Home50 శాతం సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు!

50 శాతం సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు!

- Advertisement -

పాత బిల్లు ఆధారంగా కొత్త ముసాయిదా

న్యూఢిల్లీ:
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని… ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ ముసాయిదా రూపొందిస్తున్నారు. గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని ప్రభుత్వం సాధించలేకపోవడంతో ఏప్రిల్ 17న అది లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. పాత బిల్లు ఆధారంగానే రూపొందిస్తున్న ఈ కొత్త ముసాయిదాలో 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశీలిస్తున్న వివిధ ప్రతిపాదనలలో ఇది ఒకటి మాత్రమేనని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉన్నందున, 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరుగుతుంది. సంఖ్యాబలంపై పూర్తి విశ్వాసం కలిగిన తర్వాతే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అధికార ఎన్‌డీఏకి లోక్‌సభలో సుమారు 300 మంది ఎంపీలు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ మార్‌కు చేరుకోవడానికి అధికార పార్టీకి 360 ఓట్లు అవసరం. ప్రస్తుత చట్టం ప్రకారం మహిళలకు రిజర్వేషన్ల అమలు 2034కు ముందు సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రక్రియ 2027 జనాభా గణన తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ పూర్తి కావడంతో ముడిపడి ఉంది. దీనిని 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలంటే, ‘నారీ శక్తి వందన్ అధినియం’ లేదా మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు అవసరం. చివరిగా ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టి… 2029 పార్లమెంటరీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు, ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచనున్నారు ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టసభలలో కూడా స్థానాల సంఖ్య పెంచనున్నారు. లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు కేటాయించిన స్థానాలను ‘రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని బిల్లు పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు