న్యూదిల్లీ: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో ఏఏఐబీ పురోగతి సాధించింది. దిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్ బ్లాక్‌బాక్స్ డేటాను పూర్తిస్థాయిలో డౌన్లోడ్ చేసింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో బ్లాక్ బాక్స్ డేటా ద్వారా ప్రమాద సమయంలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణ ఉపకరించనుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. ‘విమాన ప్రమాదం తర్వాత ఘటనపై దర్యాప్తునకు జూన్ 13న ఏఏఐబీ డీజీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసింది. అదే రోజున ఘటనాస్థలంలోని రూఫ్‌టాప్‌పై ఫ్లైట్ డేటా రికార్డర్లు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను గుర్తించాం. ఆ తర్వాత విమాన బ్లాక్‌బాక్సులను కూడా స్వాధీనం చేసుకుని అత్యంత భద్రత నడుమ దిల్లీకి తరలించాం. జూన్ 24 నుంచి వీటిల్లోని డేటాను బయటకు తీసే ప్రక్రియను సాంకేతిక బృందం చేపట్టింది. విమానం ముందువైపు ఉండే బ్లాక్‌బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్‌ను కూడా సురక్షితంగా బయటకు తీశాం. జూన్ 25న మెమొరీ మాడ్యూల్‌ను విజయవంతంగా యాక్సెస్ చేసి అందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్‌లో డౌన్లోడ్ చేశాం. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉన్న డేటా విశ్లేషణ జరగుతోంది. ఫలితంగా ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేం దుకు, ప్రమాద కారణాలను వెలికితీసేందుకు అవకాశం ఏర్పడిరది. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర విమానయాన శాఖ పేర్కొంది. ఈనెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొన్నిసెకన్ల వ్యవధిలోనే సమీపంలోని బీజే వైద్యకళాశాల వసతిగృహంపై కుప్పకూలిన సంగతి విదితమే.


