Homeజాతీయంనిందితుల ఆస్తులు వేలం వేయరాదా?

నిందితుల ఆస్తులు వేలం వేయరాదా?

- Advertisement -

న్యూదిల్లీ: యాసిడ్ దాడుల కేసుల్లో నిందితుల ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం బాధితులకు ఇస్తున్న పరిహారం (రూ.3 లక్షలు) అక్కరకు రాదని పేర్కొంది. మెరుగైన చర్యలు అవసరమని సూచించింది. ఇలాంటి నేరాలను నివారించేందుకు అసాధారణ శిక్షలు విధించాలని, చట్టంలో మార్పులు చేయాలని యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ పిల్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతత్వ ధర్మాసనం ఈ మేరకు సూచించింది. బలవంతంగా యాసిడ్ తాగించిన ఘటనల్లో బాధితులకు తగిన పరిహారం, వైద్య సంరక్షణ సహా ఇతర ఉపశమనాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు మాలిక్ విన్నవించారు. తన కేసులో 16 ఏళ్లు పోరాడినా న్యాయం లభించదని, నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయపోరాటంలోనే తన జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోయానని వాపోయారు. హైకోర్టులోని మంచి న్యాయవాది… బాధితురాలి తరపున ఈ కేసును వాదించేలా సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని సీజేఐ హామీ ఇచ్చారు. ఏడాది వారీగా యాసిడ్ దాడుల కేసులు, కోర్టుల్లో వాటి ప్రస్తుత స్థితి, బాధితుల కోసం పునరావాస కార్యక్రమాల వివరాలు అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. బలవంతంగా యాసిడ్ తాగించిన కేసుల వివరాలు ఇవ్వాలన్నారు. బాధితుల విద్యార్హత, ఉద్యోగం, వైవాహిక జీవితం, వైద్యం, వైద్య ఖర్చుల వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు