Homeవిశ్లేషణఆంగ్లేయుల అహంకారాన్ని అణిచిన యోధులు

ఆంగ్లేయుల అహంకారాన్ని అణిచిన యోధులు

- Advertisement -

సయ్యద్ నశీర్ అహమ్మద్

భారత తొలి స్వతంత్ర సంగ్రామంగా పేరున్న 1857 సిపాయిల తిరుగుబాటుకు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బ్రిటీష్ పాలనను వ్యతిరేకించి… వారిని ఎదిరించి సిపాయిల తిరుగుబాటు ప్రభావం మాటల్లో చెప్పలేనిది. 1800 అక్టోబర్ 12న నిజాం సంస్థానం ఈస్ట్ ఇండియా కంపెనీతో “సైనిక సహకార ఒప్పందం” చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల నిజాం రాజ్యం కాస్తా “బ్రిటీష్ రక్షిత ప్రాంతం” అయ్యింది. ఆ తరువాత ఇరు పక్షాల మధ్య కుదిరిన అనేక ఒప్పందాల ఫలితంగా ఆంగ్లేయులు నిజాం సంస్థానంలో ఆధిపత్యం, అహంకారం, పెత్తనం ప్రదర్శించసాగారు. అందుకు ఆగ్రహించిన నైజాం ప్రజలు, ప్రముఖులు ఆంగ్లేయుల చర్యల పట్ల వ్యతిరేకత ప్రదర్శించసాగారు. ఈ వ్యతిరేకత 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం సమయానికి పెరుగుతూ వచ్చింది. ఆ పరిణామాల ఫలితంగా 1857 జులై 17న హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదులో ప్రజలు సమావేశం అయ్యారు. ఆంగ్లేయుల ఆధిపత్యానికి కేంద్రస్థానమైన “బ్రిటీష్ రెసిడెన్సీ” మీద దాడికి ప్రజలు సిద్ధమయ్యారు. మక్కా మసీదు నుండి ఆయుధాల్ని తీసుకుని ప్రజలు బ్రిటీష్ రెసిడెన్సీ దిశగా సాగారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబు కదలి వస్తున్న ప్రజాదండుకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్ రెసిడెన్సీలోని ఆంగ్లేయ అధికారులకు చేరవేశాడు. వెంటనే వారంతా అప్రమత్తమయ్యారు. ఆధునిక ఆయుధాలున్న సైనిక పటాలాలతో ఎదుర్కోడానికి సిద్ధం చేశారు. అశ్విక దళాన్ని, ఫిరంగి దళాన్ని మొహరించారు. ఆ చారిత్రాత్మక, సాహసోపేత దాడికి మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్, పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వం వహించారు. 1857 జూలై 17 సాయంత్రం ఆరంభం అయినటువంటి పోరాటం ఆ రాత్రంతా సాగి మరుసటి రోజు తెల్లవారుఝ²మున ముగిసింది. ఈ పోరులో 32 మంది అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత ఉన్న అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ ప్రజలను సమీకరించుకుని ఆంగ్లేయుల మీద తమ పోరాటాన్ని కొనసాగించేందుకు పోరాట స్థలి నుండి తప్పుకున్నారు. ఆ తరువాత ఆ యోధులను నిర్బంధించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అంగ్ల-నిజాం సైన్యాలతో సాగిన పోరాటంలో పఠాన్ తుర్రేబాజ్ఖాన్ అమరులయ్యారు. మౌల్వీ అల్లావుద్దీన్ కొంత కాలం తరువాత పట్టుబడ్డారు. ఆయన ఆజన్మాంతర శిక్షకు గురయ్యారు. ఆయన్ని అండమాన్ జైలుకు పంపారు. చివరకి అక్కడే కన్నుమూశారు. ఆ యోధుల స్మారకంగా 1957లో భారత ప్రభుత్వం హైదరాబాద్ లోని కోటి సెంటర్‌లో ఒక స్మారక స్థూపం కూడా నిర్మించింది. ఆనాడు జూలై 17న బ్రిటీష్ రెసిడెన్సీ మీద జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ, ఆ దాడికి నాయకత్వం చేపట్టిన ఆ ఇరువురు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ జూలై 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక స్మారక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా, ఆ యోధుల సాహసోపేత పోరాట చరిత్ర క్లుప్తంగా.
మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ : దక్షిణ భారత దేశంలో బలమైన నైజాం సంస్థానంలో ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించిన ధార్మిక నాయకులు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, పూర్వపు నైజాం సంస్థాన రాజధాని కేంద్రం హైదరాబాద్ నివాసి. 1857లో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం కాగానే అల్లావుద్దీన్ తిరుగుబాటు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. నిజాం నవాబు సంస్థానంలో భాగమైన ఔరంగాబాదులో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు రగులుకుంది. ఆ తిరుగుబాటుకు శ్రీకారం పలికి అక్కడ నుండి ఆశ్రయం కోసం హైదరాబాద్‌కు వచ్చిన యోధులను నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ యోధులను విడుదల చేయాలంటూ విజ్ఞప్తులు పంపినా విడుదల చేయలేదు. దాంతో ప్రజలు, ప్రముఖులు 1857 జూలై 17న మక్కా మసీదులో సమావేశమై బ్రిటీష్ రెసిడెన్సీ మీద దాడి చేయాలని నిర్ణయించారు. నిర్ణయం మేరకు జులై 17 మధ్యాహ్నం నాలుగు గంటల సమయానికి పోరాట యోధులు మౌల్వీ అల్లావుద్దీన్, పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలో సుమారు 500 మంది యోధులు రణనినాదం చేస్తూ గుమికూడారు. సుల్తాన్ బజారు నుండి బ్రిటీష్ రెసిడెన్సీ మీద దాడికి ఉపక్రమించింది. ఆంగ్లేయులకు స్నేహహస్తం అందించిన నైజాం నవాబు ఈ దాడి విషయాన్ని ఆఘమేఘాల మీద ఆంగ్లేయాధికారులకు తెలిపారు. ఆంగ్లేయాధికారులు, నిజాం-ఆంగ్ల సైన్యాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, అదనపు బలగాలతో ‘బ్రిటీష్ రెసిడెన్సీ’ మొహరించాయి. అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ నేతృత్వంలోని ప్రజల దాడిని ఎదుర్కొన్నారు. ఆ రాత్రంతా ఇరుపక్షాల మధ్య కాల్పులు సాగాయి. చివరకు శత్రు బలగాలదే పైచేయి కావడంతో స్వదేశీ యోధులు, దాడిని విరమించుకుని నిష్క్రమించారు. ఈ సాహసోపేత చర్యతో ఖంగుతిన్న ఆధికారులు, నిజాం-ఆంగ్ల సైన్యాలు ఆగ్రహించి హైదరాబాద్ ప్రజల మీద విరుచుకుపడ్డాయి. మౌల్వీ అల్లావుద్దీన్ను పట్టిచ్చిన వారికి 4 వేల నజరానా ప్రకటించగా మౌల్వీ అల్లావుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏడాదిన్నర పాటు పీర్ మహమ్మద్ అనే సన్నిహితుని వద్ద ఆశ్రయం పొందిన మౌల్వీ సొంతగడ్డ, స్వజనుల మీద ఆంగ్లేయుల పెత్తనానికి చరమగీతం పాడేందుకు సయ్యద్ భికూక్క, సయ్యద్ లాల్, మహమ్మద్ అలీ లాంటి పోరాట యోధులతో సంప్రదింపులు సాగించారు. చివరకు ఆయనను బ్రిటీష్ సైన్యం నిర్భంధించి 1859 జూన్ 28న అండమాన్ జైలుకు పంపారు. ఆ జైలులో 25 ఏళ్లు దుర్భర జీవితం గడిపి 1884లో కన్నుమూశారని డాక్టర్ సరోజినీ రేగాని పేర్కొన్నప్పటికి ఆ మహాయోధ 1889 వరకు సజీవులన్న విషయాన్ని అధికారిక దస్త్రాలు వెల్లడిస్తున్నాయి.
పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ : బ్రిటీష్ పాలకులను ఎదుర్కోవటం మృత్యువును వాటేసుకోవడమని స్వదేశీ యోధులకు తెలిసినా, పరాయి పాలకులను తరిమి కొట్టేందుకు నడుం కట్టిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ హైదరాబాద్ నివాసి. ఆయన తండ్రి పఠాన్ రుస్తుం ఖాన్. బ్రిటీష్ సైన్యంలో సైన్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలం నాయకుడు. ఆంగ్లేయులకు హితుడుగా మారిన నిజాం నవాబు అభీష్టానికి వ్యతిరేకంగా బ్రిటీష్ పాలకుల నుండి మాతృదేశాన్ని విముక్తి చేయమన్న మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ మాటతో తుర్రెబాజ్ ఖాన్ పోరుబాట ఎంచుకున్నారు. హైదరాబాద్ రెసిడెన్సీ మీద దాడి చేసిన ఆయన్ను బ్రిటీష్ ప్రభుత్వం జులై 22న నిర్బంధించింది. ఆయన యావదాస్తిని స్వాధీనం చేసుకుని అండమాన్ జైలుకు పంపింది. ఆ శిక్ష అమలు జరిగేలోగా తుర్రెబాజ్ ఖాన్ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. ఆగ్రహించిన ప్రభుత్వం తుర్రెబాజ్ ఖాన్‌ను సజీవంగా గానీ నిర్జీవంగా గానీ అప్పగిస్తే 5 వేల నజరానా ఇస్తామని 1859 జనవరి 19న ప్రకటించింది. పాలకులు ప్రకటించిన నజరానాకు ఆశపడిన కుర్బాన్ అలీ అనే నమ్మకద్రోహి అందించిన సమాచారంతో మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ గ్రామం మీద 1859 జనవరి 24న నిజాం, బ్రిటీష్ సైన్యాలు విరుచుకు పడ్డాయి. ఆ సైన్యాలను సాహసోపేతంగా ఎదుర్కొంటూ తుర్రెబాజ్ ఖాన్ శత్రువు సైనికుల తుపాకి గుళ్లకు బలయ్యారు. ఆ యోధుని పార్థివ శరీరాన్ని హైదరాబాదు నగరానికి తరలించి అంత్యక్రియలు ఏవీ జరపకుండా బలమైన ఇనుప గొలుసులతో కట్టేసి ప్రస్తుత సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఉన్న చోట ఒక గుంజకు బహిరంగంగా వేలాడదీశారు. ప్రజలలో తిరుగుబాటు ఆలోచనలు ఏమాత్రం మళ్లీ పొడ చూపకుండా వారిలో భయోత్పాతం కల్గించేందుకు ఆంగ్లేయులు ఇటువంటి అత్యంత పాశవిక చర్యలకు పాల్పడ్డారు. చివరకు మాతృభూమి విముక్తి పోరాటం విజయవంతం కావడంతో భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రపుటలలో గౌరవప్రదమైన స్థానం పొందిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారు. సెల్ : 9440241727

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు