చర్చలంటే… ఉగ్రవాదం, పీఓకేపైనే
. దుస్సాహసం చేస్తే… చావుదెబ్బే
. అణు బెదిరింపులకు భయపడం
. మీరు బతకాలంటే ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టండి
. పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
. కాల్పుల విరమణకు పాక్ పరుగెత్తుకొచ్చింది
. భారత్ షరతుల మేరకే చర్చలుంటాయని వెల్లడి
. సైన్యం పరాక్రమానికి సెల్యూట్ చేసిన ప్రధాని
న్యూదిల్లీ : అణ్వాయుధాలను బూచిగా చూపుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని పాకిస్థాన్‌ను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించారు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలన్నారు. ‘ఈ యుగం యుద్ధాలది కాదు… ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్ వెనుకాడదు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ ఉపేక్షించదు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకాకలంలో ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకాకలంలో సాగవు. ఉగ్రవాదం, నీటి పంపిణీ రెండూ ఏకాకలంలో నడవవు’ అని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ గట్టిగా హెచ్చరికలు పంపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే రెండుదేశాల మధ్య చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు. పాకిస్థాన్‌తో చర్చలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవన్నారు. ఆ దేశంతో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పైనే ఉంటాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా భారత సైన్యం వారిని దెబ్బతీసిందని మోదీ అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న పాకిస్థాన్ చర్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకపై ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్… ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయన్నారు. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయన్నారు. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయన్నారు. పాకిస్థాన్ అణు బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంతమాత్రం సహించేది లేదని…అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందన్నారు. ‘పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారు. కుటుంబసభ్యుల ముందే దారుణంగా కాల్చి చంపారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్. ఉగ్ర దాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో ఏడో తేదీ రాత్రి భారత్ చూపించింది. నిఘావర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది. భారత రక్షణదళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానికం’ అని మోదీ పేర్కొన్నారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోయిందని…పౌరులు, పార్టీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని చెప్పారు. ఉగ్రవాదుల శిబిరాలపై భారత క్షిపణులు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయని…బహావల్‌పూర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పింది. పాక్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశామన్నారు. పాకిస్థాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది. భారత్ చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని తెలిపారు. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తు కుంటూ వచ్చారన్నారు. రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచిపెట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతండాలను తుదముట్టిం చింది. భారత్ దెబ్బకు పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. అచేతనా వస్థకు చేరుకుంది. దాడులతో ఏటూ పాలుపోని పాక్… భారత్‌లోని జనా వాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లు, రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిసైళ్లు విధ్వంసం సృస్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి తిరగలేని స్థితిని భారత్ కల్పించిందని మోదీ తెలిపారు.


