ఎన్నికల హామీల అమలులో విఫలం
. విద్యారంగ సమస్యలకు పరిష్కారం చూపని ముఖ్యమంత్రి
. ఫీజు రీయింబర్స్మెంట్ దాటవేత సిగ్గుచేటు
. వైద్య విద్య ప్రైవేట్‌పరం… కార్పొరేట్లకు కొమ్ముకాయడమే
. నినదించిన విద్యార్థి సంఘాలు
విశాలాంధ్ర – ఆదోని : ఎన్నికల హామీలు అమలు చేయని సీఎం ‘గో బ్యాక’ అంటూ ఏఐఎసఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలు నినదించాయి. విద్యార్థులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏం ముఖం పెట్టుకుని వస్తారంటూ నిలదీశాయి. పార్టీ ప్రచారాలకు, ఆర్భాటాలకు డబ్బులు ఉన్నాయి గానీ… విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట’ చెల్లించాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పడం సిగ్గుచేటంటూ సంఘ నేతలు నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామంలో రాజ ముద్ర పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేని సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలతో ఏఐఎసఎఫ్… ఇతర విద్యార్థి సంఘ నాయకులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు- విద్యార్థి సంఘ నాయకులు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎసఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.షాబీర్ బాష మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్నికల హామీలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ ప్రచార ఆర్భాటాలకు డబ్బులు ఉన్నాయి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని అడిగితే ఆర్థిక పరిస్థితి చెప్ప్పుకోదగ్గ స్థాయిలో లేదని చెప్పి తప్పించుకోవడం దుర్మార్గమన్నారు. జగన్ హయాంలో వైద్యరంగం నిర్వీర్యమైందని చెప్పి… వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చి… తీరా ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నాలు చేయడం విద్యార్థులను మోసగించడమేనని ధ్వజమెత్తారు. పేదలకు వైద్య విద్య దూరం చేయడమేనని మండిపడ్డారు. పీపీపీ విధానం ప్రవేశపెట్టి కార్పొరేట్లకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని విద్యార్థి సంఘ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తుంటే… కళాశాల యజమాన్యాలు తమ ప్రైవేట్ సైన్యం ద్వారా సంఘ నాయకులను కిడ్నాప్ చేసినా ముఖ్యమంత్రి అయి ఉండి నోరు మెదకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం అధికారంలోకి రావడానికే బూటకపు హామీలు ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు ఏ ఒక్కటైనా చిత్తశుద్ధిగా పరిష్కరించారా అని నిలదీశారు. పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేస్తానని చెప్పి … జిల్లాగా ప్రకటించకపోగా డివిజన్ స్థాయికే పరిమితం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించి విద్యారంగానికి పెద్దపీట వేయాలని కోరారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి వెన్నుముక వంటి ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఐఎసఎఫ్ జిల్లా సహా కార్యదర్శి దస్తగిరి, పట్టణ కోశాధికారి శేఖర్, సహాయ కార్యదర్శి మోహన్, శ్రీకాంత్, బీడీఎసఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్, డీఎసఎఫ్ నాయకులు, ఇతర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.


