Homeవిశ్లేషణసర్దుబాటు జీవితం

సర్దుబాటు జీవితం

- Advertisement -

ప్రస్తుతం సమాజంలో ప్రతి మనిషి జీవితం సర్దుబాటుతోనే సాగుతోంది. పనిమనిషి దగ్గర నుంచి మేధావి వరకు చివరకు పాలించే ప్రధాని వరకు సర్దుబాటుతోనే జీవితం కొనసాగిస్తున్నారు. చివరకు భార్యాభర్తలు కూడా సర్డుబాటుతోనే సంసారం సాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఇద్దరి అలవాట్లు, ఆశయాలు ఒకటిగా ఉండవు. చివరకు ఆహార అలవాట్లలోనైనా తేడా ఉంటుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సర్దుబాటులేని సమాజం ఉండదు. సమాజంలో అందరు కల్సి బతకాలంటే సర్దుబాటు తప్పనిసరి. సర్దుబాటు లేకుండా ఏ ఇద్దరు కలిసి బతకలేని పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులతో, భార్యాభర్తలు, చివరకు కన్నబిడ్డలతో కూడా సర్దుబాటు తప్పదు. కలిసి జీవనయానం సాగించడానికి సర్దుబాటు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలలో కూడా ఇష్టమున్నా, లేకపోయినా అధినాయకునితో సర్దుబాటు తప్పదు. అంతవరకు పరవాలేదు. మంచి మనుగడ కోసం మనం ఎన్నుకున్న అగ్ర నాయకులు ఇతర దేశాధినేతలతో చేసుకునే సర్దుబాటు వలన దేశం నష్టపోతున్నప్పుడు ఈ సర్దుబాటుపై బాధ కలుగుతోంది. అసలు ఈ సర్దుబాటుతో ఇతరుల ముందు తలవొంచి దేశానికి నష్టం కలిగించడం దేశ ద్రోహం కిందే లెక్క. కాని పాలకులు చేసే పనిని విమర్శించిన వారిపై దేశ ద్రోహం అని కేసులు పెట్టడం ప్రస్తుతం చూస్తున్నాం.
మేధావుల దృష్టిలో వ్యక్తిత్వం లేని మనిషి మనిషే కాదు. వ్యక్తిత్వం చంపుకొని ఇతరులు చెప్పిన దానికి తలవూపి అనసరించేవాడు మనిషే కాదంటారు. కాని ఆ విధంగా వ్యక్తిత్వం చంపుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా తల ఎత్తి బతికేవాడు ప్రస్తుత సమాజంలో కనబడటం లేదు. ప్రతి మనిషి ఎవరో ఒకరిపై ఆధారపడి బతుకుతున్నాడు. ఇతరుల సలహాలు తీసుకోవచ్చు మనసుకు నచ్చితే పాటించవచ్చు కాని తన బుర్రను పూర్తిగా తాకట్టుపెట్టి ఆలోచించడంమాని తమపై ఆధారపడటం ఆ వ్యక్తులకే కాదు సమాజానికే హానికరం. ఆలోచించడం మానితే దేశంలో అభివృద్ధి కుంటుపడినట్లే. ముఖ్యంగా మేధావులు ఆలోచించడం మానకూడదు. కాని ప్రస్తుతం మేధావులు చెప్పినవి పరిగణలోకి తీసుకోకపోగా వారిని పనికిరాని వారిగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో సమాజంలో అవమానం ఎదుర్కొనే కంటే మౌనం ఎరుగని మేధావులు ఇంటికే పరిమితమవుతున్నారు.
ఒక ఆలోచన కడగండ్లు పడుతున్న కుటుంబాన్ని గట్టెక్కించగలదు. ఒక ఆలోచన దేశ స్థితిగతులు మార్చగలదు. ఆలోచించకపోతే ఇప్పటికి ఆది మానవుడిలాగే జీవితం సాగించేవారం. కాని ప్రస్తుతం దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది. కాని ఆ యువత ఇతరులపై ఆధారపడుతు న్నారు. యువత ఆశయాలకు దూరమై కోరికలకు దగ్గరవుతోంది. ఆ కోరికలు 90 శాతం సంపాదన వైపు సాగుతున్నాయి. ఎవరో తన మేధావితనంతో ఎంతో కష్టపడి వినూత్న ఆలోచనలతో రూపొందించి కనిపెట్టినవి కాని ఆనందించడానికి కావలసిన డబ్బు సంపాదించడానికి ప్రస్తుతం రాజకీయాలు ప్రధాన వేదికగా యువత ఆలోచిస్తోంది.
చంద్రుడు, సూర్యుడిని దేవుళ్లుగా కొలిచిన సమాజం ప్రస్తుతం ఒక గోళమని చంద్రునిపై కాలిడుతున్న ఈ సమయంలో కూడా యువత సంపాదన కోసం మూఢభక్తితో వ్యవహరించడం తప్ప ఆలోచించడం మానివేసింది. జంతువులకు లేని ఆలోచించే శక్తి మనిషికున్న సద్వినియోగం చేసుకొని దేశాన్ని అభివృద్ధి పథóంలో నడపడానికి బదులు పుక్కిటి పురాణాలు, కాలక్షేపం సినిమాలపై దృష్టి పెట్టడం దేశానికి నష్టం అనే సంగతి యువత గుర్తించాలి. కళ్ల ముందు అరాచకం జరుగుతున్న నాకెందుకూ అని తప్పుకోవడం అలవాటుగా మారింది. అరాచకాలు పెరిగి తన దాకా వచ్చేవరకు వాటిపై దృష్టి పెట్టరు. దేశాభివృద్ధికి ఆలోచన కావలసిన యువత నాకెందుకులే అని తప్పుకోవడం అంటే దేశానికి తీరని నష్టం అనే సంగతి యిప్పటికైనా గుర్తించాలి. తల నెరసిన పెద్దలు తమ అనుభవాలతో కార్యాచరణ రూపొందిస్తే దాన్ని అమలుచేసి ఉద్యమబాట పట్టి సాధించవలసింది యువతే. ఆ సంగతి పక్కనపెట్టి ఆధునాతన జీవితం అనుభవించడానికి సంపాదన వైపు అడుగులు వేయడం శోచనీయం. ప్రజల ఆస్తులు కొందరు అధికారులు, నాయకులు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు దోచుకు తింటున్నా నాకెందుకులే అని మిన్నకుండటం యువతకు మంచిది కాదు. మంచి జరిగినా చెడు జరిగినా వాటి పర్యవసానం ఆలోచించి ముందడుగు వేయవలసిన యువత నిర్లిప్తతతో నిరాశతో మిన్నకుండటం దేశానికి తీరని నష్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశం అభివృద్ధి బాట పట్టకపోగా కనీసం పేదరిక నిర్మూలన చేయకపోగా అన్నదాన కేంద్రాలతో సరిపెట్టడం సరికాదు. దేశం అధోగతి పాలవుతుంటే యువత నిమ్మకు నీరెత్తినట్లు నాకెందుకులే అని సరిపెట్టుకొని, సర్దుబాటు వల్ల దేశానికి తీరని నష్టమని ఇప్పటికైనా గుర్తించాలి. గురజాడ, వీరేశలింగం, రాజారామ్మోహనరాయ్‌, గాంధీ, నెహ్రూ త్యాగ నిరతిని ఒకసారి మననం చేసుకుని ముందుకు సాగుతుందని ఆశిద్దాం.
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు