Tuesday, April 15, 2025
Homeసంపాదకీయంసుంకాల వేలం పాట

సుంకాల వేలం పాట

యాభై ఆరు అంగుళాల వెడల్పు ఛాతీ ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజంగా అపారమైన గుండె దిటవు ఉన్న వ్యక్తే. రెండో సారి అమెరికా అధ్యక్షుడైన తరవాత డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్నం తటినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధానిని ఆహ్వానించకపోగా భారత్‌ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద అడ్డదిడ్డంగా సుంకాలు విధిస్తోందని నానా యాగీ చేశారు. భారత్‌ మీద భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా అనేక దేశాల మీద సుంకాలు విధించారు. భారత్‌కు చెందిన ఔషధ కంపెనీలను మాత్రం అదనపు సుంకాలు విధించడం నుంచి మినహాయించారు. దీనితో మన దేశంలోని ఈ రంగం ఇప్పటికైతే ఊపిరి పీల్చుకుంది. ట్రంప్‌ విధిస్తున్న అస్తవ్యస్త సుంకాలకు భారత్‌ మినహా అనేక దేశాలు అమెరికా మీద సుంకాలు విధించి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద చైనా 84 శాతం సుంకాలు విధిస్తే ట్రంప్‌ వెంటనే చైనా మీద 104 శాతం సుంకాలు విధించారు. చైనా విధించిన సుంకాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సరుకుల మీద చైనా ఇప్పటిదాకా 34 శాతం సుంకం విధుస్తూ ఉండేది. ట్రంప్‌తో సుంకాల యుద్ధంలో చైనా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చైనా ప్రతీకార సుంకాలు విధించినందువల్ల అమెరికా కంపెనీలు చైనా నుంచి తక్షణం అమెరికాకు వచ్చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. ఒక దేశం నుంచి కంపెనీలను ఏక మొత్తంగా ఉపసంహరించడం అంటే అదేదో పిల్లలాట అని ట్రంప్‌ భావిస్తున్నట్టున్నారు. మరో వేపు యూరప్‌ సమాజం కూడా వచ్చే పదిహేనో తేదీ నుంచి అమెరికా మీద అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించింది. మే, డిసెంబర్‌ మాసాల్లో ఈ సుంకాలు మరింత పెరగొచ్చు. సుంకాల వివాదంవల్ల వివిధ దేశాల్లో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు కుదేలై పోతున్నాయి. దీర్ఘ కాలిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కూడా జనం తెగనమ్మేస్తున్నారు. ఇంత కాలం అవి చాలా భద్రమైనవి అనుకునే వారు. తాను ఎడాపెడా సుంకాలు విధిస్తున్నందు వల్ల చైనాతో సహా అన్ని దేశాలు తనతో కాళ్ల బేరానికి వస్తున్నట్టు ట్రంప్‌ చెప్తున్నారు. ఆ దేశాల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఆ దేశాలు దిగి రావడం తప్పదు అని ట్రంప్‌ అంటున్నారు. ట్రంప్‌ ఎంత దూకుడుగా ప్రవర్తిస్తున్నా ఆయన నిర్ణయాలు అమెరికా మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యూరప్‌ మార్కెట్ల పరిస్థితి అయితే ఘోరంగా దిగజారుతోంది. యూరప్‌ సమాజం మూడు విడతలుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించనుంది. ఇందులో మొదటి విడత సుంకాల విధింపు మంగళవారమే మొదలైంది. మే 15న రెండవ విడత, డిసెంబర్‌ ఒకటిన మూడవ విడత సుంకాలు విధించే అవకాశం ఉంది. యూరప్‌ దేశాల మీద ట్రంప్‌ మార్చిలోనే 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. యూరప్‌ దేశాలు వెంటనే స్పందించక పోవడానికి 27 దేశాలు కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అయితే ట్రంప్‌ దిగివచ్చి సంప్రదింపులకు అంగీకరిస్తే యూరప్‌ దేశాలు వెనక్కు తగ్గే అవకాశం కూడా ఉంది.
ట్రంప్‌ దూకుడును నిలవరించడానికి భారత్‌ కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చునన్న ఊహాగానాలు సాగుతున్నాయి కానీ నికరమైన చర్యలేవీ ఇప్పటిదాకా కనిపించలేదు. ట్రంప్‌ దూకుడు ప్రభావం భారత మార్కెట్ల మీద ప్రస్ఫుటంగానే కనిపిస్తోంది. భారత స్టాక్‌ మార్కెట్‌ అడ్డూ ఆపు లేకుండా పతనం అవుతోంది. మంగళవారం కాస్త పుంజుకున్నట్టు కనిపించినా పతనమయ్యే ధోరణి మాత్రం అలాగే మిగిలి ఉంది. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరై పోతోంది. ట్రంప్‌ ఆగడంవల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న భయం పీడిస్తోంది. మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారిలో తీవ్రమైన అభద్రతా భావం కనిపిస్తోంది. దీనివల్ల స్టాక్‌ మార్కెట్లలో అపూర్వమైన రీతిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది. సోమవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టాలు నమోదు చేయగా… తర్వాత ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. ఇదే కోవలో భారత స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్‌ మూడుశాతానికిపైగా నష్టపోయింది. సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు పదినెలల కనిష్ఠానికి చేరాయి. ముఖ్యంగా నిఫ్టీ 2020 మార్చి తర్వాత భారీగా పతనమైంది. మార్కెట్లో దాదాపు 559 షేర్లు పురోగమించగా 3,372 షేర్లు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి పెద్దగా గురికాని చైనా మార్కెట్లకూ నష్టాల సెగ తప్పలేదు. కార్పొరేట్‌ సంస్థల లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి మందగించే అవకాశాలున్నాయి. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రిజర్వు బ్యాంకు రెపో రేట్‌ 6 శాతానికి తగ్గించింది. గృహ నిర్మాణానికి, సొంత వినియోగానికి తీసుకునే రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. ఇంకో వేపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గాయి. వైపరీత్యం ఏమిటంటే మోదీ ప్రభుత్వం మాత్రం మునుపటి అలవాటు ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజేల్‌ ధరలు లీటర్‌కు రెండు రూపాయలు, వంట గ్యాస్‌ ధర యాభై రూపాయలు పెంచేసింది. ఔషధ కంపెనీల మీద ట్రంప్‌ కొత్తగా సుంకాలు విధించనప్పటికీ వాటి షేర్ల ధరలు కూడా 1.7 శాతం పడిపోయాయి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థలో లాఘవం బాగా ఉందని, దేశంలో గిరాకీ బాగా ఉన్నందువల్ల మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నష్టం ఏమీ లేదని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా భారత్‌ ఎదుర్కోగలదన్న ధీమా నిర్మలా సీతారామన్‌ మాటల్లో వ్యక్తం అయింది. ట్రంప్‌ ఆగడాన్ని ఎలా ఎదుర్కుంటారో ప్రధానమంత్రి మోదీ ఇప్పటిదాకా నోరు తెరచి చెప్పలేదు. అయితే అమెరికాకు మరిన్ని ఆపిల్‌ ఫోన్లు పంపిస్తారట. చైనా సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ అనుమతులు మనకు అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. అయినా ఇవి తాత్కాలిక చర్యలుగానే మిగిలి పోవచ్చు. ఆపిల్‌ సంస్థ ఫోన్లు తయారు చేయడానికి ఐ ఫోన్‌ విడిభాగాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడ్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు