. మద్యం కేసులో వరుణ్‌కుమార్ అరెస్టు
. వేగం పెంచిన సిట్
. అక్రమాలు వెలుగులోకి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: మద్యం కుంభకోణం కేసులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల పేరుతో అనేక దందాలు, అక్రమాలు సాగాయన్న ఆరోపణలు హల్‌చల్ చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేయడంతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషోత్తం వరుణ్‌కుమార్‌ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిట్ పోలీసులు అరెస్టు చేయడం కీలక పరిణామం చోటు చేసుకుంది. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్ తదితరులు కలిసి 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్లు అంగీకరించారు. శంషాబాద్ మండలం కాచారం ఫామ్ హౌస్‌లో సిట్ దాడులకు పాల్పడటంతో అట్టపెట్టెల్లో రూ.11వేల కోట్ల సొమ్ము బట్టబయలైంది. దానిని సీజ్ చేసి… విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. ఈ భారీ స్థాయిలో డబ్బు పట్టుబడటం వైసీపీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టయి… రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ సిట్ లీకులిచ్చింది. దీనిపై వైసీపీ ఆధిష్టానం అప్రమత్తమైంది. వైసీపీ పీఏసీ సమావేశం రాజకీయ ఎత్తుగడలో భాగమనే వాదనలున్నాయి. ఇంతలోనే ఏ-40గా ఉన్న పురుషోత్తం వరుణ్ కుమార్‌ను సిట్ పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత తీవ్రతరమైంది. మద్యం కుంభకోణం కేసు నమోదైన తర్వాత ఈ కేసులో కీలక వ్యక్తులు… వరుణ్‌ను దేశం దాటించేసినట్లు సమాచారం. అప్పటి నుంచి విదేశాల్లో ఉంటున్న వరుణ్‌కుమార్‌పై లుకౌట్ నోటీసుతోపాటు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. అతడి నుంచి అనేక కోణాల్లో వివరాలు రాబట్టేందుకు సిట్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వరుణ్ కుమార్ ప్రవేశం ఇలా…
సికింద్రాబాద్‌కు చెందిన వరుణ్‌కుమార్ ఇంజినీరింగ్ చదివాడు. హైదరాబాద్‌లో ఓ కాఫీ షాపులో నెలకు రూ.32వేల వేతనంతో పని చేశాడు. ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజ్ కేసీిరెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి వరుణ్‌ను దించినట్లు సమాచారం. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్‌ను ఏపీ ఆపరేషన్స్ అధిపతిగా నియమించి, అతడి పేరిట రూ.వందల కోట్లు కొల్లగొట్టింది. 2020 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో బెవరేజెస్ కార్పొరేషన్ ఈ సంస్థ ఖాతాలో ఏకంగా రూ.459 కోట్లు జమ చేసింది. ఈ వ్యాపార పరిమాణం అసాధారంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బంతా వెంటవెంటనే వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిపోయిందని, వాటిని విశ్లేషించిన సిట్ అధికారులు -అందులో అత్యధిక శాతం కల్పిత కంపెనీలతో నిర్వహించిన లావాదేవీలుగా గుర్తించినట్లు సమాచారం. వరుణ్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చారు. విదేశాల నుంచి వచ్చిన వరుణ్‌కుమార్‌ను సిట్ తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లీలా డిస్టరీస్ ద్వారా రూ.453.97 కోట్ల వరకు మద్యం కొనుగోళ్లకు జమ కాగా రూ.62 కోట్ల వరకు ముడుపులుగా వెనక్కి వచ్చాయని సిట్ తమ తొలి ఛార్జిషీటులో ప్రస్తావించింది. ఎస్‌ఎన్‌జే షుగర్స్ అనుబంధ సంస్థ ఈ లీలా డిస్టరీస్. లీలాస్ బ్రిలియెంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, బ్రిటీష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యుర్డ్ బ్రాండ్లు ఇక్కడ తయారు చేయించారు. దర్యాప్తులో ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు వరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. తమిళనాడులోని ఎస్‌ఎన్‌జే షుగర్స్, ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లను రాజ్ కేసీరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థ అయిన లీలా డిస్టిలరీస్‌ను ఆధీనంలోకి తీసుకుని, లీలా డిస్టిలరీస్‌తో ఆథరైజేషన్ ఇప్పించి వరుణ్ కుమార్‌ను ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించారు. అతడి పేరిట బ్యాంకు ఖాతా తెరిపించి, రూ.10 కోట్ల వరకు చెక్ పవర్ కల్పించారు. సొంతంగా మద్యం తయారు చేసే కనీస మౌలిక సదుపాయాలు లేని లీలా డిస్టిలరీస్‌కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు.
ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు: కోర్టులో కేసీరెడ్డి అఫిడవిట్
సిట్ అధికారులు సీజ్ చేసిన రూ.11కోట్లతో తనకు సంబంధం లేదని, ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కేసీరెడ్డి తెలిపారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్ తనది కాదని, అది తీగల విజయేందర్‌రెడ్డిదని తెలిపారు. ఆయనకు ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని, రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారన్నారు. విజయేందర్‌రెడ్డి నిర్వహిస్తున్న ఆరెట్ ఆసుపత్రిలో నా భార్య మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమేనని, సిట్ కట్టుకథలు చెబుతూ, తనకు బెయిల్ రాకుండా చేస్తోందని కేసీరెడ్డి తెలిపారు.


