రామకృష్ణ సూర్యదేవర
మణిపూర్… ఈ పేరు వినగానే గత రెండేళ్లుగా భారతావనిని ఉలిక్కిపడేలా చేసిన హింసాకాండ, కాలిపోయిన గ్రామాలు, వేలాది మంది నిరాశ్రయుల కన్నీళ్లే గుర్తొస్తాయి. 2023 మే నెలలో మొదలైన జాతి వైషమ్యాలను అదుపు చేయలేక, అప్పటి డబుల్ ఇంజిన్ సర్కార్ (బీరెన్ సింగ్ ప్రభుత్వం) చేతులెత్తేయడంతో 2025 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. సరిగ్గా ఏడాది తర్వాత, 2026 ఫిబ్రవరి 4న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఈ మార్పు ప్రజల ఆశల కోసమా ? లేక బీజేపీ పతనాన్ని అడ్డుకోవడానికా ? మణిపూర్ అల్లర్లలో 260 మందికి పైగా మరణించడం, 60,000 మంది నిరాశ్రయులు కావడం అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హయాంలో పక్షపాత ధోరణి ఉందనే ఆరోపణలు, ఆయన రాజీనామాకు దారితీశాయి. ఇప్పుడు ఖేమ్‌చంద్ సింగ్‌ను తెరపైకి తేవడం ద్వారా బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు “అమిత్ షా సన్నిహితుడు” అని చెప్పుకున్న బీరెన్ సింగ్‌ను పక్కన పెట్టడం ద్వారా, పాత తప్పుల బాధ్యతను ఒక వ్యక్తి పైకి నెట్టి, పార్టీ క్లీన్ చిట్ పొందాలని చూస్తోంది. మణిపూర్‌లో ప్రజాస్వామ్యంపై ప్రేమ కంటే, రాష్ట్రపతి పాలనను ఏడాది దాటి పొడిగించాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి రావడం బీజేపీకి పెద్ద సమస్యగా మారింది. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఏదో ఒక రకంగా రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మళ్లీ కూర్చోబెట్టాలనే తొందర కేంద్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పూర్తిస్థాయి శాంతి నెలకొనక ముందే ఈ హడావుడి ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కొత్త ప్రభుత్వంలో నెమ్చా కిప్జెన్ŽŽ (కుకీ-జో వర్గం), లోసియి డిఖో (నాగా వర్గం)లను ఉపముఖ్యమంత్రులుగా నియమించడం కేవలం ఒక రాజకీయ ప్రలోభంగానే కనిపిస్తోంది.
కఠిన వాస్తవం : కుకీ వర్గానికి చెందిన నెమ్చా కిప్జెన్Ž ఇంఫాల్‌కు వచ్చి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆమె వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తన రాజధానికి తాను రాలేని పరిస్థితిలో ఒక మంత్రి ఉన్నారంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో విభజన ఇంకా ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. కుకీ-జో వర్గాలు డిమాండ్ చేస్తున్న ‘ప్రత్యేక పరిపాలన’ లేదా కేంద్రపాలిత ప్రాంతం హోదాపై కొత్త ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం మంత్రి పదవులు పంచడం ద్వారా జాతి వైషమ్యాలు తగ్గిపోతాయని భావించడం అపరిపక్వతే అవుతుంది. కుకీ గ్రూపులు (ఐటీఎలఎఫ్) ఇప్పటికే ఈ కొత్త ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ప్రకటించడం ఆందోళనకరం. బీజేపీ ప్రభుత్వ హయాంలో మణిపూర్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. డ్రగ్స్ మాఫియా, మయన్మార్ సరిహద్దు అక్రమ రవాణా, ఆయుధాల లూటీ వంటి అంశాలను అదుపు చేయడంలో కేంద్ర నిఘావర్గాలు విఫలమయ్యాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఈ దశాబ్దాల నాటి సమస్యలు రాత్రికి రాత్రే మాయమైపోవు. ఖేమ్‌చంద్ సింగ్ ఒక సీనియర్ నాయకుడే కావచ్చు, కానీ ఆయన వెనుక ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం మణిపూర్‌ను ప్రయోగశాలగా మార్చకూడదు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న 60,000 మంది ప్రజలు తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్తారు ? పోయిన ప్రాణాలకు జవాబుదారీ ఎవరు ? ఇరువర్గాల మధ్య పెరిగిన ద్వేషాన్ని తగ్గించే గట్టి కార్యాచరణ ఏది ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత కాలం, మణిపూర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది కేవలం రాజ్‌భవన్ గోడలకే పరిమితమవుతుంది. శాంతి అనేది పదవులతో వచ్చేది కాదు, అది ప్రజల మధ్య ఉండే నమ్మకం నుంచి వస్తుంది. ఆ నమ్మకాన్ని బీజేపీ ప్రభుత్వం మళ్లీ సంపాదించగలదా అనేది కాలమే నిర్ణయించాలి.
సెల్ : 9490754269


