. పీ4 విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేకత
. బలవంతపు నమోదు బహిష్కరించిన ఫ్యాప్టో
. వెనక్కి తగ్గిన చంద్రబాబు ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ‘... ఆ దత్తత మాకొద్దు బాబోయ్... మాకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా... కొత్తగా పీ4తో నూతన విధానాలు తెచ్చి...మా నెత్తిన పెట్టొద్దు’ అంటూ ఉపాధ్యాయుల తిరుగుబావుటాతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలిసింది. పీ4తో బలవంతంపు దత్తత విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత మొదలవ్వడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిరది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పబ్లిక్-ప్రైవేట్-పీపుల్‌పార్టనర్‌షిప్ (పీ4) పథకం వివాదానికి దారితీస్తోంది. ఇటీవల ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి తక్షణమే నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్న ఆదేశాలతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో అలజడి మొదలైంది. ఆ నమోదును బహిష్కరిస్తునట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు బలవంతంపు దత్తత అంశం ఉండబోదని, ఆసక్తి ఉన్న వారికే దత్తత అవకాశం ఇస్తామనే ఆలోచనతో ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన రూ.25 వేల కోట్ల ఆర్థిక బకాయిలను అమలు చేయకుండా, వాటిని పక్కదారి పట్టించే ప్రక్రియలో భాగంగానే వారితో దత్తత అంశం తెరపైకి తెచ్చారన్న విమర్శలు హల్‌చల్ చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన పీ4 పథకం లక్ష్యం…సమాజంలో ధనికులు బంగారు కుటుంబాలుగా అభివృద్ధి చెందాల్సిన పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారిని నైతికంగా, ఆర్థికంగా మద్దతివ్వాలనే వినూత్న ఆలోచన. పథకం లక్ష్యం మంచిదే…అయినా అమలే ప్రశ్నార్థకం. పీ4 పథకం ఆవిష్కరణ సమయంలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ధనిక వర్గాలు పేద వర్గాలను దత్తత తీసుకుని మార్గదర్శకులుగా ఉండాలన్న ఈ ఆలోచన సానుకూలంగా ఉన్నప్పటికీ, దీని అమలు తీరుపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులపై ఈ పథకం అమలులో భాగంగా దత్తత తీసుకోవాలని ప్రభుత్వం మౌనంగా ఒత్తిడి తెస్తుండటం వివాదస్పదంగా మారింది. ఇది తమపై భారం మోపడమేనని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బలవంతమేమీ లేదంటూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధి కుటుంబరావు మాట్లాడుతూ… పీ4 పథకం పూర్తిగా స్వచ్ఛందమైనదని, ఇందులో ఎటువంటి నిర్బంధం ఉండబోదని, సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారు పేద కుటుంబాలకు మద్దతుగా నిలబడేలా చేస్తుందని, ఇది అసమానతలను తగ్గించడానికి ఉపకరిస్తుందని పేర్కొనడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయులకు దత్తత అంశంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు తెలిసింది. బలవంతం లేనప్పుడు అధికారుల ద్వారా ఒత్తిళ్లు చేయించడమేమిటని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిలదీయడంతోనే మెత్తపడినట్లు సమాచారం.
చంద్రబాబు ప్రభుత్వానికి పరీక్షే!
ఈ పథకం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకతను ఎదుర్కొంటూ ప్రజల్లో సందేహాలు తొలగించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు, హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిరది. పీ-4 విధానంలో భాగంగా ప్రతి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఖచ్చితంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని, ఆ కుటుంబాలను బంగారు కుటుంబాల పేరుతో వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఆ దిశగా ఇటీవల ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి తక్షణమే నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించడం…వెరసి ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది. దత్తత తీసుకునే అంశం ఐచ్చికంగా ఉండాలేగానీ, నిర్బంధం చేయడం తగదని ఉద్యోగ సంఘాలు సూచించాయి. నిర్బంధ నమోదు ప్రక్రియ బహిష్కరిస్తున్నట్లుగా ఫ్యాప్టో తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిరది. పీ-4 కార్యక్రమం అనేది ఆర్థికంగా శ్రీమంతులైన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారమని, మధ్యతరగతి శ్రేణిలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేరే కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి ఉండదనే నిజం ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలని ఉపాధ్యాయ వర్గాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఐచ్చికంగా దత్తత తీసుకుంటే స్వాగతిస్తామని, ఆ విషయం అంతవరకే పరిమితం కావాలని వారు అభిప్రాయపడుతున్నారు. పీ4లోకి మంత్రులను, ఎమ్మెల్యేలను, కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులను ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నిస్తున్నాయి.
పీఆర్సీ, డీఏ బకాయిలు ఏవీ?
డీఏ, పీఆర్సీ తదితర బకాయిలను ఇవ్వకుండా మళ్లీ ఉద్యోగ, ఉపాధ్యాయులపై అదనపు భారం వేయాడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో బోధించే పరిస్థితులు లేవు. ఉపాధ్యాయ వర్గం ఇప్పటికే బోధనేతర పనులతో సతమతం అవుతోంది. బోధనకు దూరమవుతున్న పరిస్థితులలో యాప్‌లతో 70 రకాలకు పైగా సేవలు చేస్తున్నారు. దానివల్ల వారు తీవ్రంగా నలిగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.24వేల కోట్ల ఆర్థిక బకాయిలు పేరుకుపోగా…చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అందులో రూ.7,200 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో పెరిగి… అవి కాస్తా రూ.25వేల కోట్లకు చేరాయి. అందులో ఉద్యోగ, ఉపాధ్యాయుల సరెండర్ లీవులు, పీఎఫ్ రుణాలు, పదవీ విరమణ ప్రయోజనాల సొమ్ము, మెడికల్ రీయింబర్స్‌మెంట్, డీఏలు, 11వ పీఆర్సీ అరియర్లు, ఏపీజీఎల్‌ఐ సొమ్ము తదితరులున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా ఆర్థికపరమైన సొమ్ము ఇవ్వకుండా, వారితో అదనపు బోధనేతర పనుల్ని చేయించడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల పెండిరగ్ ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.


