మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలు
సవరణలు, అంచనాల ప్రతిపాదనలపై సమీక్షలు
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వ కసరత్తు ప్రారంభమైంది. ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గతంలో కంటే భిన్నంగా బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతివ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాలని, కీలక పథకాలకు నిధులు కేటాయిస్తూనే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించాలని యోచిస్తోంది. వివిధ శాఖలతో ఆర్థిక శాఖ ఇప్పటికే సమావేశమైంది. ఆయా శాఖల అవసరాలు, కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించింది. రానున్న బడ్జెట్ కూర్పు ఆర్థిక శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. ఒకవైపు అప్ప్పులు, మరోవైపు బిల్లుల భారం క్రమంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలునకు తోడు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. అన్ని ప్రభుత్వ శాఖలకు సమ ప్రాధాన్యం ఇవ్వడంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
యథా ప్రకారం మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం సవరించిన ప్రతిపాదనలతో పాటు 2026-27 సంవత్సరానికి తగిన అంచనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖల హెచఓడీలను ఆదేశించినట్లు తెలుస్తుంది. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వ్యత్యాసాలు చూపకుండా సవరణలు, అంచనాలను సమర్పించనున్నారు. బడ్జెట్ మాన్యువల్ ప్రకారం అంచనాలు ఉండాలని హెచఓడీలు, ఇతర ఎస్టిమేటింగ్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసిన్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలను నిధి.ఏపీసీఎపఎస్.ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తగిన యూజర్ వివరాలను ఆర్థికశాఖ అందిస్తుంది. రెవెన్యూ ఖర్చుల వివరాలు, ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా రెవెన్యూ వ్యయం… అసలుకు సంబంధించిన కచ్చితత్వాన్ని పాటిస్తూ అంచనాలు రూపొందించాలని నిర్దేశించింది. గతంలో ఉన్న బకాయిలు ప్రస్తుత సంక్షేమ పథకాల నిధులను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు అవసరాలపై గణాంకాల రూపకల్పనకు ఆర్థికశాఖ సూచనలు చేసింది. రెవెన్యూ రిసీపులు, నాన్ టాక్స్ రెవెన్యూ వివరాలు సేకరించి అన్ని విధాల పరిశీలన అనంతరం అంచనాలు సమర్పించే ముందు కార్యాచరణ ప్రకటించాలని ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది పన్నుల వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను అధిగమించేందుకు రోబోటిక్ మానిటరింగ్ మెకానిజంలా యంత్రాంగం పనిచేయాలని కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల ధరలు, సుంకాలు, ఫీజులు యథాతథంగా బడ్జెట్ రూపొందించనున్నారు. పన్నులకు సంబంధించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు ఇప్ప్పుడున్న ధరల ప్రకారమే బడ్జెట్లో పొందు పరుస్తారు. రాబడిలో కిందిస్థాయి నుంచి పారదర్శకంగా పనిచేసేలా సిబ్బందికి పర్సనల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని స్థాయిల్లో అనుసరించాలని హెచఓడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ మేనిఫెస్టో స్కీములు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యే పథకాలు, విదేశీ సాయం (ఎక్స్టర్నల్ ఎయిడ్) ప్రాజెక్టులు నాబార్డు, స్టేట్ డెవలప్మెంట్ స్కీములకు సంబంధించి హెచఓడీలు పంపే ప్రతిపాదనలను సంబంధిత విభాగాల కార్యదర్శులు పరిశీలించాల్సి ఉంటుంది. మౌలికవసతుల కల్పనపై దష్టి నేపథ్యంలో గృహ నిర్మాణం, మంచినీరు, విద్య, వైద్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు త్వరితగతిన పారిశ్రామికీకరణకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మధ్యకాలిక అభివృద్ధికి అవసరమైన అంశాలు పబ్లిక్ ` ప్రైవేటు భాగస్వామ్యం కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు… సెంట్రల్ ఎసిస్టెడ్ స్టేట్ స్కీం, ఎస్క్రీపీ, ఈఏపీ, నాబార్డు, హడ్కోలకు సంబంధిత చీఫ్ ఇంజనీర్లు హెచఓడీలకు సమాచారమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం నుంచి కొనసాగిస్తున్న పథకాలపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా ప్రతిపాదించాలని పేర్కొంది. కాగా, 20 శాతం (జీతాలు మినహా) ఆదా చేసేలా బడ్జెట్‌కు ఉండనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్లకు సవరణలపై ప్రతిపాదనలు ఆయా విభాగాలు సమర్పించాలి. ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు తదితర ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ ఖర్చులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, ఆడిట్ రిపోర్టులు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను సంబంధిత హెచఓడీలకు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెవెన్యూ వ్యయం తగ్గించుకుని మూలధన వ్యయాన్ని పెంచుకోవటం ద్వారా సంక్షేమం, అభివృద్ధిలో సమతుల్యత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


