Homeవిశ్లేషణస్వార్థం గుప్పిట్లో రాజకీయం

స్వార్థం గుప్పిట్లో రాజకీయం

- Advertisement -

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

సైద్ధాంతిక మూలాల్లోంచి ఉద్భవించని రాజకీయాలు భౌతికవాద దృక్పధంతో, చారిత్రక దృష్టితో, హేతుబద్ధంగా ఆలోచించలేవు అనేది నేటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తే ఇట్టే పసిగట్టవచ్చును. మాటల్లో మానవత్వాన్ని నిర్మిస్తామంటూ చేతల్లో ధ్వంసం చేస్తుంటారు. సమిష్టి అభివృద్ధికి శక్తియుక్తుల్ని వినియోగించడం విస్మరించి వ్యక్తి స్వార్థానికి ప్రాధాన్యత యిస్తుంటారు. నీచాతినీచమైన అపోహలకు, ఆగడాలకు, నిందాపూర్వక ప్రకటనలకు కారణభూతులై ఉంటారు. మానవ ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడానికి బదులు బద్దలుకొడుతూ మనిషితనానికే మచ్చ తెస్తుంటారు. పాలకపక్షం ప్రతిపక్షం ఎవరికి ఎవరు తీసిపోని విధంగా జనాన్ని అర్ధరహిత అపోహల్లోకి లాగి అంధుల్ని చేస్తుంటారు. పాలకపక్షం కుర్చీ ఎక్కిందే చాలన్నట్లు, పాలకపగ్గాలు చేపట్టింది మొదలుకొని కుర్చీ దిగే వరకు వ్యక్తిగత దోపిడితో ధనార్జనే దాహంగా మసలుతుంటారు. పాలకపక్షం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షం పాలకపక్షాన్ని నిరూపణ చూపలేని నిందలతో ఓటిచ్చి ఎన్నుకున్న ఓటర్ల కళ్లు కప్పడానికి యత్నిస్తుంటారు. పాలకవర్గాలు శ్రమజీవన సౌందర్యానికి, ఆనందానికి తిలోదకాలిస్తూ కత్రిమ హామీలిస్తూ, వాగ్దానాల ఒడిలో సొమ్మసిల్లుతుంటారు. ప్రతిపక్షం వారి గతాన్ని చారిత్రిక సత్యంగా నమ్మించే జిమ్మిక్కులు చేస్తుంటారు. ఉభయపక్షాలు ప్రజా జీవన విధానాల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన విషయాలను గూర్చి చర్చించరు. శాసనసభ కాలమంతా గాలిమాటలతో గందరగోళంగా ముగుస్తుంది. అభివద్ధి గమ్యం దాక నడకసాగదు. జనం బతుకులు మలిగే దివ్వెల్లా చీకట్లో సతమతమౌతుంటాయ్. నేడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం మూగ, బధిర ముచ్చట్లుగా సాగిపోతుంది. ఇదే అభివృద్ధి అనుకుంటూ జనం గాని, మీడియా ద్వారా గాని ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ బతికిపోతున్నారు. రాజకీయ నాయకుల వికృత చేష్టలకు చేయూతినిస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు పొద్దుపుచ్చుతుంటారు. పాలకపక్షం గాని ప్రతిపక్షం గాని తమను తాము సమర్థించుకుంటూ, చేసిన తప్పుడుతనాన్ని పక్కవారి మీదకు నెట్టడానికి యత్నిస్తుంటారు. విషతుల్యమైన భావాలను అమృతవాక్కులుగా నమ్మించ యత్నిస్తుంటారు. గరీబీ హఠావో నినాదంతో ప్రగతిరథ చక్రాల్ని పరుగులెత్తించిన దాఖలాలు కనిపించవు. స్వార్థం గుప్పెట్లో రాజకీయం అసత్యాల్ని ఆశ్రయిస్తుంది. రాజకీయ పార్టీల స్వార్ధానికి తిరుమల తిరుపతి వెంకన్నను కూడా వాడుకోవడం చూస్తున్నాం. లడ్డూల్లో కల్తీ నెయ్యితో లేచిన దుమారం 2029 ఎన్నికల దాకా కొనసాగేట్టు వుంది. తెల్లవారి పాలనలో సిపాయిల తిరుగుబాటుకు కారణం తుపాకీì తూటాల్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందనేది ప్రముఖంగా చెప్పుకునేవారు. మన రాజకీయ నాయకులు చరిత్ర బాగా చదువుకున్నారు గనుక ఆనాటి తిరుగుబాటుకు కారణం తూటాల్లో పందికొవ్వు ఆవు కొవ్వు కలవడం అనే నిందారోపణను సిపాయిలు నమ్మి తిరుగుబాటు చేశారు. అదే సాకును రాజకీయాల్లో నమ్మించి గత ప్రభుత్వం మీద శాశ్వత అసమ్మతిని క్యాష్ చేసుకోవాలనే కుతూహలం కావచ్చు. అసత్యాలను వండి వార్చడం దాన్ని సత్యంగా నిరూపించేందుకు మరెన్నో కుట్రలు, కుతంత్రాల పన్నాగాలతో పరిపాలన యంత్రాంగాన్ని పక్కదారి పట్టించడం చూస్తుంటే సిద్దాంతరహిత రాజకీయాలకు పట్టిన దుర్గతి ఈలాగే వుంటుందేమోననిపిస్తుంది. రాజకీయానికి ఉండాల్సిన ఎథిక్స్ నానాటికి ఎందుకు ‘ఎక్స్‌టెర్మినేట’ అయిపోతున్నాయోనని ఆలోచిస్తే ధనపిపాసగా మారుతున్న రాజకీయ నాయకత్వం, అన్నిరకాల మీడియాను గుప్పెట్లో పెట్టుకొని, దోపిడి విధానమే ద్యేయంగా విశృంఖలమైన విడ్డూరపు పోకళ్లు పోవడమేననిపిస్తుంది.
ప్రభుత్వం పనిగట్టుకొని ప్రభుత్వ భూముల్ని పాలకుల ‘బినామీ’లకు ‘నామినల్ రేటు’కు కట్టబెట్టడం జనం కళ్లుగప్పే దోపిడీ విధానం కాదా ? కాలం మారే కొలది పాలకుల దోపిడీతత్త్వం కూడా అతి తెలివిగా సరికొత్త కోణంలో వికసిస్తుంది. పాలకుల దోపిడీతనపు ఆంతర్యం ప్రజలకు అంతుబట్టేలోపు ప్రభుత్వాలు మారిపోతున్నాయి. సైద్ధాంతికపరమైన రాజకీయ అవగాహన ప్రజల్లో కొరవడినందునే ఓట్ల రాజకీయం, నోట్ల కట్టల మెరుపుల కారణంగా చలామణి అవుతుంది. ఇసుమంత రాజకీయ అవగాహన లేని సినిమా సెలబ్రిటీస్ వారి డబ్బు కారణంగా అయితేనేమి స్టార్ వ్యాల్యూస్ కారణంగా అయితేనేమి రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ అవగాహన దక్షతతో వారు రాజకీయాల్లో రాణించుటలేదు. విజ్ఞానం, సత్సాంగత్యం, దుస్సాంగత్యం రెండూ సమాజంలో పోటాపోటీగా తిరుగుతూనే వుంటాయ్. మనిషి దేని వెంట నడవాలో తనదైన విజ్ఞతతో తెలుసుకోవాలి. నేడు యువతను తప్పుదారి పట్టించేది దుస్సాంగత్యం. వీరిలో అజ్ఞానం, మూర్ఖత్వం డామినేటెడ్ క్యారక్టర్స్‌గా వుంటాయి. అజ్ఞానం తొలగాలంటే విజ్ఞానం వెలుగులు విస్తరించాలి. రాజకీయం విజ్ఞానదాయకంగా ఉండాలి. నిస్వార్ధానికి నిలువెత్తు రూపంగా మారాలి. అప్పుడే సమాజం అన్ని రకాల వివక్షను విడనాడి విజ్ఞానదాయకంగా వెలిగిపోతుంటూంది. సెల్ : 9948774243

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు