వారానికి ఐదు పనిదినాల సాధనకు నిర్విరామ పోరు: యూఎఫ్‌బీయూ
విశాలాంధ్ర – హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగుల” వారానికి ఐదు రోజుల పని విధానం సాధించేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్ కోఠిలోని ఎస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో సమ్మె చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, శ్రీకాంత్ మిశ్రా (ఎలఐసీ), ఏఐబీఈఏ నేతలు రవీంద్రనాథ్, సమద్ ఖాన్, శాండిల్య,తో పాటు ఎన్ ఫణికుమార్(ఎఐబీఓఏ), రాజ్ (ఎఐబీఓసీ), అర్జున్ (ఐఎన్‌బీఓసీ) వెంకట రామయ్య (బీఈఎఫఐ) పాల్గొన్నారు. యూఎఫ్‌బీయూ కన్వీనర్ అంజనేయ ప్రసాద్ అధ్వర్యంలో నిర్వహించిన సభలో రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదన్నారు. ఐదు రోజుల పని దినాల వల్ల ఉద్యోగుల పనితీరు, జీవన సమతుల్యత మెరుగవుతుందని తెలిపారు. 2015 నుంచి పెండింగ్ డిమాండ్ పరిష్కరించాలన్నారు. ఆర్ నాబార్డ్, సెబీ, ఎల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పనివిధానం అమలవుతోందని గుర్తుచేశారు. బ్యాంకుల్లోనూ ఈ విధానం అమలునకు ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు శని, ఆదివారాలు సెలవన్నారు. బ్యాంకు ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి మద్దతుతో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలన్నారు. వెంకటరామయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు… రూ.400 లక్షల కోట్ల లావాదేవీలు జరుపుతున్నారని, బ్యాంకుల్లో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గత సంవత్సర కాలంలో నలుగురు ఉన్నత స్థాయి ఉద్యోగులు పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డార న్నారు. 90 శాతం బ్యాంకింగ్ లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయన్నారు. ప్రతి రెండో శనివారం, నాల్గో శనివారం సెలవు ఉండటంతో, మిగిలిన శనివారాలు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఆరు నెలల్లోనే ఐదు రోజుల పని విధానం అమలు చేస్తామన్నారు, రెండేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కష్ణబాబు, ఉదయ్ భాస్కర్, అజయ్ నల్లపరెడ్డి పాల్గొన్నారు.


