డా॥ జ్ఞాన్ పాఠక్
సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం సాధారణ ప్రజలకు ఊరటనిచ్చేదిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి అరెస్టులు, ఇళ్ల కూల్చివేతలు, బహిష్కరణలు, కస్టడీ హింస వంటి చర్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బడా వ్యక్తులే కాకుండా సామాన్య పౌరులు ఏ సమయంలోనైనా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వీలుగా ఒక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పటివరకు దేశంలోని ప్రముఖులకు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో అంటే పగలు రాత్రి అన్న తేడా లేకుండా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండేది. సాధారణ ప్రజలకు అలాంటి వ్యవస్థ ఇంతవరకూ అందుబాటులో లేదు. కేరళలో 2024లో దేశంలోనే మొట్టమొదటి 24 గంటల ఆన్లైన్ కోర్టు సదుపాయాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత దేశంలో 24 గంటల డిజిటల్ ఇ-కోర్టులు కార్యరూపం దాల్చినప్పటికీ, ప్రజల జీవితాన్ని, స్వేచ్ఛను పరిరక్షించడంలో వాటి పరిధి పరిమితంగానే ఉండిపోయింది. జూలై 14న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై కీలకంగా స్పందించింది. సామాన్య పౌరులు సైతం 24 గంటలూ న్యాయం పొందొచ్చు అన్న గొప్ప ఆశను వారిలో రేకెత్తించింది. సుప్రీంకోర్టు న్యాయవాది మహెరవిష్ రైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, ఎప్పుడైనా న్యాయం పొందేలా ఎస్ఓపీ రూపొందించాల్సిన అవసరాన్ని పరిశీలిస్తామని తెలిపింది. పిటిషనర్ మహెరవిష్ రైన్ వాదిస్తూ… ఇటీవల అర్ధరాత్రి అరెస్టులు, తెల్లవారుజామున ఇళ్ల కూల్చివేతలు, సెలవు రోజుల్లో ప్రభుత్వ చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టులు నిర్దిష్ట పని వేళలకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం కోర్టు పని వేళలు, సెలవులు, వెకేషన్ బెంచ్‌ల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే న్యాయం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. “ప్రాణం, వ్యక్తిగత స్వేచ్చ,Û రక్షణ కోర్టుల పని వేళలపై ఆధారపడకూడదన్నారు . రాజ్యాంగం రాత్రిపూట నిశ్శబ్దంగా ఉండకూడదన్నారు. ఉదయం కోర్టు తెరుచుకునే వరకు ప్రజలు న్యాయం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకూడదని మహెరవిష్ రైన్ వాదించారు. ఈ ధర్మాసనంలోని సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ఈ-ఫైలింగ్ వ్యవస్థ వల్ల కోర్టులు పూర్తిగా మూతపడవని సూచించారు.‘ఒక లేఖ, ఈ`మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా న్యాయ ప్రక్రియను ప్రారంభించవచ్చన్నారు. అయితే ఈ సాంకేతిక సదుపాయాలు దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలు చేసే వ్యవస్థ ఇంకా లేదని పిటిషనర్ మహెరవిష్ రైన్ వివరించారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం, ప్రాణం, స్వేచ్ఛకు సంబంధించిన అత్యవసర కేసుల్లో ఒక గంటలోపే కోర్టు స్పందించే విధంగా ఎస్ఓపీ రూపొందించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అలాగే, అత్యవసర కేసుల విచారణ కోసం హైకోర్టుల్లో ప్రత్యేక విధులు నిర్వహించే న్యాయమూర్తులు లేదా ‘ఎమర్జెన్సీ కాన్స్టిట్యూషనల్ బెంచ్‌లు’ ఏర్పాటు చేయడం, ఈ-ఫైలింగ్ ద్వారా సెలవు రోజులు, రాత్రి వేళల్లో కూడా పిటిషన్లు స్వీకరించే విధానాన్ని రూపొందించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఎస్ఓపి తయారీని న్యాయపరంగా కాకుండా పరిపాలనాపరంగా చేపట్టాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సూచనకు కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించింది. హైకోర్టులు సుప్రీం కోర్టు పరిపాలనా పరిధిలోకి రానందున, పిటిషన్‌ను న్యాయపరంగా విచారించి, ఉత్తర్వులు జారీ చేయాల్సి రావచ్చని సూచించింది. ఈ అంశం ప్రాధాన్యతను వివరిస్తూ 1986లో ‘బిహార్ లీగల్ సపోర్ట్ సొసైటీ వర్సెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గుర్తు చేశారు. 1986 సెప్టెంబర్‌లో అర్ధరాత్రి జరిగిన విచారణలో ఇద్దరు పారిశ్రామికవేత్తల బెయిల్ దరఖాస్తు విషయంలో కోర్టు చూపినంత ఆందోళనను సామాన్యుల కేసుల విషయంలోనూ చూపిస్తుందా అని ప్రశ్నిస్తూ కోర్టులో దాఖలైన కేసును ధర్మాసనం విచారించింది. ఇప్పుడు మహెరవిష్ రైన్ వాదిస్తూ, “భారత రాజ్యాంగం నిద్రపోదు…రాత్రిపూట మౌనంగా ఉండదు, అలాగే స్వేచ్ఛ కూడా కోర్టు తలుపులు తెరిచే వరకూ వేచి చూడాల్సిన పని లేదు” అన్నారు. ఆ తీర్పులో సుప్రీంకోర్టు సాధారణ ప్రజల ఆశలకు ప్రతీకగా ఉండాలని పేర్కొంది. ఏ సమయంలోనైనా పనిచేయగల వ్యవస్థలో, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పరిమితులకు లోబడి ఉండకూడదన్నారు. సామాన్యుడు న్యాయం పొందే హక్కు కోర్టు పనివేళలు, వారాంతాలు , ప్రభుత్వ సెలవులకు అతీతంగా ఉండాలన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, సాధారణ పని దినాల్లో సాయంత్రం 4.30 గంటల తర్వాత అత్యవసర కేసులు మినహా ఇతర పిటిషన్లు స్వీకరించరు. శనివారాల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా అత్యవసర కేసులు తప్ప మిగిలినవి తీసుకోరు. శనివారాల్లో, కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటాయి. అలాగే క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల సమయంలో కోర్టు ఎప్పుడు పనిచేయాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో అత్యవసర సందర్భాల్లో 24 గంటల న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది.


