. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం
. ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ మౌనం
. ఓటర్ల తొలగింపునకు కేంద్రం కుట్ర
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ
విశాలాంధ్రహైదరాబాద్: ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత హిట్లర్ తరహాలో ప్రధాని మోదీ కూడా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ సైతం ప్రమాదంలో ఉన్నదని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులు రాజ్యాంగ, ప్రజాస్వామ్య శక్తులపై దాడి చేస్తున్నాయని, ఈ చర్యల పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. డిసెంబర్ 25న ఖమ్మంలో జరగనున్న ‘సీపీఐ శతాబ్ధి ఉత్సవాల’ను జయప్రదం చేయడం ద్వారా దేశం, ప్రపంచానికే బలమైన సందేశం ఇవ్వాలన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండి సురేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డి.రాజా జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు వివరించారు. బీజేపీఆర్ఎస్ఎస్ ప్రభుత్వం భారతదేశాన్ని కార్పొరేట్, ఫాసిస్టు రాజ్యం వైపు నెడుతోందని, లౌకిక, ప్రజాస్వామిక, సంక్షేమ భారతదేశంలో రాజ్యాంగం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతిస్తోందని డి.రాజా నిశితంగా విమర్శించారు. తానే భారత్, పాక్ యుద్ధం ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయం భారతదేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకు తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలు అడుగుతోందని, ఈ పత్రం తన వద్ద కూడా లేదన్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రాజా గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాల్లో బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ చొరబడుతున్నదని, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏఐటీయూసీ, రైతు విభాగాలను రాజకీయంగా మరింత చైతన్యవంతం చేయాలన్నారు.
పార్టీ బలోపేతంపై దృష్టి
పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని డి.రాజా పిలుపునిచ్చారు. పార్లమెంటరీ పోరాటం ద్వారానే రాజకీయ శక్తిగా దీటుగా నిలుస్తామన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం ఎత్తుకున్న మోదీ ప్రభుత్వ ఆ దిశగా ముందుకు సాగిందని, ఇప్పుడు ‘మావోయిస్ట్ ముక్త్ భారత్’ పేరుతో నక్సలైట్లపై కాల్పులు జరుపుతోందని, ఆ తర్వాత ‘కమ్యూనిస్టు ముక్త్ భారత్’ అనే ప్రమాదం లేకపోలేదని, అందుకే కమ్యూనిస్టులంతా అప్రమత్తమై పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వామపక్షాలు, కమ్యూనిస్టుల ఐక్యతకు సీపీఐ కట్టుబడి ఉందని, అదే సమయంలో పార్లమెంట్ ప్రాతినిధ్యం, క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పోరాట చరిత్ర ఉన్నదని, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, అలాంటి గడ్డపై సీపీఐని మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ మోదీ 77 దేశాలు సందర్శించినప్పటికీ పాకిస్థాన్ చేసిన ‘పహల్గామ్ దాడి’ తర్వాత ఒక్క దేశం కూడా భారతదేశానికి మద్దతుగా నిలువలేకపోయిందన్నారు. విదేశీ విధానం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కేంద్రంలో మోదీ అధికారంలో లేనప్పుడు ముడిచమురు ధర వంద డాలర్లు ఉండేదని, ఆ సమయంలో రాష్ట్రంలో పెట్రోల్ రూ.71.5, డీజిల్ రూ.57 ఉండేవని, ఇప్పుడు ముడిచమురు ధర 58 డాలర్లు ఉన్నప్పటికీ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిందని అజీజ్ పాషా గుర్తు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ‘ఆపరేషన్ కగార్’ విషయంలో సీపీఐ పాత్రను మేధావులు, కమ్యూనిస్టులు అభినందించారన్నారు. అన్ని వర్గాల సమస్యలను శాసనసభలో ప్రాస్తవించడంతో పాటు… ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన సీపీఐ నాయకులు పశ్య కన్నమ్మ, రఘుపాల్, సుగుణ, మావోయిస్టు నాయకులు కేశవరావుతోపాటు 26 మంది మావోయిస్టులు, ఇటీవల గుజరాత్ గంబీర వంతెన ప్రమాదంలో చనిపోయిన వారికి సమావేశం సంతాపం తెలియజేసింది.


