Homeవిశ్లేషణ‘సీమ’కు అన్యాయం ఇంకానా?

‘సీమ’కు అన్యాయం ఇంకానా?

- Advertisement -

వి. శంకరయ్య

రాయలసీమ వాసులు ఏ నోము నోచుకున్నారో ఏమోగాని కీలక సమయాల్లో ప్రతి దఫా మోసానికి గురవుతున్నారు. అనాదిగా వెన్నాడుతున్న దారిద్య్రం అజ్ఞానంతో కునా రిల్లుతున్న ప్రజా సమూహం రాయలసీమలో వేళ్లూనిన ఫ్యూడల్ వ్యవస్థకు ఫ్యాక్షనిస్టు శక్తులకు బలి పశువుýయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ సంకెళ్లు నుండి బయట పడుతున్నారు. తొలి రోజుల్లో కడప కోటి రెడ్డి, పప్పూరు రామాచార్యులు ప్రభృతులు ఎంతో ముందు చూపుతో రాయలసీమకు తాగు, సాగు నీరు ఆవశ్యకత దృష్టిలో పెట్టుకొని శ్రీబాగ్ ఒడంబడిక చేసుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీబాగ్ ఒడంబడికలో అనంతపురంలో యూనివర్సిటీ కేంద్రం తర్వాత రెండవ అంశంగా సాగునీటి ప్రాజెక్టులు నాల్గవ అంశంగా రాజధాని హైకోర్టు వున్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో గాని ఇన్నేళ్ల తర్వాత ఈ రోజుల్లో కూడా సాగునీరు కాదు కదా తాగునీటికి వలసలు పోయే దుర్భర స్థితి రాయలసీమలో వుండటమే కారణం. అవిభక్త మద్రాసు రాష్ట్రంలో కృష్ణపెన్నార్ ప్రాజెక్టు ప్రతిపాదించటం జరిగింది. ఈ పథకం అమలు జరిగి వుంటే రాయలసీమ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కాని తమిళనాడుకు కృష్ణా జలాలు ఇవ్వకూడదని ఈ పథకం రద్దయింది. రాష్ట్రం బాగు కోసం సీమ ప్రజలు తమ భవిష్యత్తు బలి చేసుకున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు శ్రీబాగ్ ఒడంబడిక పేరు చెప్పి నీలం సంజీవరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కర్నూలు రాజధాని చేశారు. శ్రీబాగ్ ఒడంబడికలో ప్రముఖ అంశంగా పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టులు బుట్ట దాఖలు చేశారు. కృష్ణపెన్నార్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం సిద్దేశ్వరం బహుళారœ సాధక ప్రాజెక్టు. 1965లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం జలాశయాన్ని కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా పునాది వేసిన సందర్భంలో ఈ తరం వారికి తెలియదు గాని సిద్దేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని ఆందోళన జరిగింది. కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య కృష్ణానదిపై సిద్దేశ్వరం వద్ద బహుళారœ సాధక ప్రాజెక్టు నిర్మించితే కృష్ణ` పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పోరాడారు. అన్ని ఆశలు ఆవిరై పోగా తుదకు నేడు సిద్దేశ్వరం వద్ద అలుగు కోసం సీమ రైతుల పోరాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను ద్వితీయ పౌరులుగానే భావించి వెనుకబడిన జిల్లాలుగా చట్టబద్దం చేశారు. తగు రక్షణ కల్పించారు. రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికి కూడా భిక్షం పెట్టని కేంద్రంలోని బీజేపీ¾ ప్రభుత్వం మోసం చేసింది. ప్రత్యేక హోదాతో పాటు చట్టబద్దత గల ప్రత్యేక పథకాలు గాలికి పోయాయి. 2014 ఫిబ్రవరి 20 వ తేదీ రాజ్య సభలో రాష్ట్ర విభజన చట్టం చర్చ జరుగుతున్న సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ మాట్లాడుతూ ఏపీలో 13 జిల్లాలకు ఏడు జిల్లాలు వెనుకబడి వున్నందున బుందేల్ ఖండ్ నమూనాతో రాయలసీమకు ప్రత్యేక పథకం అమలు జరుపుతుందని హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ¾ అధికారంలోనికి వచ్చిన తర్వాత చట్ట బద్దత గల అంశాలకే దిక్కు లేకపోతే హామీలు ఒక లెక్కా ? ఇప్పుడు ఇదెందుకు ప్రస్తావించుతున్నానంటే యూపీ¾ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపించి వున్న బుందేల్ ఖండ్ ప్రాంత అభివృద్ధి 44,605 కోట్ల వ్యయంతో యమునా నది ఉపనదులైన కెన్ బెత్తా నదుల అనుసంధాన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తన నిధులతో నిర్మించుతోంది. ఈ దురాగతానికి అన్యాయానికి రాష్ట్ర విభజనకు తర్వాత పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పరిపాలన చేస్తున్న కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రజలకు ఏం చెబుతారు? తాను అధికారంలోనికి వస్తే రాయలసీమను కోనసీమ చేస్తానని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కడంతోనే సరిపెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్ పనులకు అవసరమైన విధంగా అనేక సాగునీటి పథకాలకు పరిపాలన అనుమతులు మాత్రం లెక్కకు మించి ఇచ్చారు. ఇవేవీ నిర్మాణం ప్రారంభం కాకనే అయిదేళ్లు గడచి పోయింది. రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో వున్న నాలుగు ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుండిపోయాయి. అంతర్ రాష్ట్ర పరంగానూ తుదకు అంతర్గతంగా నేటికీ వివాదాస్పదంగా వున్న జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలు పథకం గురించి వాస్తవం చెప్పాలంటే రాయలసీమ ప్రజలు కోరుకోలేదు. ముందుగా పెండింగ్ ప్రాజెక్టులను గట్టెక్కించాలని ఆశపడ్డారు. అయితే అంతా ఎండమావి అయిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో కూడా చరిత్ర చర్విత చరణం అవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని రాయల సీమ వాసులు భావించారు. 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిని 2019-2024 మధ్య అయిదేళ్ల కాలంతో పోల్చుకొని తిరిగి ఏక పక్షంగా కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. కాని ప్రస్తుతం రెండేళ్లు గడచిపోయింది. అంతా భ్రాంతియేనా అని ఆందోళన చెందుతున్నారు.. జగన్మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టి వివాదాల వలయంలో చిక్కుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంలాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలకెత్తుకున్న బనకచర్ల అనుసంధానం తయారైంది. ఒక వేళ బనకచర్ల అనుసంధానానికి అనుమతి వచ్చినా మిగిలిన రెండన్నరేళ్ల కాలంలోనే కాదు మరొక అయిదేళ్ల కాలంలో కూడా గోదావరి జలాలు బనకచర్లకు చేరే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుభవం వుండీ ముఖ్యమంత్రి ఎందుకు బనకచర్ల అను సంధానం కోసం వెంపర్లాడుతున్నారో అవగతం కాదు. ఈ అనుసంధాన పథకం గురించి అనేక రకాల ఆరోపణలు వస్తున్నా అవన్నీ పక్కన బెడితే గోదావరి జలాలు రాయలసీమకు తరలించాలని పైగా రాయలసీమకి పథకం అనుసంధానమైతే వెనుకబడిన జిల్లాలుగా చూపెట్టి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుంది. వరద జలాలు ఆధారంగా డిపిఆర్ ఆమోదింపబడి ముందుకు సాగే అవకాశం లేదు. నేడేమైంది ? బనకచర్ల అనుసంధాన పథకం పట్ల రాయలసీమ ప్రజలు ఆశక్తి చూపడం లేదు. తమ ఇంటి ముంగిట పోయే నీళ్లు వదలిపెట్టి కొన్ని వందల కిలోమీటర్ల నుండి అనేక ఎత్తిపోతలు క్లిష్టతరమైన టన్నెల్స్‌ నిర్మాణం అధికమించి సాగునీరు ఇవ్వడంపై తమకు పూర్తిగా నమ్మకం లేదని అనుసంధానం యెడల ఆసక్తి చూపడం లేదు. గోదావరి నీళ్లు డెల్టాకు సాగర్ కుడి కాలువకు ఇచ్చి కృష్ణాజలాలు శ్రీశైలం నుండి తమకు ఇవ్వాలని రాయలసీమ వాసులు కోరుకొంటున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కన్పించడం లేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టులకు పంట కాలువలు నిర్మాణం పూర్తి చేయాలని సీమ రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుపై నిధులు వ్యయం చేశారు. నిజమే. కుప్పంకు నీళ్లు తీసుకుపోయేందుకు అనే భావన అనంతపురం జిల్లా రైతుల్లో బల పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇందులో రాయలసీమ ఎంత వ్యయం చేశారో చెబితే బాగుంటుంది. తాజాగా వచ్చే మూడేళ్లలో రాయలసీమలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి అదనంగా ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇస్తారో చెప్పాలి. ఇక వున్నది రెండేళ్ల కాలం. రాష్ట్ర ప్రభుత్వం 35, 313 కోట్లు సమీకరించడం సాధ్యమా? రాష్ట్రంలో వెనుకబడి గొంతెండి పోతున్న రాయలసీమకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు? కేటాయించిన నిధుల వ్యయం చేయగలరా? స్థానికంగా వుండే నేతలు వ్యయం చేయనిస్తారా? ఇవన్నీ యక్ష ప్రశ్నలే. కొసమెరుపు ఏమంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లుడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. మరి ఆంధ్ర ప్రదేశ్ స్పందన….? విశ్రాంత పాత్రికేయుడు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు