Thursday, May 8, 2025
Home71 సంస్థలు… 1,050 ఎకరాలు

71 సంస్థలు… 1,050 ఎకరాలు

రూ.1,732 కోట్లతో ఉద్యోగుల టవర్ల నిర్మాణం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతి కోర్‌ కేపిటల్‌ ఏరియాలో గజిటెడ్‌, నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగుల నివాసాల కోసం నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖమంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వివరించారు. రాజధాని అమరావతి కోర్‌ కేపిటల్‌ ఏరియాలో ఇప్పటి వరకూ మొత్తం 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 2014-19 మధ్య కాలంలో చేపట్టిన గజిటెడ్‌ అధికారుల టవర్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలపగా… నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగుల నివాసానికి తొమ్మిది టవర్ల నిర్మాణం కోసం రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు, మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన టెండర్లకు తాజాగా ఆమోదం తెలిపినట్లు వెల్లడిరచారు. 190 ఎంఎల్‌డీ సామర్థ్యంగల వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి, ఐదేళ్ల పాటు ఆపరేషన్‌ నిర్వహణకు రూ.560.57 కోట్ల విలువైన టెండర్లకు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి రూ.494.86 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం లభించింది. జాతీయ రహదారికి అనుసంధానమయ్యే ఇ-3, ఇ-13, ఇ-15 రోడ్ల నిర్మాణానికి, ఇ-3 సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో 1.5 కి.మీ మేర ఎలివేటెడ్‌ రోడ్ల నిర్మాణానికి, 4.10 కి.మీ ఇ-13 రోడ్డును రూ.384.78 కోట్లతో పొడిగించేందుకు, 3.98 కి.మీ. ఇ-15 రోడ్డును రూ.70 కోట్లతో పొడిగించేందుకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. న్యాయ విశ్వవిద్యాలయాలనికి 55 ఎకరాలు, క్వాంటమ్‌ వేలీకి 50 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు 0.78 ఎకరాలు, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయానికి 0.40 ఎకరాలు, ఐఆర్సీటీసీ హోటళ్లకు ఎకరం కేటాయించగా… బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు గతంలో కేటాయించిన 15 ఎకరాలకు తోడు వైద్య కళాశాల నిర్మాణానికి మరో 6 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు