రేపటికల్లా తొలగించిన ఓటర్ల డేటా ఇవ్వండి
ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూదిల్లీ: బీహార్‌లో తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 3.66 లక్షల మంది ఓటర్ల వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 9 నాటికి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమల్యా బాగ్చీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీనిపై స్పందించిన ఈసీ, ఎస్‌ఐఆర్‌లో భాగంగా విడుదల చేసిన తుది జాబితాలో చాలా మంది కొత్త ఓటర్లు ఉన్నారని సుప్రీంకోర్టుకు చెప్పింది. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదు, అప్పీల్ రాలేదని కోర్టుకు తెలిపింది.
‘‘కోర్టు ఆదేశాలు ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకతను కల్పిస్తాయి. ముసాయిదాలో 65 లక్షల ఓట్లను తొలగించినట్లుగా కనిపిస్తోంది. ఎవరు చనిపోయినా, వలస వెళ్లినా తొలగించండి. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవరినైనా ఓటరుగా తొలగిస్తుంటే అందుకు సంబంధించిన రూల్`21 ప్రకారం అనుసరించండి. ఎవరినైనా తొలగిస్తే వారి వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో పెట్టాలని కూడా చెప్పాం. తాజాగా విడుదల చేసిన తుది జాబితాతో ముసాయిదాను పోల్చి చూస్తే ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. ఈ గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరాలను బహిర్గతం చేయండి.’’ అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్‌లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘‘ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వాటిని మరింత జటిలం చేసింది… పూర్తిగా పారదర్శకత లోపించింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే 65 లక్షల మంది తొలగించబడిన ఓటర్ల గురించి సమాచారం ఇవ్వబడిరది. నిబంధనల ప్రకారం వారు సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేదు’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు వాదించారు. ఈ క్రమంలో తుది జాబితా నుండి పేరు తొలగించబడిన ఏ వ్యక్తి అయినా కోర్టు జోక్యాన్ని కోరవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తదుపరి చట్టపరమైన చర్య తీసుకునే ముందు తమకు మరింత సమాచారం అవసరమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఎన్నికల సంఘం జూన్ 25న బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రకటించినప్పుడు మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లుండగా… 68.66 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియ తర్వాత విడుదల చేసిన తుది జాబితాలో కొత్తగా 21.53 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చగా… మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లకు చేరుకుంది. కాగా విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎన్నికలసంఘం తరపున హాజరైన న్యాయవాది రాకేశ్ ద్వివేది సమాధానమిస్తూ ఓటర్ల జాబితాలో చేర్చినవారిలో ఎక్కువ మంది కొత్తవారేనని ధర్మాసనానికి తెలియజేశారు. ‘‘65 లక్షల ఓటర్ల తొలగింపు జరిగింది. మీరు ఎవరినైనా తొలగించినట్లయితే దయచేసి వారి డేటాను మీ జిల్లా ఎన్నికల కార్యాలయాల్లో ఉంచమని మేము చెప్పాము. ఇప్పుడు మీకు తుది జాబితా వచ్చింది. తుది జాబితా సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోంది’’అని జస్టిస్ బాగ్చి అన్నారు. ‘‘ఇది 65 లక్షల నుండి పెరిగింది. ఇప్పుడు ఒక గందరగోళం ఉంది. ఈ చేరికలు ఎక్కడినుంచి వచ్చాయి? వీరు తొలగించబడినవారి నుంచి వచ్చారా? లేక కొత్త పేర్ల చేర్పింపా మాకు స్పష్టత అవసరం’’ అని బాగ్చీ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఈ కేసుపై సుప్రీకోర్టులో మళ్లీ విచారణ జరగనుంది.


