Home124 నాటౌట్‌

124 నాటౌట్‌

- Advertisement -

. మన ఓటు, మన హక్కు, మన పోరు
. పార్లమెంటు వద్ద మార్మోగిన నినాదం
. ఎస్‌ఐఆర్‌`నిశ్శబ్ద రిగ్గింగ్‌ బ్యానర్లు, ప్లకార్డులు
. మింతా దేవి టీషర్టులతో ‘ఇండియా’ నిరసన
. ఓట్ల చోరీపై 15వ రోజు ఎంపీల ఆందోళన
. ఈసీపై పోరు ఆగదని ప్రతిపక్షాల స్పష్టీకరణ

న్యూదిల్లీ : ఇండియా ఐక్య సంఘటన ఎంపీల నిరసనలతో పార్లమెంటు ఆవరణ దద్దరిల్లింది. ఎన్నికల సంఘంపై సమరంలో భాగంగా బీహార్‌ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన మంగళవారం (15వరోజు) కొనసాగింది. ఓటర్‌ జాబితాల్లో అవకతవకలను ఎండగట్టే విధంగా ‘124 ఏళ్ల ఓటరు’ పేరిట టీషర్టులు ధరించి ‘ఇండియా’ ఎంపీలు పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌ వద్ద నిరసన తెలిపారు. ‘మింతా దేవి 124 నాటౌట్‌’ నినాదాలతో ఆ ప్రాంగణాన్ని మార్మోగించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ ఎంపీ సంతోశ్‌ కుమార్‌ సహా వామపక్షాలతో పాటు ఇతర భాగస్వామ్య పార్టీల నాయకులు మకర ద్వారం వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ రద్దు కోసం డిమాండ్‌ చేస్తూ పోస్టులు ప్రదర్శించారు. ఈసీకి వ్యతిరేకింగా నినాదాలిచ్చారు. ‘మన ఓటు, మన హక్కు, మన పోరు’, ‘ఎస్‌ఐఆర్‌`సైలెంట్‌ ఇన్‌విన్సిబిల్‌ రిగ్గింగ్‌ (నిశ్శబ్ద రిగ్గింగ్‌)’ అన్న బ్యానర్లతో ఎంపీలు నిరసన తెలిపారు. ‘ఎస్‌ఐఆర్‌ ఆపండి,’ ‘ఓట్‌ చోరి’ అని రాసిన ప్లకార్డులు, ఎన్నికల సంఘం, కేంద్రం కుమ్మక్కైనట్లు ఆరోపించే పోస్టర్లు ప్రదర్శించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చ కోసం వారు ఐక్యంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కారణంగా లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కాగా, పార్లమెంటు వద్ద నిరసన సందర్భంగా విలేకరుల ప్రశ్నకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ స్పందిస్తూ ‘పిక్చర్‌ అభి బాకీ హై’ (ఇది ముగింపు కాదు) అని అన్నారు. రాజీవ్‌ కుమార్‌, జ్ఞానేశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్నికల సంఘం బీజేపీ శాఖగా మారిపోయిందని కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాకూర్‌ ఆరోపించారు. ‘ఓటర్ల జాబితాలో మొదటిసారి ఓటు వేసే వారిలో మింతా దేవి పేరు ఉంది. వాస్తవానికి ఆమె వయస్సు 124 ఏళ్లు. ఇలాంటి అంశాలపై చర్చను కోరుతున్నాం. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నది. ఓటర్ల జాబితా మోసాలభరితంగా ఉంది. ఇది పొరపాటు కాదు… మెగా ఓటర్‌ మోసానికి రుజువు’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల మోసాలు ఆగేంత వరకు ‘ఇండియా’ పోరాడుతుందని ఠాకూర్‌ అన్నారు. ‘ఎన్నికల సంఘం సృష్టించే అద్భుతాల సౌజన్యంతో దేశంలోనే యవ్వనంగా కనిపించే వృద్ధురాలిగా మింతా దేవి పేరును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం మేము గర్వంగా ప్రతిపాదిస్తున్నాం’ అంటూ కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’ మాధ్యమంగా వ్యంగాస్త్రం సంధించారు. ఎన్నికల సంఘం మానవాళికి గొప్ప సేవ చేసిందని, బీహార్‌ ఎస్‌ఐఆర్‌లో 124 ఏళ్లు ఉన్న వృద్ధురాలిని కనిపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం చేసిన మెగా ఓటర్‌ మోసాలను సాగనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఇదంతా ఆగేంత వరకు ఇండియా ఐక్య సంఘటన పోరాటం కొనసాగుతుందని వేణుగోపాల్‌ వెల్లడిరచారు. రాహుల్‌ గాంధీ ఇటీవల ఈసీ మోసాలపై వెల్లడిరచిన వివరాల ప్రకారం మింతా దేవి పేరు బీహార్‌లోని సివన్‌ లోక్‌సభ పరిధిలో దరౌంధా అసెంబ్లీ నియోజకవర్గంలో అర్జానిపూర్‌లోగల కన్యా ఉత్కామ్రిత్‌ మధ్య విద్యాలయలో కొత్త ఓటరుగా నమోదై ఉంది. ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేసిన తర్వాత ఈమె పేరు తెరపైకి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు