ఎకరా 99 పైసలకే అమ్మడం ఆక్షేపణీయం: సీపీఐ నేత రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల విలువచేసే భూమిని కేటాయించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. కేవలం రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉత్తుత్తి కంపెనీగా రిజిస్టరయిన ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఐటీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.మూడు వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని కేవలం ఎకరా.0.99 పైసలకే అమ్మబోవడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. లీజు కాకుండా ఇలా అమ్మడం చాలా దుర్మార్గమన్నారు. కనీసం కార్యాలయంగానీ, ఫోన్ నంబరుగానీ, ఒక ఉద్యోగిగానీ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూమిని కేటాయించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని, కంపెనీలకు ఉచితంగా భూములివ్వడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాల భూములున్నాయని, ఆయా భూములను రాష్ట్ర ప్రయోజనాలు… సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోకుండా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపట్టారు. సీఎం చంద్రబాబు స్పందించి… అనాలోచిత భూ కేటాయింపులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఉర్సా కంపెనీకి చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ భూముల వివరాలను బయటపెట్టాలి: సీపీఎం
ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక ఐటీ కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాలు భూమి కేటాయించినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనికి అధికారికంగా భూములు కేటాయించి ఉంటే వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు భూకేటాయింపులపై పారదర్శకంగా ఉండాలని, వాస్తవాలు వెల్లడించాలని కోరారు. కొద్ది రోజుల క్రితం టీసీఎస్‌కు ఎకరా రూ.99 పైసలకు 21 ఎకరాలు ప్రభుత్వం అమ్మినట్లుగా ప్రకటించిందని గుర్తుచేశారు. టీసీఎస్ ఆ భూముల్లో నిర్మాణాలు పూర్తయ్యేలోగా అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తాయని వార్తలు వచ్చాయని, కానీ ఉర్సా కంపెనీకి భూములు కేటాయించినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదన్నారు. ఇది వాస్తవమా కాదా … దీనిపై ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని, వాస్తవమైతే అంతకన్నా తప్పు మరొకటి ఉండదన్నారు. ఐటీలో ఎలాంటి చరిత్ర, అనుభవమూ లేని నిన్న మొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్ర్రోత్సాహం ఇవ్వాలన్న పేరుతో విలువైన భూములను ఉచితంగా ఇవ్వడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందన్నారు. భూమి ఇచ్చినందుకు కనీసం ప్రభుత్వం వాటాదారుగా లేదని, లీజు కాకుండా ఏకంగా రూ.99 పైసలకు అమ్మడమంటే ఉచితంగా దారాదత్తం చేయడమేనని తెలిపారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో పెత్తందార్లు దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు.