ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి వైతొలగాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు . ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది. ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది. వైసీపీ హయాంలో పెద్దల అండదండలతో అనేక మంది ఫైబర్ నెట్‌లో జాయిన్ అయి తమ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. పీకల్లోతు అప్పులో కూరుకుపోవడంతో పాటు కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కూడా వారే ఇంకా ఉండటంతో పాటు సిబ్బంది కూడా వారే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ జమానా వారే ఉండటంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలు కూడా అమలు కాని పరిస్థితి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఇందులో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.5400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగగా దాదాపు రూ.500 కోట్లు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
మరోవైపు వైసీపీ హయాంలో నియమితులైన ఉద్యోగులు కార్యాలయం మొహమే చూడని పరిస్థితి. అంతే కాకుండా ఉద్యోగానికి రాకున్నప్పటికీ వారికి జీతాలు మాత్రం చెల్లించేవారు. ఈ విషయం కూడా విచారణలో బయటపడింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో నియమితులైన వారందరినీ పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగాలను తొలగించింది .