతో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ వాతావరణ పరిస్థితి సాధారణ స్థాయికి రావాలంటే కర్బన్ ఉద్గారాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఉష్ణోగ్రత పరిమితిని దాటితే ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా గ్రీన్‌లాండ్, పశ్చిమ అంటార్కిటిక్ మంచు పలకలు కరిగిపోవడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. తరువాత అడవులు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. అడవులు నశించడం లేదా ఉప్పొంగి ప్రవహించడం వంటి విపత్కర మార్పులకు దారితీస్తాయి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగలడం, ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు కరిగి భారీ మొత్తంలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్ విడుదలవడం వంటివి జరుగుతాయి. గ్లోబల్ వార్మింగ్ పగడపు దిబ్బలపై ప్రభావం చూపిస్తోంది. దీని కారణంగా జంతువులు, చెట్లు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ ఉష్ణోగ్రతల కార్బన్‌డయాక్సైడ్ స్థాయిలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటితే మాత్రం ఇలాంటి క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్‌లో మార్పులు సంభవించి భూమి మీద జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవంచే వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అతిభారీ వర్షాలు, వరదలు, తుఫానులకు కారణమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవడంతో పాటు జీవనోపాధి, ఆస్తులకు నష్టం జరుగుతుంది. ఈ వాతావరణ నమూనాలన్నీ కూడా భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేయడంలో సాయపడుతున్నప్పటికీ, దశాబ్దాల పరిశోధన ఉన్నప్పటికీ, వాతావరణంలో ఎలాంటి మార్పుల్ని తీసుకురాలేకపోతున్నాయి. ఏడాది పొడవునా ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్ స్థాయిని దాటేశాయి. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా వేగంగా భూమి వేడెక్కుతోంది. అయితే అసలు ప్రమాదం కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన మాత్రమే కాదు, వాటి వల్ల తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. దీన్నే డొమినే ఎఫెక్ట్‌గా పిలుస్తారు. అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉండే చెయిన్ రియాక్షన్ అన్నమాట.వాతావరణ ప్రభావం మనిషి మీద మనుగడ మీద, తిండి మీద, పీల్చే గాలి మీద, తాగే నీటి మీద ఇలా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి మనిషి జీవన స్థితిగతులనే మార్చేస్తాయి. ప్రస్తుత ప్రపంచ విధానాలు ఈ ముప్పును నివారించడానికి సరిపోదు. వాతావరణం ప్రమాదకర అంచుకు చేరుకుంటోందంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేల ఏళ్లుగా మానవ నాగరికత స్థిరమైన వాతావరణంలో విలసిల్లింది. కానీ ఇప్పుడు ఆ స్థిరత్వం మాయమవుతోంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో మనం ఎంత ఆలస్యం చేస్తే, తిరిగి వెనక్కి రాలేనంతటి వినాశకరమైన పరిమితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనిశ్చితి అంటే రక్షణ కాదు. అది మనం మరింత వేగంగా స్పందించాలని ఇచ్చే హెచ్చరిక.
సెల్ : 9989988912


