. పకడ్బందీగా పాస్‌పుస్తకాల జారీ
. ఉద్యానపంటల కేంద్రంగా రాయలసీమ
. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
. విద్యుత్ చార్జీలు పెంచబోం
. మీ భూమి-మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు / ఎమ్మిగనూరు : భూమిపై ఇతరులెవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వహక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో శుక్రవారం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తొలుత గ్రామసభలో గ్రామ కార్యదర్శి అధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి, తీర్మానం చేసి సీఎం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. సీఎం మాట్లాడుతూ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి నెల 9న ఏదో ఒక జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై గ్రామ సభ నిర్వహిస్తామని, తాను కూడా అందులో భాగస్వామ్యం అవుతానన్నారు. ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోడానికి వీల్లేదని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పశ్చిమ కర్నూలుకు కూడా నీరిచ్చి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరిచ్చే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. “గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుంది. క్యూఆర్ కోడ్‌తో మీ ఫోన్‌లోనే మీరు చూసుకోవచ్చు. మీ రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రంగా ఉంటాయి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. రాజముద్రతో పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తున్నాం. వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తాం. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారు. సీబీఐ, సిట్ ఏమీ లేదని చెప్పారని అంటున్నారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించింది. బాత్‌రూమ్ క్లీన్ చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి సరఫరా చేశారు. శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారు. నేను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాం. తితిదే ఈవోను మార్చి మంచి ఆఫీసర్‌ను తీసుకొచ్చాం. గతంతో పోలిస్తే లడ్డూలో చాలా వ్యత్యాసం ఉంది”అని చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ చేశామన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నామని, పోలవరం, అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై ఫోటోలు వేసుకోవడానికి అతను ఎవరని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. జీవితంలో మరెవరూ రైతుల భూములపై కన్నేయకుండా భద్రతా విధానాలతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఎలాంటి తప్పులూ దొర్లకుండా పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామన్నారు. ఈ నెలలో 279 గ్రామాల్లో సర్వే చేసి 1.16 లక్షల మందికి పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని, 18 లక్షల పాస్ పుస్తకాలను ఏప్రిల్ ఆఖరుకు జారీ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూమిని కేవలం వంద రూపాయలతో మ్యూటేషన్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. గత పాలకులు ప్రైవేట్ భూములను 22ఏ అని ప్రభుత్వ భూమిగా చూపించి, రైతులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. 1956 రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరిచ్చి, శ్రీశైలం నీటిని రాయలసీమ ప్రాంతానికి మళ్లిస్తున్నామన్నారు. నదుల అనుసంధానం చేసి రాయలసీమ సహా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరిస్తామని తెలిపారు. గురురాఘవేంద్ర, రాజోలిబండ ఎడమ కాలువ పూర్తి చేస్తామన్నారు. 1900 నిధులు¹ కేటాయించి వేదవతి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల అటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని ప్రాంతాలు నీటి ముంపుకు గురౌతాయని వారితో చర్చించి, చర్యలు తీసుకుంటామన్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, అడిషనల్ సీసీఎలఏ వెంకట మురళి, జాయింట్ సెక్రటరీ చేతన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ తదితరులు
పాల్గొన్నారు.


