Friday, May 9, 2025
Homeలిక్కర్‌ స్కాంపై సిట్‌ దూకుడు

లిక్కర్‌ స్కాంపై సిట్‌ దూకుడు

. హైదరాబాద్‌లో నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు
. 11న విచారణకు రావాలని నోటీసులు అందజేత

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ దూకుడు పెంచింది. నిందితులైన కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలు హైదరాబాద్‌లో ఉంటుండగా, శుక్రవారం అధికారులు వారి నివాసాలు, కార్యాలయాలకు వెళ్లి సోదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాజీ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్‌ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప ఇళ్లు, కార్యాలయాలపై సిట్‌ అధికారులు సోదాలు జరిపారు. వారెవరూ ఇళ్లలో లేకపోవడంతో ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడ సిట్‌ కార్యాలయానికి రావాలని వారి కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణలపై సిట్‌ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగానూ సిట్‌ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌ చెబుతోంది. మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. క్రయ, విక్రయాల్లో పర్సంటేజ్‌ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్‌, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్‌ ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. దీనిపై వారిని విచారించేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు