బొల్లిముంత సాంబశివరావు
భారత-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం పై మోదీ-ట్రంప్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం చారిత్రక ప్రాధాన్యత కలిగిందని ఇద్దరు ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులపై సుంకం 50 శాతం నుంచి 18శాతం తగ్గుతుందని, భారతదేశం పెద్దఎత్తున అమెరికాకు ఎగుమతులు చేసి ఆర్థిక ప్రయోజనం పొందుతుందని ప్రధాని ప్రకటించాడు. అమెరికా ఎగుమతుల పై గణనీయంగా సుంకం తగ్గటమే కాకుండా అనేక వస్తువుల పై జీరో సుంకం అమల్లో ఉంటుంది. ట్రంప్‌ను ఆప్తమిత్రునిగా మోదీ పేర్కొన్నాడు. ఈ ఒప్పందం వల్ల రైతాంగానికి తీవ్రనష్టం జరుగుతుందనే విమర్శలపై నష్టం జరగకుండా చూస్తామని ప్రధాని చెబుతున్నారు. ఎలా అన్నది మాత్రం చెప్పడం లేదు. బలవంతుడు, బలహీనుడు, బడా పెట్టుబడిదారీ దేశం- వెనుకబడిన దేశం మధ్య జరిగే ఏ ఒప్పందం అయినా ఎవరికి ప్రయోజనకరం అన్నది తెలిసిందే. ఒప్పందం సందర్బంగా ట్రంప్ మాటలే అందుకు నిదర్శనం. ఒక స్వతంత్ర దేశం, ఏ దేశం నుంచి ఏది దిగుమతి చేసుకోవాలన్నది, ఏది ఎగుమతి చేయాలన్నది నిర్ణయించుకుంటుంది. ఒప్పందం జరిగిన వెంటనే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విరమించుకుంటుందని, భారత్‌కు అమెరికా చమురు కొనుగోలు చేస్తుందని, వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ ప్రకటించాడు. మోదీ ప్రభుత్వం అందుకు ఆమోదించిందని ట్రంప్ చెప్పడమే కాకుండా, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే సుంకం విధిస్తానని మోదీ ప్రభుత్వాన్ని బెదిరించాడు. దీన్ని గమనిస్తే మోదీ ప్రభుత్వంపై ట్రంప్ ఆధిపత్యం అర్ధమౌతుంది. వెనిజులా ఒక స్వతంత్ర దేశం. ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని, మోదీ అందుకు ఆమోదం చెప్పడం, ఆ దేశ స్వాతంత్య్రాన్ని,సార్వభౌమత్వాన్ని ఆమోదించక పోవడం, ఆ దేశం పై అమెరికా దాడిని, దాని పెత్తనాన్ని ఆమోదించడమే. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వ లొంగుబాటుకు ఇది నిదర్శనం. వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై సుంకాలను దాదాపు సున్నాకి తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ సెక్రటరీ కరోలినా లెవిట్ పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పారిశ్రామిక ఉత్పత్తుల పైనా, ఆý్కహాల్, పండ్లు, కూరగాయలతో సహా 98 అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకం 13.5 శాతం నుంచి సున్నా శాతంగా ఉంటుంది. దీని ఫలితంగా దేశీయ పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం భారత వ్యవసాయ ఉత్పత్తులకు, రైతాంగ ప్రయోజనాలకు రక్షణ చర్యలు ఉంటాయని చెప్పడం వాస్తవ విరుద్దంగా ఉంది. అమెరికా ప్రభుత్వం, పంటల బీమా, మద్దతు ధర, వాణిజ్య యుద్ధాల వల్ల కలిగే నష్టాలకు, పంటల నష్టాల భర్తీకి బిలియన్ల డాలర్ల సబ్సిడీని తన రైతులకు అందిస్తున్నది. నేడు సుంకాల వాణిజ్య యుద్ధంలో నష్టపోతున్న వివిధ పంటల రైతులకు 82 వేల కోట్ల డాలర్లను సహాయంగా అందించింది. మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమ, వరి పండించే రైతులకు ఎక్కువగా సబ్సిడీలు అందుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన రైతులకు ప్రతి సంవత్సరం సుమారు 25 బిలియన్ డాలర్ల సబ్సిడీలు అందిస్తున్నది. 2018లో ప్రతి రైతుకు అమెరికా 50 వేల డాలర్లు సబ్సిడీ ఇవ్వగా, భారత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 200 డాలర్లు మాత్రమే. 2025లో అమెరికా రైతులు 61 వేల డాలర్లు పొందగా, భారత రైతులు మాత్రం 282 డాలర్లు మాత్రమే పొందారు. బహిరంగ మార్కెట్లో పంటల ధరలు తగ్గినప్పుడు రైతులు నష్టపోకుండా అమెరికా ప్రభుత్వమే పంటలు కొనుగోళ్లు చేస్తుంది. పంటలకు నష్టం జరిగినప్పుడు, ఆ నష్టాన్ని ప్రభుత్వం ఇస్తుంది. భారత్‌లో రైతుల పరిస్థితి అందుకు విరుద్దం. మద్దతు ధరలు రైతాంగానికి ఊరట ఇవ్వదు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు పంటలు కొనుగోళ్ల బాధ్యత ప్రభుత్వం తీసుకోదు. పంట నష్టపరిహారం కూడా సరిగా చెల్లించదు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2026లో అమెరికా వ్యవసాయ ఎగుమతులు భారత్‌లో కూడా పెరుగుతాయని, అమెరికా ఇచ్చే సబ్సిడీలు, ఆ దేశ రైతులకు ఎగుమతుల్లో ప్రయోజనాన్ని ఇస్తున్నాయని అనేక నివేదికలు చెప్తున్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల పై సుంకం తగ్గిస్తే భారత రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వ్యవసాయ సంక్షోభం పెరగటంతో పాటు రైతుల బలవన్మరణాలు తీవ్రమౌతాయి. భారత రైతాంగానికి నష్టం కలుగజేసే ఈ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ దిగుమతులపై సుంకాన్ని పెంచాలని, దిగుమతులు తగ్గించాలని, మద్దతు ధర పెంచి, వాటికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని రైతాంగం డిమాండ్ చేయాలి. రైతు కూలీ సంఘం (ఆం.ప్ర)
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సెల్ : 9885982526


