విశాలాంధ్ర – ఎస్వీయూ
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో యస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థ
ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ప్రముఖ కవి గండ్లూరు నారాయణ రాయ శర్మ రాసిన రామాయణం ‘కిష్కింధాకాండ‘ తెలుగు పద్య కావ్యాన్ని యస్వీయూ ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, సరస్వతి సత్పుత్ర డాక్టర్ మేడసాని మోహన్, ఓ ఆర్ ఐ డైరెక్టర్ ఆచార్య పి సి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ఆచార్య టాటా నరసింగరావు మాట్లాడుతూ, రామాయణంలో వర్ణించబడిన పుష్పక విమానం ఊహ సాకారమై ఈ రోజు మనం ప్రయాణిస్తున్నామని, రామాయణంలో కిష్కింధ కాండలో ఎన్నో సామాజిక విషయాలు ఉన్నాయని, ఈ గ్రంథం అన్నదమ్ములైన వాలి, సుగ్రీవుల మధ్య భిన్నాభిప్రాయాలు, హనుమంతుని పట్టుదల గల వ్యక్తిత్వం, అంగదుడు వంటి కొడుకులు
రామాయణంలో పాత్రలుగా కనిపించినా, మనకు ఎన్నో లోతైన విషయాలను వివరిస్తాయని అన్నారు. తాను సైంటిస్ట్ అయినా, ప్రతి శాస్త్ర పరిణామం వెనుక భగవంతుని ప్రమేయం ఉంటుందని నమ్ముతానని తెలియజేశారు.
వేదిక్ విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని సరళమైన ఛందస్సుతో కవి తెలుగు పద్యాల్లో అనువదించారని, శిల్పం, శయ్య, పాకం, శైలీ వంటివి కవికి బాగా తెలుసునని, రామాయణ కిష్కింధ కాండలో ప్రాప్త్యాశ అనే కార్యావస్థను తెలియజేస్తుందని అన్నారు. వివిధ రకాల ఛందస్సుల నాటకాలను రాగయుక్తంగా పాడి వినిపించారు.
రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ పరిపాలన ఎలా చేయాలో రామాయణం గ్రంథం వివరిస్తుందని, అన్యాయం, దుర్మార్గం వంటి నశించి, ధర్మం నిలబడుతుందని రాముడి కథ తెలియజేస్తుందని అన్నారు. కిష్కింధ కాండలో అన్నదమ్ములు కూడా రాజ్యం కోసం ఎలా గొడవలు పడ్డారో వాలి, సుగ్రీవుల పాత్రల ద్వారా తెలుస్తుందని తెలిపారు. ఈనాటి సమాజానికి రామాయణం అనేక విషయాలను చెబుతుందని అర్థం చేసుకోవాలని అన్నారు.
ప్రముఖ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, తెలుగులో రామాయణ కావ్యాలు అనేకం వచ్చాయని, వాల్మీకి రామాయణాన్ని తిక్కన, బుద్ధారెడ్డి, భాస్కరుడు,మొల్ల, విశ్వనాథ వంటి వారు అనువదించారని, ఇప్పుడు నారాయణ రాయ శర్మ చేసిన పద్యాన్ని వాదం చాలా బాగుందని చెప్పారు. వాల్మీకి శ్లోకాలకు కవి రాసిన పద్యాలు ఎంత బాగా కుదిరాయో ఉదహరించి, తులనాత్మకంగా వివరించారు. అవధానిగా తాను ఎదుర్కొన్న సమస్యా పూరణలను
ఉదహరించారు.
గ్రంథాన్ని సమీక్షించిన డాక్టర్ ప్రసాదరావు కవి శ్రమను చక్కగా
వివరించారు.
గ్రంథంలో ఎక్కువ కందపద్యాలున్నాయని, 67 సర్గల్లో, మూడు వేల పద్యాలతో, 538 పుటలతో రాయబడ్డిన గ్రంథంలో ప్రతి సర్గకు చిత్రం ఇవ్వడం గొప్ప ప్రయత్నమని అన్నారు. కవి చేసిన వర్ణనలను, సామెతలను,పలుకుబళ్లను వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రాచ్య పరిశోధన సంస్థసంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు
మాట్లాడుతూ సంస్థ ప్రాచీన సాహిత్యం సంరక్షణలో భాగంగా ప్రాచీన గ్రంథాలపై పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహిస్తుందని, భూమిపై నదులు, పర్వతాలు ఉన్నంత వరకు రామకథ ఉంటుందని బ్రహ్మ చెప్పినట్లు ప్రచారంలో ఉన్న శ్లోకాన్ని ఉదహరించి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కవి నారాయణ రాయ శర్మ స్పందిస్తూ, రాముడే తన చేత సుందర కాండ, కిష్కింధ కాండ రాయించాడు, ఇప్పుడు అరణ్య కాండ రాస్తున్నానని, 30 సంవత్సరాలు ఆంగ్లం బోధించి, ఇప్పుడు తెలుగు పద్య సాహిత్యం రాయడం భగవంతుని కృప అని తాత్త్వికంగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య గోవిందరాజు, విద్యా భవన్ సంచాలకులు సత్యనారాయణ రాజు, ఆకుల మల్లేశ్వరరావు, ఆచార్యులు దేవసేన నాయుడు, వెంకట్రావు, ఆనంద నాయుడు, విశ్వనాథరెడ్డి, రాజశేఖరరెడ్డి, రాజేశ్వరి, తెలుగు పరిశోధకులు, తెలుగు విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.


