. స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించాలి
. 9న సార్వత్రిక సమ్మెకు సంఫీుభావం
. ఇండోసోల్‌కు భూముల కేటాయింపు ఆపాలి
. రేపు కరేడుకు లెఫ్ట్ ప్రతినిధి బృందం
. వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని పది వామపక్ష పార్టీల సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమిం చాలని నిర్ణయించింది. జులై 9న అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెకు సమా వేశం సంఫీుభావం తెలిపింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో 8,458 ఎకరాల భూములు సేకరించడాన్ని నిరసిస్తూ… అక్కడి రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించింది. విజయవాడ దాసరి భవన్లో వామపక్ష పార్టీల రాష్ట్రస్థాయి సమావేశం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగింది. సీపీఐ నుంచి కె.రామకృష్ణ, జల్లి విల్సన్(మాజీ ఎమ్మెల్సీ), అక్కినేని వనజ, సీపీఎం నుంచి వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావు, జాస్తి కిశోర్‌బాబు(సీపీఐ`ఎంఎల్), పి.సుందర రామరాజు(ఫార్వర్డ్ బ్లాక్), ఎంసీపీఐ నుంచి కాటం నాగభూషణం, ఎస్కే ఖాదర్, కె.సుధీర్ (ఎస్‌యూసీఐ), పి.జానకిరాములు(ఆర్ఎస్పీ) హాజర య్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక సంఘాలు 9వ తేదీన నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 ఏళ్లలో కార్మికులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్లు తీసుకువచ్చి, పని గంటల భారం పెంచిందని ధ్వజమెత్తారు. అదేబాటలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మంత్రిమండలిలో తీర్మానించి… పని గంటలు పెంచడానికి ప్రయత్నించడంపై మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ 9న జరిగే సార్వత్రిక సమ్మెలో వామపక్షపార్టీలు ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడిరచారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు పరిసర ప్రాంతాల్లో షిర్డిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి 8,458 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే అప్పగించేం దుకు చేస్తున్న భూసమీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ… భూ పోరాట సాధన కమిటీ అధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన గ్రామ ప్రజలను, రైతులను పోలీసులు నిర్బంధానికి గురిచేయడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. జులై 2న వామపక్ష పార్టీల నేతృత్వంలో ప్రత్యేక బృందం కరేడు ప్రాంతాన్ని సందర్శించి… అక్కడి రైతులతో మాట్లాడి… ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తమవుతా మని చెప్పారు. తాము అధికారంలోకొచ్చాక కరెంటు చార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చి… అధికారం చేపట్టాక ఇప్పటికే నాలుగుసార్లు సర్దుబాటు చార్జీల పేరుతో కరెంటు చార్జీలు పెంచారని చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ హయాంలో అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను టీడీపీ వ్యతిరేకించిందని, ఇదే అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, ప్రస్తుత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సైతం కేసు వేశారని గుర్తుచేశారు. మోదీకి అదానీ మిత్రుడని, అందుకే అదానీకి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో వినియోగ దారులపై 20 సంవత్సరాలపాటు లక్షా 10 వేల కోట్ల భారం పడుతోందని వివరిం చారు. అదానీతో సోలార్ ఒప్పందాలు రద్దు చేయాలని, ట్రూఅప్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించు కోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నాడు స్మార్ట్ మీటర్లను పగలకొట్టాలని చెప్పిన చంద్రబాబు…నేడు ఆ మీటర్లు బిగించడం దారుణమని, ఈ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. దీనిపై త్వరలో వామపక్ష, ప్రజా తంత్ర శక్తులను కలుపుకుని… విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లోను పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తా మన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కరేడులో 8,458 ఎకరాల భూములను అక్రమంగా ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇదే కంపెనీకి రామాయపట్నం పోర్టు వద్ద భూములు ఇవ్వాలని నిర్ణయించగా… చంద్రబాబు కూటమి పార్టీలు అనేక మీడియా సమావేశాలు నిర్వహించి, భూ కుంభకోణం జరిగిందని, అది జగన్ బినామీ కంపెనీ అంటూ ఆరోపణలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే కంపెనీకి గత ప్రభుత్వం కంటే ఇంకా అధికంగా భూములను చంద్రబాబు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. కరేడు గ్రామంలోని భూములతోపాటు రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొట్టనగుంటలో తీసుకోనున్నారని, ఇందులో రెండు దళిత, గిరిజన గ్రామాలున్నాయని తెలిపారు. అవి పూర్తిగా లేచిపోయేలా ఉన్నాయని, భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వబోరని చెప్పారు. సార్వత్రిక సమ్మెకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా చూడాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కమ్యూనికేషన్ అమలైతే గతంలో 10 గంటల్లో చేసే పని…5 గంటల్లో చేయవచ్చని, ఆ దిశగా మనుషుల శ్రమ తగ్గించి, వారికి విశ్రాంతి ఇవ్వాలన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను గుట్టుచప్పుడు కాకుండా అదానీ మనుషులు ఇళ్లకు వచ్చి బిగిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారని తెలిపారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిశోర్‌బాబు మాట్లాడుతూ దేశంలోను, రాష్ట్రంలోను కార్పొరేట్ అనుకూల విధానాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.


